EV Scooter Sales : సెప్టెంబర్‌లో తగ్గిన ఓలా ఈవీ అమ్మకాలు.. ఆ గ్యాప్‌లోకి దూరేసిన టీవీఎస్, బజాజ్
EV Scooter Sales In September : దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్ల వాడకం పెరిగింది. ఈ సెగ్మెంట్‌లో మార్కెట్‌లోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే ఓలా అందరి దృష్టిని ఆకర్శించింది. అయితే సెప్టెంబర్ అమ్మకాలు మాత్రం కాస్త తగ్గాయి.
దేశంలోని ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో ఓలా ఎలక్ట్రిక్ తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకుంది. మెుదట్లో నెలకు లక్షకు పైగా ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించడం ద్వారా ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లో దాదాపు 50 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. కానీ సెప్టెంబరు 2024 నెల గణాంకాలు చూస్తే మాత్రం వెనకపడింది. ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాలు క్షీణించడంతో పోటీదారులు బజాజ్ చేతక్, టీవీఎస్ మోటార్ అమ్మకాలు ఆ గ్యాప్‌లోకి వచ్చేశాయి. గత నెలలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విక్రయాలలో కనిపించిన ట్రెండ్‌లను చూద్దాం..
2024 క్యాలెండర్ సంవత్సరంలో మొదటి ఏడు నెలల్లో ఓలా ఎలక్ట్రిక్ నెలకు సగటున 37,695 యూనిట్లను విక్రయించింది. కానీ ఆగస్టు నెల నాటికి అమ్మకాలు 26,928 యూనిట్లకు మారాయి. ఇప్పుడు ఓలా స్కూటర్ల డిమాండ్ మళ్లీ పడిపోయిందని సెప్టెంబర్ సేల్స్ గణాంకాలు సూచిస్తున్నాయి. గత నెలలో ఓలా విక్రయాలు 23,965 యూనిట్లుగా ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే అమ్మకాలు 29 శాతం క్షీణించాయి.
అక్టోబర్ 2023 నుండి గత 11 నెలల్లో కంపెనీకి ఈ సెప్టెంబర్ చూసుకుంటే అత్యల్ప విక్రయాలుగా ఉంది. సెప్టెంబర్‌లో ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్ షేర్ భారీగా పడిపోయింది. ఓలా ప్రస్తుత మార్కెట్ వాటా దాదాపు 26 శాతం. మార్చి నుండి జూలై 2024 మధ్య కాలంలో Ola 38 శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. జనవరిలో 31,785 యూనిట్ల అమ్మకాలతో క్యాలెండర్ ఇయర్‌ను ఓలా గట్టిగా ప్రారంభించింది. మార్చిలో 52,136 యూనిట్ల ఈవీలను విక్రయించింది.
గత తొమ్మిది నెలల్లో ఓలా 3,14,761 యూనిట్ల ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. దాని మొత్తం మార్కెట్ వాటాను 39 శాతంగా క్రియేట్ చేసుకుంది. ఏడాది క్రితం ఇది 30 శాతంగా ఉంది.
గత నెలలో బజాజ్ చేతక్ టీవీఎస్ ఐక్యూబ్‌ను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకుంది. బజాజ్ చేతక్ గత నెలలో 17,000 యూనిట్లను విక్రయించింది. 16,000 యూనిట్ల విక్రయాలతో టీవీఎస్ మూడో స్థానంలో ఉంది. రెండు కంపెనీలు ఇప్పుడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల విభాగంలో మొత్తం మార్కెట్ వాటాలో ఐదో వంతుగా ఉన్నాయి. కొత్త, సరసమైన మోడళ్లను ప్రవేశపెట్టడం వల్ల ఈ కంపెనీల విజయం సాధించాయి. భారతదేశంలోని మరో ప్రముఖ కంపెనీ ఏథర్ ఎనర్జీ సెప్టెంబర్‌లో దాని అమ్మకాలను రెట్టింపు చేసింది. సెప్టెంబర్‌లో 11,000 యూనిట్ల విక్రయాలతో ఏథర్ ఎనర్జీ మార్కెట్ వాటా 14 శాతానికి చేరువైంది.
ఓలా కంపెనీ డిసెంబర్ నాటికి కంపెనీ సర్వీస్ సెంటర్ల సంఖ్యను 1,000కు పెంచనున్నట్లు తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ భారతదేశం అంతటా 500 సర్వీస్ సెంటర్లను కలిగి ఉంది. డిసెంబర్ చివరి నాటికి 1000కు పెంచాలని యోచిస్తోంది. ఓలా భాగస్వామ్య కార్యక్రమం కింద ద్విచక్ర వాహన వర్క్‌షాప్‌లను నడుపుతున్న స్వతంత్ర మెకానిక్‌లకు శిక్షణ ఇవ్వాలని కూడా నిర్ణయించింది. ఇందుకోసం దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు లక్ష మంది మెకానిక్‌లను ఎంపిక చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు ఓలా స్కూటర్లు సర్వీస్ చేయడంలో జాప్యం జరుగుతోందని ఫిర్యాదులు వచ్చాయి. కంపెనీ క్విక్ సర్వీస్ గ్యారెంటీని కూడా లాంచ్ చేస్తుంది.