Jawa 42 FJ Launch : అదిరిపోయే లుక్‌లో జావా 42 ఎఫ్‌జె బైక్.. ధర ఎంత? ఫీచర్లు ఏంటి?-jawa yezdi launched 350 jawa 42 fj at 1 99 lakh rupees know this motor cycle features here ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Jawa 42 Fj Launch : అదిరిపోయే లుక్‌లో జావా 42 ఎఫ్‌జె బైక్.. ధర ఎంత? ఫీచర్లు ఏంటి?

Jawa 42 FJ Launch : అదిరిపోయే లుక్‌లో జావా 42 ఎఫ్‌జె బైక్.. ధర ఎంత? ఫీచర్లు ఏంటి?

Anand Sai HT Telugu
Sep 03, 2024 04:27 PM IST

Jawa 42 FJ Launch : జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ కొత్త జావా 42 ఎఫ్‌జె మోటార్ సైకిల్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.99 లక్షలు. ఈ బైకుకు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో తెలుసుకుందాం..

జావా 42 ఎఫ్ జె లాంచ్
జావా 42 ఎఫ్ జె లాంచ్

జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ జావా 42 ఎఫ్‌జె మోటార్ సైకిల్‌ను లాంచ్ చేసింది. ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.1.99 లక్షలుగా నిర్ణయించారు. జావా 42 ఎఫ్ జె '42' లైనప్‌‌లో స్పోర్టియర్, మరింత శక్తివంతమైన మోడల్. ఇతర జావా 42 మోటార్ సైకిళ్లతో పోలిస్తే ఇది అనేక మార్పులతో వస్తుంది. లాంచ్‌తో కంపెనీ బుకింగ్ ప్రారంభించింది. దీని డెలివరీ కూడా త్వరలోనే ప్రారంభం అవుతుంది. భారత మార్కెట్లో ఇది నేరుగా రాయల్ ఎన్‌ఫిల్డ్ హంట్ 350, హోండా సీబీ 350 వంటి మోడళ్లతో పోటీపడుతుంది.

జావా యెజ్డీ మోటార్ సైకిల్స్ సహ వ్యవస్థాపకుడు అనుపమ్ తరేజా మాట్లాడుతూ.. '2024 జావా 42 మోటార్ సైకిల్ ఇంజనీరింగ్‌లో మా డిజైన్ అద్భుతంగా ఉంది. ఈ బైక్‌ను తయారు చేయడానికి మేం సమయాన్ని తీసుకున్నాం. 'ప్రైస్-పెర్ఫార్మెన్స్'తో ఈ బైక్ వచ్చింది.' అని చెప్పారు.

జావా 42 ఎఫ్‌జెలో 334 సీసీ, లిక్విడ్ కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఇది 21.45 బిహెచ్‌పీ పవర్, 29.62 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ స్లిప్ అండ్ అసిస్ట్ క్లచ్‌తో 6-స్పీడ్ గేర్ బాక్స్‌తో ఉంటుంది. అయితే దీని మైలేజీ లెక్కలు వెల్లడించలేదు.

జావా 42 ఎఫ్‌జె డిజైన్ విషయానికొస్తే.. ఈ మోటార్ సైకిల్ ఆధునిక రెట్రో థీమ్‌ను పొందుతుంది. దీనికి టియర్ డ్రాప్ ఆకారంలో ఉండే ఫ్యూయెల్ ట్యాంక్, పక్కన అల్యూమినియం ప్లేట్ ఉంటుంది. సైడ్ ప్యానెల్స్ బ్రాండ్ నుండి ఇతర జావా 42 లను పోలి ఉంటాయి. ఫెండర్లు కూడా చాలా నీట్‌గా డిజైన్ చేశారు. వెనుక ఫెండర్ల నుండి జావా టెయిల్ లైట్ ఎంబోస్ చేశారు.

మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్, బ్లాక్డ్-అవుట్ ఇంజిన్, అప్‌స్వెప్టెడ్ ఎగ్జాస్ట్ పైపులు బైక్ స్పోర్ట్‌ లుక్‌ను పెంచుతాయి. బేస్ మోడల్ లో వైర్ స్పోక్ వీల్స్ ఉంటాయి. మీరు దీన్ని 5 కలర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. దీని ఇతర ఫీచర్ల విషయానికొస్తే, ఇందులో ఎల్ఈడి లైట్లు, యుఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, సింగిల్-పాడ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి.

ఈ మోటార్ సైకిల్ స్టీల్ ఛాసిస్‌తో వస్తుంది. ఇది 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్, ట్విన్ షాక్ అబ్జార్బర్‌ల ద్వారా సస్పెండ్ ఉంది. బ్రేకింగ్, సేఫ్టీ కోసం ముందు భాగంలో 320 మిమీ డిస్క్ బ్రేక్, వెనుక భాగంలో డిస్క్ బ్రేక్ ఉన్నాయి. ఈ మోటార్ సైకిల్ డ్యూయల్ ఛానల్ ఎబీఎస్‌ను స్టాండర్డ్‌గా పొందుతుంది.

Whats_app_banner