Ola Electric: సర్వీస్ సరిగ్గా లేదని ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్ ను తగలబెట్టిన కస్టమర్-ola electric customer sets karnataka showroom on fire for staffs negligence ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Ola Electric: సర్వీస్ సరిగ్గా లేదని ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్ ను తగలబెట్టిన కస్టమర్

Ola Electric: సర్వీస్ సరిగ్గా లేదని ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్ ను తగలబెట్టిన కస్టమర్

Sudarshan V HT Telugu
Sep 11, 2024 05:55 PM IST

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనుగోలు చేసిన ఒక కస్టమర్.. లోపభూయిష్టమైన స్కూటర్ ను ఇవ్వడమే కాక, దాన్ని సరిగ్గా సర్వీస్ చేయని షో రూమ్ పై ఇలా కక్ష తీర్చుకున్నారు. ఏకంగా ఆ ఓలా ఎలక్ట్రిక్ షో రూమ్ కు మంట పెట్టి, దాన్ని పాక్షికంగా తగలబెట్టాడు. ఈ ఘటన కర్నాటకలోని కలబుర్గిలో జరిగింది.

సర్వీస్ సరిగ్గా లేదని ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్ ను తగలబెట్టిన కస్టమర్
సర్వీస్ సరిగ్గా లేదని ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్ ను తగలబెట్టిన కస్టమర్

తన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ను సరిగ్గా రిపేర్ చేయలేదని కోపంతో ఒక ఓలా ఎలక్ట్రిక్ కస్టమర్ ఉత్తర కర్ణాటకలోని కలబుర్గిలోని ఓలా ఎలక్ట్రిక్ షోరూమ్ కు నిప్పు పెట్టాడు. ఆగస్ట్ లో తాను ఓలా ఎలక్ట్రిక్ షో రూమ్ నుంచి ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొన్నానని, కొనుగోలు చేసి నెల రోజులు కూడా కాకముందే, తాను కొన్న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ సరిగ్గా పని చేయడంలేదని, స్కూటర్ లో అనేక లోపాలు ఉన్నాయని ఆ కస్టమర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

షో రూమ్ కు నిప్పు..

తను కొన్న ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ (electric scooter) ను రిపేర్ చేసి ఇవ్వాలని ఓలా ఎలక్ట్రిక్ షో రూమ్ ను సంప్రదించాడు. కానీ, వారి నుంచి సరైన స్పందన రాలేదు. దాంతో, కోపోద్రిక్తుడైన 26 ఏళ్ల మహ్మద్ నదీమ్ అనే ఆ కస్టమర్ పెట్రోల్ పోసి షోరూంకు నిప్పు అంటించాడు. వివరాల్లోకి వెళితే.. ఉత్తర కర్ణాటకలోని కలబుర్గి నివాసి అయిన 26 ఏళ్ల మహ్మద్ నదీమ్ ఆగస్టు 28 న ఓలా ఎలక్ట్రిక్ షో రూమ్ లో ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొనుగోలు చేశాడు. కొన్న రోజు నుంచీ దానితో నిరంతరం సమస్యలను ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా, స్కూటర్ బ్యాటరీ, సౌండ్ సిస్టమ్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఓలా ఎలక్ట్రిక్ షో రూమ్ సిబ్బందికి పదేపదే ఫిర్యాదులు చేశాడు. స్వయంగా పలుమార్లు షోరూమ్ కు వెళ్లాడు. కానీ, వారు సరిగ్గా స్పందించలేదు. దాంతో అతడు అసంతృప్తి చెందాడు.

రూ.8.5 లక్షల నష్టం

నదీమ్ ఆ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుకు రూ.1.4 లక్షలు ఖర్చు చేశాడు. అయితే కొద్ది రోజుల్లోనే ఆ స్కూటర్ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. వృత్తిరీత్యా మెకానిక్ అయిన నదీమ్ పలుమార్లు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాకపోవడంతో సెప్టెంబర్ 10న పెట్రోల్ కొనుగోలు చేసి కలబురగిలోని ఓలా ఎలక్ట్రిక్ షోరూంకు నిప్పు పెట్టాడు. అదృష్టవశాత్తు ఆ సమయంలో షోరూం మూసివేయడంతో ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ఈ అగ్నిప్రమాదంలో ఆరు స్కూటర్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ అగ్నిప్రమాదంలో సుమారు రూ.8.5 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. షోరూమ్ సిబ్బంది ఫిర్యాదు చేయడంతో ఆ కస్టమర్ ను అదుపులోకి తీసుకున్నామని ఓ పోలీసు అధికారి తెలిపారు.

పోలీసుల అదుపులో నిందితుడు

ఈ ఘటనలో షోరూమ్ లోని 6 ఎలక్ట్రిక్ స్కూటర్లు పూర్తిగా తగలబడిపోయాయని, మరికొన్ని పాక్షికంగా దగ్ధమయ్యాయని షో రూమ్ నిర్వాహకులు పోలీసులకు తెలిపారు. షో రూమ్ మూసి ఉన్న సమయంలో ఈ ఘటన జరగడంతో, దీనిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై ఓలా (ola electric) ఇంకా స్పందించలేదు.