Maruti Suzuki launches Invicto: మార్కెట్లోకి మారుతి సుజుకీ ఇన్విక్టో.. ప్రీమియం ఎంపీవీ సెగ్మెంట్లోకి గ్రాండ్ ఎంట్రీ
ప్రీమియ మల్టీ పర్పస్ వెహికిల్ (MPV) సెగ్మెంట్ లోకి మారుతి సుజుకీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తన లేటెస్ట్ ఎంపీవీ మోడల్ ఇన్విక్టో (Invicto) ను బుధవారం మార్కెట్లోకి లాంచ్ చేసింది.
భారతీయులు అత్యధికంగా విశ్వసించే వాహన తయారీ సంస్థ మారుతి సుజుకీ నుంచి లేటెస్ట్ గా మల్టీ పర్పస్ వెహికిల్ (MPV) ఇన్విక్టో (Invicto) మార్కెట్లోకి వచ్చింది. మారుతి కార్ల లైనప్ లో ఇదే అత్యంత ఖరీదైన కారు.
ఇన్విక్టో ధరలు ఇవే..
మారుతి ఇన్విక్టో ఎంపీవీ ఎక్స్ షో రూమ్ ధర వేరియంట్ ను బట్టి రూ. 24.79 లక్షల నుంచి రూ. 28.42 లక్షల మధ్య ఉంది. ఎంపీవీ సెగ్మెంట్లోకి మారుతి సుజుకీ రావడం ఇదే ప్రథమం. అది కూడా ప్రీమియం మోడల్ తో ఈ సెగ్మెంట్లోకి మారుతి సుజుకీ ఎంట్రీ ఇచ్చింది. 7 సీటర్ జెటా ప్లస్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 24.79 లక్షలుగా నిర్ణయించారు. అలాగే, ఇదే వేరియంట్ 8 సీటర్ ధర రూ. 24.84 లక్షలుగా ఉంది. హై ఎండ్ మోడల్ అయిన 7 సీటర్ ఆల్ఫా ప్లస్ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర రూ. 28.42 లక్షలుగా ఉంది.
Design, Features: డిజైన్, ఫీచర్స్
ఈ ఇన్విక్టోను ఎంపీవీ డైమెన్షన్స్ తో దాదాపు ఎస్యూవీ డిజైన్ లోనే తీర్చిదిద్దారు. ఈ కారు పొడవు 4,755 ఎంఎం, ఎత్తు 1,795 ఎంఎం, వెడల్పు 1,850ఎంఎంగా ఉంది. ఇందులో బూట్ స్పేస్ 239 లీటర్లు. ఇందులో 10 ఇంచ్ ఇన్ఫోటైన్ మెంట్ క్లస్టర్, 7 ఇంచ్ డ్రైవర్ డిస్ ప్లే ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. మధ్య వరుసలో రిక్లైనర్ సీట్లను ఏర్పాటు చేశారు. ఈ కారులో హైబ్రిడ్ టెక్నాలజీతో 2.0 లీటర్ పెట్రోలు ఇంజిన్ ఉంటుంది. ఈ సీవీటీ గేర్ బాక్స్ ను అమర్చారు. ఈ కారులో నార్మల్, స్పోర్ట్, ఎకో అనే మూడు డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి. గంటకు జీరో నుంచి 100 కిమీల వేగాన్ని ఈ ఎంపీవీ కేవలం 9.5 సెకన్లలో అందుకుంటుంది. లీటర్ కు కనీసం 22 కిమీల మైలేజ్ ఇస్తుందని కంపెనీ చెబుతోంది.
నెక్సా డీలర్ షిప్ ల వద్ద ఈ కారును కొనుగోలు చేయవచ్చు. ఈ ఇన్విక్టో ఎంపీవీ బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభమయ్యాయి. మార్కెట్లో ఇన్నోవా మోడల్ ప్రీమియం వేరియంట్లకు ఇది గట్టి పోటీ ఇచ్చే అవకాశముంది.