GST on diesel vehicles: డీజిల్ వెహికిల్స్ పై అదనంగా 10% పన్ను?.. గడ్కరీ ఏమన్నారు..?
GST on diesel vehicles: డీజిల్ ఇంజన్ వాహనాలపై అదనంగా 10% జీఎస్టీ విధించాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రతిపాదించారు. నితిన్ గడ్కరీ ప్రతిపాదనపై వాహన రంగం ప్రతికూలంగా స్పందించింది.
GST on diesel vehicles: కాలుష్య రహిత వాహనాలను ప్రోత్సహించే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని కేంద్ర రహదారులు, రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. స్వచ్ఛమైన ఇంధనాలను ఉపయోగించే వాహనాలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నామన్నారు. అదే విధంగా, కాలుష్యాన్ని వెదజల్లే డీజిల్ ఇంజన్ వాహనాలకు చెక్ పెట్టే దిశగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు.
10 శాతం అదనపు పన్ను
కాలుష్య పూరిత వాహనాల అమ్మకాలను నిరోధించే లక్ష్యంతో డిజిల్ ఇంజన్ వాహనాలపై 10% పన్ను అదనంగా విధించాలని త్వరలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ కు త్వరలో ప్రతిపాదిస్తానని నితిన్ గడ్కరీ వెల్లడించారు. కాలుష్య పన్ను పేరుతో ఆ పన్నును వసూలు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రికి సూచించనున్నానన్నారు. ఈ నిర్ణయం వల్ల డీజిల్ వాహనాల ధరలు పెరిగి, వాటిని కొనుగోలు చేసే వినియోగదారుల సంఖ్య తగ్గుతుందని, దాంతో, వాహన తయారీ సంస్థలు ఆయా వాహనాల ఉత్పత్తిని తగ్గిస్తాయని గడ్కరీ వివరించారు. డీజిల్ వాహనాల వల్ల కాలుష్యం పెరగడమే కాకుండా, ఇంధన దిగుమతి వ్యయం కూడా భారీగా పెరుగుతుందన్నారు. ‘డీజిల్ కు గుడ్ బై చెప్పండి. వాటిని ఉత్పత్తి చేయడం నిలిపివేయండి. అలా చేయకపోతే, మేమే వాటిపై పన్నును పెంచుతాం’ అని గడ్కరీ హెచ్చరించారు. ప్యాసెంజర్ కార్ల కన్నా భారీ వాహనాలు, జనరేటర్లు ఎక్కువగా డీజిల్ పై నడుస్తాయి.
కుప్పకూలిన ఆటో స్టాక్స్
మంగళవారం ఎస్ఐఏఎం 63వ వార్షిక సమావేశంలో నితిన్ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేసిన వెంటనే స్టాక్ మార్కెట్లోని ఆటో స్టాక్స్ ఒక్కసారిగా కుప్పకూలాయి. భారీ వాహనాలు, కమర్షియల్ వాహనాలు, ఎస్యూవీలు, ఎంపీవీలు ఎక్కువగా డీజిల్ వాహనాలుగానే ఉంటాయి. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయానికి మారుతి సుజుకీ షేర్ విలువ రూ. 72.90 తగ్గింది. టాటా మోటార్స్ షేర్ విలువ రూ. 16.70 లేదా 2.63% తగ్గింది. ఐశ్చర్ మోటర్స్ షేర్ విలువ రూ. 46.80 లేదా 1.37% తగ్గింది.
ఇప్పుడే ఆ ఆలోచన లేదు..
తన వ్యాఖ్యలు స్టాక్ మార్కెట్ పై ప్రతికూల ప్రభావం చూపడంతో, వెంటనే వాటిపై ట్విటర్ లో నితిన్ గడ్కరీ వివరణ ఇచ్చారు. ఇప్పటికిప్పుడు డీజిల్ వాహనాలపై పన్ను పెంచే ఆలోచన కానీ, ప్రతిపాదన కానీ లేదని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆటోమొబైల్ ఉత్పత్తులపై 28% వరకు జీఎస్టీ ఉంది. అదనంగా 1% నుంచి 22% వరకు వెహికిల్ టైప్ ను బట్టి సెస్ ఉంటుంది. ముఖ్యంగా ఎస్యూవీలపై గరిష్టంగా 28% జీఎస్టీ, 22% సెస్ ఉంటుంది.