NSE, BSE transaction fees: ట్రాన్సాక్షన్ ఫీజులను సవరించిన ఎన్ఎస్ఈ, బీఎస్ఈ; కొత్త ఫీజులు ఇవే..
NSE, BSE transaction fees: ట్రాన్సాక్షన్ ఫీజులను సవరిస్తున్నట్లు భారతీయ స్టాక్ మార్కెట్లు ఎన్ఎస్ఈ, బీఎస్ఈ శుక్రవారం ప్రకటించాయి. కొత్తగా సవరించిన ట్రాన్సాక్షన్ ఫీజులు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపాయి.
ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో సెన్సెక్స్, బ్యాంకెక్స్ ఆప్షన్స్ కాంట్రాక్టుల లావాదేవీ రుసుమును బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (BSE) శుక్రవారం సవరించింది. సవరించిన రేట్లు అక్టోబర్ 1, మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. సవరించిన ట్రాన్సాక్షన్ రేట్ల ప్రకారం ప్రతీ కోటి ప్రీమియం టర్నోవర్ కు రూ. 3,250 ట్రాన్సాక్షన్ ఫీజుగా ఉంటుందని తెలిపింది.
ఈక్విటీ డెరివేటివ్స్ కు సేమ్ ఫీజు
మరోవైపు ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలోని ఇతర కాంట్రాక్టులకు ట్రాన్సాక్షన్ ఛార్జీలు యథాతథంగా కొనసాగుతాయని బొంబాయి స్టాక్ ఎక్సేంజ్ (BSE) స్పష్టం చేసింది. సెన్సెక్స్ 50 ఆప్షన్లు, స్టాక్ ఆప్షన్లకు సంబంధించి ప్రీమియం టర్నోవర్ విలువకు రూ.500 ట్రాన్సాక్షన్ ఫీజును బీఎస్ఈ వసూలు చేస్తుంది. ఇండెక్స్, స్టాక్ ఫ్యూచర్స్ కు ఎలాంటి లావాదేవీ ఫీజు ఉండదు. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (NSE) కూడా వివిధ విభాగాల్లో కొత్త ట్రాన్సాక్షన్ ఛార్జీలను ప్రవేశపెట్టింది. క్యాష్ మార్కెట్ లో, ప్రతి ట్రేడెడ్ విలువకు రూ .2.97 (రెండు వైపులా) రుసుము వర్తిస్తుంది. ఈక్విటీ ఫ్యూచర్స్ లో, ప్రతి వైపు లక్ష ట్రేడింగ్ (Trading) విలువకు రూ .1.73 ఛార్జీ ఉంటుంది.
ఈక్విటీ ఆప్షన్లకు..
ఈక్విటీ ఆప్షన్లకు లావాదేవీ రుసుము రెండు వైపులా లక్ష ప్రీమియం విలువకు రూ .35.03 ఉంటుంది. ఎన్ఎస్ఈ కరెన్సీ ఫ్యూచర్స్ కోసం, ప్రతి వైపు ట్రేడింగ్ (Trading) విలువకు లక్షకు రూ .0.35 రుసుము ఉంటుంది. కరెన్సీ ఆప్షన్లు, వడ్డీ రేటు ఆప్షన్లకు రెండు వైపులా లక్ష ప్రీమియం విలువకు రూ.31.10 చార్జీ ఉంటుంది.