Maruti Suzuki Swift CNG launch: రేపే మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్జీ లాంచ్: కొత్త ఇంజన్ తో ఎక్కువ మైలేజీ
మారుతి సుజుకి స్విఫ్ట్ అభిమానులు చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్న 2024 మోడల్ సీఎన్జీ వర్షన్ స్విఫ్ట్ సెప్టెంబర్ 11వ తేదీన లాంచ్ అవుతోంది. ఈ మోడల్ లో ఇంధన సామర్థ్యాన్ని పెంచే మోడిఫైడ్ 1.2-లీటర్ ఇంజిన్ ను ప్రవేశపెడ్తున్నారు. దీని ధర పెట్రోల్ వేరియంట్ల కంటే రూ .90 వేలు ఎక్కువ ఉండవచ్చు.
మారుతి సుజుకి కొత్త స్విఫ్ట్ సీఎన్జీ ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టడానికి సిద్ధంగా ఉంది. ఈ లేటెస్ట్ హ్యాచ్ బ్యాక్ ప్రస్తుతం కేవలం పెట్రోల్ పవర్ట్రెయిన్తో మాత్రమే లభిస్తోంది. ఇప్పుడు లేటెస్ట్ గా కొత్త సీఎన్జీ వేరియంట్ ను మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. ఈ లేటెస్ట్ మోడల్ తో స్విఫ్ట్ అమ్మకాలు మరింత పెరుగుతాయని మారుతి సుజుకీ ఆశిస్తోంది.
మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్జీ ఇంజిన్
స్విఫ్ట్ న్యూ జనరేషన్ కారులో అనేక అప్ డేట్స్ ను కలిగి ఉంది. వీటిలో ముఖ్యమైనది అప్ గ్రేడ్ చేసిన పవర్ ట్రెయిన్. ఇందులో కొత్త 1.2-లీటర్ 3 సిలిండర్ల జెడ్ 12 ఈ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ ను పొందుపర్చారు. మునుపటి మోడల్ 1.2-లీటర్ కె-సిరీస్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజన్ తో పోలిస్తే ఈ కొత్త ఇంజన్ మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని అందిస్తుందని కంపెనీ చెబుతోంది. అదనంగా, సీఎన్జీ వేరియంట్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ లక్షణాలకు అనుగుణంగా జెడ్ 12 ఇ ఇంజిన్ ను సవరించనుంది. స్విఫ్ట్ ఈ ఇంజిన్, సీఎన్జీ ఇంజన్ కలయికను అందించే ప్రారంభ వాహనంగా ఈ స్విఫ్ట్ నిలవనుంది. దీనిని భవిష్యత్తులో ఇతర మారుతి మోడళ్లలో కూడా ప్రవేశపెడ్తారని భావిస్తున్నారు.
మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్జీ ధర
రాబోయే మారుతి సుజుకి స్విఫ్ట్ సీఎన్జీ.. స్విఫ్ట్ పెట్రోలు వేరియంట్లతో పోలిస్తే సుమారు రూ .80,000-90,000 అధిక ధర ఉంటుందని భావిస్తున్నారు. హ్యుందాయ్ (HYUNDAI) గ్రాండ్ ఐ10 నియోస్, హ్యుందాయ్ ఎక్స్టర్, టాటా పంచ్ వంటి ప్రత్యర్థులకు సమర్థవంతంగా పోటీ ఇవ్వడానికి స్విఫ్ట్ సీఎన్జీ ని ఎక్కువ వేరియంట్లలో విడుదల చేసే అవకాశం ఉంది. టాటా మోటార్స్ (TATA MOTORS), హ్యుందాయ్ రెండూ తమ వాహనాలలో ట్విన్ సిలిండర్ సీఎన్జీ కిట్లను అమరుస్తున్నాయి. ఇది వారి సీఎన్జీ మోడళ్లలో బూట్ స్పేస్ పెరగడానికి దోహదపడింది. కొత్త స్విఫ్ట్ సీఎన్జీ తో మారుతి (MARUTI SUZUKI) కూడా ఇదే విధానాన్ని అవలంబిస్తుందా అనేది చూడాలి.
అతిపెద్ద మార్కెట్ వాటా
భారతీయ సీఎన్జీ ప్యాసింజర్ వాహన విభాగంలో మారుతి సుజుకీది అతిపెద్ద మార్కెట్ వాటా. మొత్తం అమ్మకాల్లో సీఎన్జీ మోడళ్ల వాటా 34 శాతంగా ఉందని కంపెనీ గతంలో వెల్లడించింది. కొత్త స్విఫ్ట్ సీఎన్జీని ప్రవేశపెట్టడంతో ఈ వాటా మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. 2024 ఆర్థిక సంవత్సరంలో 450,000 యూనిట్ల అమ్మకాలతో పోలిస్తే 2025 ఆర్థిక సంవత్సరంలో 6,00,000 సీఎన్జీ (CNG) వాహనాలను విక్రయించాలనే కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది.