RBI Repo Rate: గుడ్‍న్యూస్ చెప్పిన ఆర్‌బీఐ.. రెపో రేటు యథాతథం
RBI Repo Rate: ఆర్‌బీఐ కీలక వడ్డీ రేటును యథాతథంగా ఉంచింది. దీంతో రెపో రేటు 6.50 శాతం వద్ద కొనసాగింది. పూర్తి వివరాలివే.
RBI Repo Rate: భారతీయ రిజర్వ్ బ్యాంక్ (Reserve Bank of India - RBI) గుడ్‍న్యూస్ చెప్పింది. రెపో రేటును యథాతథంగా ఉంచింది. పెంపు ఉంటుందని అంచనాలు రాగా.. ఆర్బీఐ మాత్రం ప్రస్తుత రేటునే కొనసాగించేందుకు మొగ్గుచూపింది. దీంతో రెపో రేటు 6.50 శాతం వద్ద కొనసాగనుంది. మూడు రోజుల పాటు సాగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ (Monetary Policy Committee - MPC) ద్వైమాసిక సమావేశంలో ఆర్‌బీఐ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. కమిటీ నిర్ణయాలను ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) గురువారం వెల్లడించారు. రెపో రేటును 6.50 శాతం వద్ద యథాతథంగా కొనసాగిస్తున్నట్టు వెల్లడించారు. గతేడాది మే నుంచి రెపో రేటును ఆరుసార్ల పాటు 250 పాయింట్లు (2.50 శాతం) పెంచిన ఆర్బీఐ ఈసారి మార్పు చేయలేదు.
6.5 శాతం వృద్ధి అంచనా
కాగా, 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 7 శాతం పెరిగిందని శక్తికాంత దాస్ అన్నారు. ఆర్థిక వ్యవస్థ నిలకడగా ఉందని ఇది సూచిస్తోందని చెప్పారు. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు చర్యలు కొనసాగిస్తూనే ఉంటామని చెప్పారు. ద్రవ్యోల్బణం అనుకున్న లక్ష్యం పరిధిలోకి వచ్చే వరకు కావాల్సిన చర్యలు చేపడతామని అన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి 6.5 శాతంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు ఆర్బీఐ గవర్నర్ చెప్పారు. భారత దేశ బ్యాంకింగ్ వ్యవస్థ పటిష్టంగా ఉందని భరోసా ఇచ్చారు. ఇక
ఊరట
RBI Repo Rate: గతేడాది మే నెలకు ముందు ఆర్‌బీఐ రెపో రేటు 4 శాతంగా ఉండేది. ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసే చర్యల్లో భాగంగా అప్పటి నుంచి ఆర్‌బీఐ కీలక వడ్డీ రేటును పెంచుకుంటూ వస్తోంది. వరుసగా ఆరుసార్లు అధికంగా చేయగా ఫిబ్రవరి నాటికి 6.50 శాతానికి రెపో రేటు చేరింది. దీంతో వాణిజ్య బ్యాంకుల్లో రుణ రేట్లు పెరుగుతూ వచ్చాయి. హోమ్ లోన్స్ తీసుకున్న వారికి ఈఎంఐ భారం కూడా అధికమైంది. ఇప్పుడు రెపో రేటును ఆర్బీఐ మార్చకపోవడం కాస్త ఊరటగా చెప్పవచ్చు.
RBI Repo Rate: సాధారణంగా వాణిజ్య బ్యాంకులు.. సెంట్రల్ బ్యాంక్ అయిన ఆర్‌బీఐ వద్ద రుణాలు తీసుకుంటాయి. రెపో రేటు ఆధారంగా ఆ లోన్లపై బ్యాంకుల నుంచి ఆర్‌బీఐ వడ్డీ వసూలు చేస్తుంది. రెపో రేటు పెరిగితే బ్యాంకులు చెల్లించాల్సిన వడ్డీ పెరుగుతుంది. అందుకే తమ వద్ద రుణం తీసుకున్న వారికి ఈ భారాన్ని బ్యాంకులు బదిలీ చేస్తాయి.
రెపో రేటు పెరిగినప్పుడల్లా.. రుణాలపై వడ్డీ రేట్లను పెంచుతుంటాయి. దీంతో రుణగ్రహీతలు ఎక్కువ మొత్తం చెల్లించాల్సి వస్తుంది. రెపో రేటు పెరిగితే, కొత్తగా బ్యాంకుల్లో రుణాలు తీసుకునే వారికి కూడా వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. రెపో రేటును బట్టి ఎప్పటికప్పుడు వడ్డీ రేట్లను బ్యాంకులు సవరిస్తుంటాయి. ఒకవేళ రెపో రేటు తగ్గితే వడ్డీని కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. స్థిరంగా ఉంటే వడ్డీ రేట్లు కూడా దాదాపు అలాగే కొనసాగుతాయి.