RBI Monetary Policy: ఊహించినట్లే.. యథాతథంగా కీలక వడ్డీ రేట్లు
RBI Monetary Policy: రెపో రేటు (repo rate)ను 6.5 శాతంగానే కొనసాగించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్ణయించింది. గ నాలుగు సమావేశాల్లోనూ రెపో రేటులో ఎలాంటి మార్పులు చేయకపోవడం గమనార్హం.

RBI Monetary Policy: మార్కెట్ వర్గాలు ఊహించినట్లే ఆర్బీఐ (RBI) వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఈ సంవత్సరంలో ఐదవ ఆర్బీఐ పాలసీ సమావేశం శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ అధ్యక్షతన జరిగింది. రెపో రేటును మార్చడం లేదని, రెపో రేటు 6.5% గా కొనసాగుతుందని ఈ సందర్భంగా శక్తి కాంత్ దాస్ ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ఆర్బీఐ మానెటరీ పాలసీ కమిటీలోని మొత్తం ఆరుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారని తెలిపారు.
ఇతర వడ్డీ రేట్లు
పాలసీ రెపో రేటును 6.5 శాతంగా, అలాగే స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ ని 6.25 శాతంగా, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీని 6.75 శాతంగా, బ్యాంక్ రేటును 6.75 శాతంగా కొనసాగిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ద్రవ్యోల్బణం పై పోరు ముగియలేదని, అది ఇంకా కొనసాగుతుందని ఈ సందర్భంగా శక్తి కాంత్ దాస్ ప్రకటించారు. ద్రవ్యోల్బణాన్ని 4% వద్ద నియంత్రించాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు. అలాగే, సీపీఐ ద్రవ్యోల్బణ అంచనాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 5.4%, రెండో త్రైమాసికంలో 6.4%, మూడో త్రైమాసికంలో 5.6%, చివరి త్రైమాసికంలో 5.2% గా ఉన్నాయి.
జీడీపీ అంచనా..
మరోవైపు, జీడీపీ వృద్ధి రేటు అంచనాలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 6.5%, రెండో త్రైమాసికంలో 6.5%, మూడో త్రైమాసికంలో 6%, చివరి త్రైమాసికంలో 5.7% గా ఉన్నాయి. ప్రభుత్వ సెక్యూరిటీలను ఇక ఓపెన్ మార్కెట్ లో అమ్మే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ తెలిపారు. మరోవైపు, కొన్ని ఎంపిక చేసిన అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకుల్లో బుల్లెట్ రీ పేమెంట్ స్కీమ్ కింద గోల్డ్ లోన్ పరిమితిని రూ. 2 లక్షల నుంచి రూ. 4 లక్షలకు పెంచుతున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.