చిన్న వాట్సాప్ గ్రూప్ గా ప్రారంభమై, రూ.6200 కోట్ల విలువైన సంస్థగా మారి.. ఇప్పుడు నష్టాల్లోకి జారి..
చిన్న వాట్సాప్ గ్రూప్ గా ప్రారంభమైన ఒక భారతీయ సంస్థ అనతికాలంలోనే రూ. 6200 కోట్ల విలువైన కంపెనీగా ఎదిగింది. కానీ, మార్కెట్ ప్రతికూలతలను తట్టుకోలేక ప్రస్తుతం నష్టాల్లోకి జారి, ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేక, వారికి లేఆఫ్ ప్రకటించింది. అదే ప్రధాన నగరాల్లో గ్రోసరీ డెలివరీలను అందించే డుంజో (Dunzo) సంస్థ.
ప్రపంచంలో అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ ప్లాట్ఫామ లలో వాట్సాప్ ఒకటి. మిలియన్ల మంది వినియోగదారులు రోజువారీ కమ్యూనికేషన్ కోసం మెటా యాజమాన్యంలోని వాట్సాప్ ను యాక్సెస్ చేస్తారు. వాట్సప్ మొదట్లో కేవలం మెసేజింగ్ ప్లాట్ఫామ్ గానే లాంచ్ అయినప్పటికీ, చాలా మందికి బిజినెస్ అవకాశాలను కూడా అందించింది. అలా, వాట్సాప్ ను ఉపయోగించుకుని, అందులో చిన్న గ్రూప్ గా ప్రారంభమై రూ.6200 కోట్లకు పైగా విలువ చేసే సంస్థగా ఎదిగింది డుంజో (Dunzo).
ప్రస్తుతం నష్టాల్లోకి
భారత్ లోని ప్రధాన నగరాల్లో నిత్యావసరాలను సత్వరమే అందించే గ్రోసరీ డెలివరీ యాప్ గా డుంజో పాపులర్ అయింది. అనతి కాలంలోనే రూ. 6200 కోట్ల విలువైన సంస్థగా ఎదిగింది. కానీ, తరువాత పెరుగుతున్న అప్పులు, బకాయిలతో సతమతమవుతూ, ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేక వారిని తొలగిస్తోంది. ప్రస్తుతం కోర్ టీమ్ లో కేవలం 50 మంది ఉద్యోగులతో పనిచేస్తోంది.
వాట్సాప్ గ్రూప్ గా ప్రారంభమై
తన మొదటి స్టార్టప్ హాప్పర్ ను హైక్ కొనుగోలు చేసిన తరువాత, బెంగళూరుకు మకాం మార్చిన కబీర్ బిశ్వాస్, తన స్నేహితులైన అంకుర్ అగర్వాల్, దల్వీర్ సూరి, ముకుంద్ ఝాలతో కలిసి డుంజోను మొదట ఒక వాట్సాప్ (WHATSAPP) గ్రూప్ గా ప్రారంభించాడు. బ్లింకిట్, స్విగ్గీ ఇన్స్టామార్ట్ వంటి పోటీదారుల ఆవిర్భావానికి ముందే డుంజో (DUNZO) మొదట్లో కిరాణా, నిత్యావసర సరుకులు, ఇతర డెలివరీలను అందించింది. వినియోగదారులు తమ ఆర్డర్లు ఇవ్వడానికి ఇది ఒక వాట్సాప్ గ్రూప్ గా ప్రారంభమైంది. స్థిరమైన వృద్ధి మరియు పెట్టుబడి ద్వారా, డుంజో ఒక ప్రత్యేక యాప్ ను అభివృద్ధి చేసింది. క్రమంగా ఇతర నగరాలకు విస్తరించింది.
రిలయన్స్ గ్రూప్ పెట్టుబడులు
ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ (RELIANCE) రిటైల్ డుంజో స్టార్టప్ పై ఆసక్తి కనబరిచి 200 మిలియన్ డాలర్లు (రూ.1600 కోట్లు) పెట్టుబడి పెట్టింది. ఈ పెట్టుబడితో డుంజో విలువ 775 మిలియన్ డాలర్లకు (రూ.6200 కోట్లకు పైగా) చేరుకుంది. అయితే, ఆ తరువాత ఈ కంపెనీ, పోటీ సంస్థలను ఎదుర్కోలేక సంక్షోభంలో చిక్కుకుంది. గత ఏడాదిలో తమ ఉద్యోగుల జీతాలను అనేకసార్లు ఆలస్యం చేసింది. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ .1,800 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 288 శాతం ఎక్కువ.