Slum To Dubai : మురికివాడలో పుట్టాడు.. ముళ్ల బాటలో నడిచాడు.. పెద్ద వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు
Slum To Dubai : జీవితంలో గెలిచేవారు ఎక్కడో ఉండరు.. మన పక్కనే ఉంటారు. ఏదో ఒక సమయంలో అందనంత ఎత్తులో కనిపిస్తారు. అలాంటి వ్యక్తే రిజ్వాన్ సజన్. మురికివాడలో పుట్టిన ఈ పేదవాడు.. ఇప్పుడు వేల కోట్లకు అధిపతి అయ్యాడు. దుబాయ్‌లో ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు. చాలా మందికి రిజ్వాన్ జీవితం ఓ గొప్ప పాఠం.
విజయం అంటే ఇలా ఉండాలి.. ముంబయిలోని మురికివాడలో పుట్టి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించాడు ఓ వ్యక్తి. దుబాయ్‌లోని సంపన్న ప్రపంచంలో తనకంటూ గొప్ప పేరును లిఖించుకున్నాడు. ఇతను డానుబే గ్రూప్ వ్యవస్థాపకుడు రిజ్వాన్ సజన్. రాళ్లు, ముళ్ల బాటలో పయనిస్తూ అత్యున్నత శిఖరాలకు చేరుకున్న రిజ్వాన్ జీవితం స్ఫూర్తిదాయకం.
మురికివాడలో పుట్టి
రిజ్వాన్ ముంబైలోని ఘట్కోపర్ మురికివాడలో పుట్టి పెరిగాడు. నిరుపేద కుటుంబంలో పుట్టిన రిజ్వాన్ ముంబైలోని మురికివాడల్లో ఉండేవాడు. రిజ్వాన్ తండ్రికి చిన్న లాటరీ తగిలింది. వారంతా పక్కనే ఉన్న చిన్న అపార్ట్‌మెంట్‌లోకి మారారు. అతని తండ్రి కుటుంబాన్ని పోషించడానికి తన శాయశక్తులా ప్రయత్నించేవాడు. కానీ పిల్లల చదువుల ఫీజులు కట్టలేక ఇబ్బంది పడ్డాడు. రిజ్వాన్ క్యాంటీన్‌లో తినడానికి లేదా బస్సులో పాఠశాలకు వెళ్లడానికి డబ్బు లేదు. ఈ కారణంగా తండ్రి నుండి కొంత డబ్బు తీసుకుని చిన్న వ్యాపారం చేశాడు.
జీవితంలో విషాదం
పెద్దమొత్తంలో పుస్తకాలు కొని తన స్నేహితులకు మార్కెట్ రేట్లకు అమ్మడం మొదలుపెట్టారు. ఇంటింటికీ వెళ్లి పాల ప్యాకెట్లు కూడా పంపిణీ చేయడం ప్రారంభించారు. రాఖీలు కొనడం, అమ్మడం దగ్గర్నుంచి పటాకులు అమ్మడం వరకు అదనంగా డబ్బు సంపాదించడం కోసం చేయగలిగినదంతా చేశారు. అలా 16 ఏళ్లు వచ్చేసరికి అతని జీవితంలో విషాదం నెలకొంది. తండ్రిని కోల్పోయిన రిజ్వాన్ చదువు మానేసి కుటుంబ బాధ్యతలు చూసుకోవాల్సి వచ్చింది.
మళ్లీ జీరో నుంచి
రిజ్వాన్ సజన్ 1981లో కువైట్‌కి వెళ్లి మరింత డబ్బు సంపాదించి తన మామ నడుపుతున్న బిల్డింగ్ మెటీరియల్స్ స్టోర్‌లో సేల్స్‌మెన్‌గా పని చేయడం ప్రారంభించాడు. అంతా సజావుగా సాగుతోంది కానీ దురదృష్టవశాత్తు మళ్లీ అన్నీ కోల్పోవాల్సి వచ్చింది. 1991లో గల్ఫ్ యుద్ధంతో ముంబయికి తిరిగి రావాల్సిన అవసరం ఏర్పడింది. ముంబయిలో మళ్లీ సాధారణ జీవితం గడపాల్సి వచ్చింది.
కొన్ని సంవత్సరాల తరువాత దుబాయ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మళ్లీ బయలుదేరాడు. 1993లో రిజ్వాన్ వ్యాపార సంస్థను ప్రారంభించాడు. బ్రోకరేజ్ వ్యాపారం నుండి కొంత కమీషన్ సంపాదించడం మెుదలుపెట్టాడు. పట్టిందల్లా బంగారమే కావడంతో అతని కష్టానికి ఫలితం దక్కడం మొదలైంది.
వ్యాపారాల్లోకి..
కొన్నాళ్ల తర్వాత బిల్డింగ్ మెటీరియల్ వ్యాపారం ప్రారంభించాడు. తరువాతి దశాబ్దంన్నర కాలంలో భిన్నమైన వ్యాపారాల్లోకి చేరాడు. వ్యాపారంలోకి మరింత ముందుకు వెళ్లాలని నిర్ణయించుకుని 2006లో మిలానో అనే పరిశుభ్రత పరిష్కారాల బ్రాండ్‌ను ప్రారంభించాడు. 2008లో డానూబ్ హోమ్‌తో కలిసి గృహోపకరణాల వ్యాపారంలోకి ప్రవేశించాడు. 2014లో రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెనుదిరిగి చూసుకోలేదు.
2019 నాటికి, డానూబ్ గ్రూప్ USD 1.3 బిలియన్ల వార్షిక టర్నోవర్‌ను కలిగి ఉంది. మార్కెట్‌లలో బలంగా వృద్ధి చెందింది. డానుబే గ్రూప్ ఒమన్, బహ్రెయిన్, సౌదీ అరేబియా వంటి దేశాలకు తన కార్యకలాపాలను విస్తరించింది.
కోట్లకు అధిపతి
రిజ్వాన్ దూరదృష్టి, పట్టుదల అద్భుతమైన ఆర్థిక విజయానికి దారితీశాయి. యూఏఈ ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకారం రూ. 20,830 కోట్లు నికర విలువతో రిజ్వాన్ సజన్ ఇప్పుడు దుబాయ్‌లోని అత్యంత సంపన్న భారతీయులలో ఒకరిగా ఎదిగారు. కృషి ఉంటే బస్తీ నుంచి వచ్చినా బలంగా నిలుచుంటామని చెప్పేందుకు రిజ్వాన్ జీవితమే ఒక ఉదాహరణ.