Samsung India workers' strike: శాంసంగ్ ఇండియా కార్మికుల సమ్మె: పండుగ సీజన్ లో ప్రొడక్షన్ కు దెబ్బ-samsung india workers strike production affected ahead of festive season ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Samsung India Workers' Strike: శాంసంగ్ ఇండియా కార్మికుల సమ్మె: పండుగ సీజన్ లో ప్రొడక్షన్ కు దెబ్బ

Samsung India workers' strike: శాంసంగ్ ఇండియా కార్మికుల సమ్మె: పండుగ సీజన్ లో ప్రొడక్షన్ కు దెబ్బ

Sudarshan V HT Telugu
Sep 10, 2024 07:34 PM IST

Samsung India workers' strike: తమిళనాడులోని శ్రీపెరంబదూరులో ఉన్న శాంసంగ్ ఇండియా సంస్థ లోని కార్మికుల సమ్మె కొనసాగుతోంది. శాంసంగ్ ఇండియా కార్మికులు అధిక వేతనాలు కోరుతూ సోమవారం నుంచి సమ్మె ప్రారంభించారు. ఇది పండుగ సీజన్ కావడంతో, కార్మికుల సమ్మె, సంస్థ ప్రొడక్షన్ పై ప్రతికూల ప్రభావం చూపనుంది.

శ్రీపెరంబదూరులో శాంసంగ్ ఇండియా కార్మికుల సమ్మె
శ్రీపెరంబదూరులో శాంసంగ్ ఇండియా కార్మికుల సమ్మె (REUTERS)

Samsung India workers' strike: దక్షిణ భారతదేశంలోని శామ్సంగ్ ఎలక్ట్రానిక్స్ కర్మాగారంలో వందలాది మంది ఉద్యోగులు అధిక వేతనాల కోసం సమ్మెకు దిగడంతో మంగళవారం రెండో రోజు సంస్థ ప్రొడక్షన్ కార్యకలాపాలకు అంతరాయం కలిగింది. భారతదేశపు అతిపెద్ద కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయిన శాంసంగ్ ఇండియా భారత్ లో టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, స్మార్ట్ ఫోన్లు సహా పలు ప్రొడక్ట్స్ ను ఉత్పత్తి చేస్తోంది. భారత్ లో శాంసంగ్, ఎల్జి ఎలక్ట్రానిక్స్ ల మధ్య ప్రధానంగా పోటీ నెలకొని ఉంటుంది.

వార్షిక ఆదాయం 12 బిలియన్ డాలర్లు

తమిళనాడులోని శ్రీపెరంబదూరులో ఉన్న కార్మాగారంలో శాంసంగ్ ప్రధానంగా ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను ప్రొడ్యూస్ చేస్తుంది. భారత్ లో శామ్సంగ్ కు ఉన్న రెండు కర్మాగారాలలో ఇది చిన్నది. ఇక్కడ స్మార్ట్ ఫోన్స్ ఉత్పత్తి కావు. భారతదేశంలో శాంసంగ్ వార్షిక ఆదాయం 12 బిలియన్ డాలర్లు. కాగా, ఇందులో శ్రీపెరంబదూరు ప్లాంట్ వాటా 20% నుండి 30% వరకు వరకు ఉంటుంది. చెన్నై నగరానికి సమీపంలోని శ్రీపెరంబుదూరులోని కర్మాగారం వెలుపల "నిరవధిక సమ్మె" అనే పదాలతో కూడిన పోస్టర్లు వెలిశాయి, అక్కడ కంపెనీ యూనిఫాం ధరించిన వందలాది మంది కార్మికులు అదే ప్రాంగణంలో గుడారాలు ఏర్పాటు చేసుకుని నిరసన తెలుపుతున్నారు. సమ్మె రెండో రోజుకు చేరిందని యూనియన్ నాయకుడు ఇ.ముత్తుకుమార్ తెలిపారు.

సగానికి తగ్గిన ప్రొడక్షన్

చాలా మంది కార్మికులు సమ్మెకు దిగడంతో సోమవారం ఫ్యాక్టరీ రోజువారీ ఉత్పత్తిలో సగానికి పైగా తగ్గింది. భారతదేశంలో పండుగ సీజన్ లో కంపెనీలు ప్రకటించే ఆఫర్స్, డిస్కౌంట్స్ కు ఆకర్షితులై పెద్ద ఎత్తున వినియోగదారులు వివిధ ఉత్పత్తులను కొనుగోలు చేస్తారు. శాంసంగ్ ఇండియా కార్మికుల సమ్మె కొనసాగితే పండుగ సీజన్ సేల్స్ లో శాంసంగ్ దెబ్బతినే అవకాశం ఉంది. ఉత్తర ప్రదేశ్ లోని మరో పెద్ద ప్లాంట్ స్మార్ట్ ఫోన్లను తయారు చేస్తుంది.

ఈ డిమాండ్లతో సమ్మె

అధిక వేతనాలు, సరైన పని గంటలు, యూనియన్ కు కంపెనీ గుర్తింపు తదితర డిమాండ్లతో కార్మికులు నిరసన తెలుపుతున్నారు. అలాగే, సమాన అనుభవం ఉన్న ఉద్యోగులకు విదేశాల్లోని ఉద్యోగులతో సమానంగా వేతనాలు ఇవ్వాలని భారత్ లోని ఉద్యోగులు కోరుతున్నారు. ఈ సమ్మెపై కానీ, కార్మికుల డిమాండ్లపై కానీ శాంసంగ్ (SAMSUNG) ఇండియా స్పందించలేదు. కార్మికులకు ఏవైనా ఫిర్యాదులు ఉంటే వాటిని పరిష్కరించడానికి, అన్ని చట్టాలు, నిబంధనలను పాటించడానికి కార్మికులతో సంప్రదింపులు జరుపుతున్నామని కంపెనీ ప్రతినిధి సోమవారం చెప్పారు.

దక్షిణ కొరియాలోనూ సమ్మె

సెప్టెంబర్ నుంచి భారత్ లో పండుగ సీజన్ ప్రారంభమవుతుంది. ఈ సీజన్ లో అమ్మకాలకు ఈ సమ్మె ఆటంకం కలిగిస్తుందని సైబర్ మీడియా రీసెర్చ్ వైస్ ప్రెసిడెంట్ ప్రభు రామ్ అన్నారు. శ్రీ పెరంబదూరు ప్లాంట్ లో శాంసంగ్ కు చెందిన 1,800 మంది ఉద్యోగుల్లో దాదాపు సగం మంది సమ్మెలో ఉన్నారని పలువురు తెలిపారు. దక్షిణ కొరియాలో శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ లోని 36,500 మంది సభ్యులున్న కార్మిక సంఘం కూడా అధిక వేతనాలు, ఇతర ప్రయోజనాలను డిమాండ్ చేస్తూ జూలై, ఆగస్టు నెలల్లో చాలా రోజులు సమ్మె చేశారు.