RBI Monetary Policy: ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం రేపే.. రెపొ రేటు మారుస్తారా?-rbi monetary policy committee meeting from april 3 what to expect on repo rate ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Rbi Monetary Policy: ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం రేపే.. రెపొ రేటు మారుస్తారా?

RBI Monetary Policy: ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశం రేపే.. రెపొ రేటు మారుస్తారా?

HT Telugu Desk HT Telugu
Apr 02, 2024 02:21 PM IST

RBI Monetary Policy: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ సమావేశం ఏప్రిల్ 3వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు జరగనుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో జరుగుతున్న తొలి సమావేశం ఇదే. ఈ భేటీలో రెపో రేటు సహా.. కీలక బెంచ్ మార్క్ వడ్డీ రేట్లపై ఏ విధమైన నిర్ణయం తీసుకోనున్నారనేది ఆసక్తిగా మారింది.

రేపటి నుంచి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశాలు
రేపటి నుంచి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశాలు

2025 ఆర్థిక సంవత్సరానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) మానిటరీ పాలసీ కమిటీ మొదటి విధాన సమావేశం ఏప్రిల్ 3 నుండి ఏప్రిల్ 5 వ తేదీ వరకు జరగనుంది. సాధారణంగా ప్రతీ 2 నెలలకు ఒకసారి ఈ సమావేశాలు జరుగుతాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి (FY 25) ఆర్బీఐ ప్రకటించిన మానిటరీ పాలసీ కమిటీ (MPC) సమావేశాల షెడ్యూల్ ప్రకారం, ఈ సమావేశాలు ఏప్రిల్, జూన్, ఆగస్టు, అక్టోబర్, డిసెంబర్ ఫిబ్రవరి లో జరగనున్నాయి.

ఆరుగురు సభ్యుల కమిటీ

ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి సమావేశాలు ఏప్రిల్ 3 నుంచి ఏప్రిల్ 5 వరకు జరుగుతున్నాయి. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని మానిటరీ పాలసీ కమిటీ ప్యానెల్లో మొత్తం ఆరుగురు సభ్యులు ఉన్నారు. సమావేశాల అనంతరం ఏప్రిల్ 5న ఉదయం 10 గంటలకు ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) కమిటీ నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీలో ఆర్బీఐ గవర్నర్ తో పాటు డాక్టర్ మైఖేల్ దేబబ్రత పాత్రా, శశాంక భిడే, అషిమా గోయల్, రాజీవ్ రంజన్, జయంత్ ఆర్ వర్మ లు సభ్యులుగా ఉన్నారు.

ఈ ఆర్థిక సంవత్సరంలో ఎంపీసీ సమావేశాల తేదీలు

ఈ ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ (RBI Monetary Policy Committee) కమిటీ సమావేశాలు జరిగే తేదీల వివరాలను ఆర్బీఐ ప్రకటించింది. ఆర్బీఐ వెల్లడించిన వివరాల ప్రకారం ఆర్బీఐ ఎంపీసీ సమావేశాల షెడ్యూల్ ఈ కింది విధంగా ఉంది.

  • ఏప్రిల్ 3-5, 2024
  • జూన్ 5-7, 2024
  • ఆగస్టు 6-8, 2024
  • అక్టోబర్ 7-9, 2024
  • డిసెంబర్ 4-6, 2024
  • ఫిబ్రవరి 5-7, 2025.

ఫిబ్రవరి సమావేశంలో ఏం జరిగింది?

2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆర్బీఐ చివరి ఎంపీసీ (RBI Monetary Policy Committee)సమావేశం 2024 ఫిబ్రవరి 6వ తేదీ, 7వ తేదీ, 8వ తేదీల్లో జరిగింది.ఈ సమావేశాల్లో బెంచ్ మార్క్ వడ్డీ రేట్లో ఒకటైన రెపో రేటును వరుసగా ఆరోసారి 6.5 శాతం వద్ద యథాతథంగా ఉంచాలని నిర్ణయించారు. ద్రవ్యోల్బణ ఆందోళనలను ఉదహరించిన సెంట్రల్ బ్యాంక్ ద్రవ్యోల్బణం లక్ష్యానికి అనుగుణంగా బెంచ్ మార్క్ వడ్డీ రేట్లను కొనసాగిస్తున్నామని తెలిపింది.