Japan Stock market : ‘బ్లాక్​ మండే’- జపాన్​ స్టాక్​ మార్కెట్​లో రక్తపాతం.. నిక్కీ ఒక్క రోజులో 12శాతం డౌన్​!-japan stock market crash nikkei index sinks 12 as investors dump a wide range of shares ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Japan Stock Market : ‘బ్లాక్​ మండే’- జపాన్​ స్టాక్​ మార్కెట్​లో రక్తపాతం.. నిక్కీ ఒక్క రోజులో 12శాతం డౌన్​!

Japan Stock market : ‘బ్లాక్​ మండే’- జపాన్​ స్టాక్​ మార్కెట్​లో రక్తపాతం.. నిక్కీ ఒక్క రోజులో 12శాతం డౌన్​!

Sharath Chitturi HT Telugu
Aug 05, 2024 12:01 PM IST

ప్రపంచవ్యాప్తంగా స్టాక్​ మార్కెట్​లు కుప్పకూలుతున్నాయి. జపాన్ స్టాక్​ మార్కెట్​లలో రక్తపాతం కనిపించింది. నిక్కీ 225 స్టాక్ ఇండెక్స్ 12.4శాతం పడింది.

జపాన్​ స్టాక్​ మార్కెట్​లో రక్తపాతం
జపాన్​ స్టాక్​ మార్కెట్​లో రక్తపాతం

అమెరికా ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే అధ్వాన్నంగా ఉండొచ్చన్న అంచనాల నేపథ్యంలో ప్రపంచ స్టాక్​ మార్కెట్​లు కుప్పకూలుతున్నాయి. జపాన్​ స్టాక్​ మార్కెట్​ల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఆర్థిక మాంద్యం భయాలతో పాటు జపాన్​ బ్యాంక్​ వడ్డీలు పెంచడంతో సూచీలు కుప్పకూలాయి. నిక్కీ 225 షేరు సూచీ 12.4 శాతం పతనమైంది. అంటే ఒక్క రోజులో 4,451 పాయింట్లు కోల్పోయి 31,458కు పడిపోయింది. అంతేకాదు శుక్రవారం 5.8 శాతం క్షీణించిన నిక్కీ, గత రెండు ట్రేడింగ్ సెషన్లలో ఏకంగా 18.2 శాతం పతనమై మదుపర్లకు భారీ నష్టాలను తీసుకొచ్చింది.

బ్లాక్​ మండే..

1987 అక్టోబరులో "బ్లాక్ మండే" అనంతరం జపాన్ స్టాక్​ మార్కెట్​ సూచీ​ నిక్కీ ఒక్క రోజులో ఈ స్థాయిలో పడటం ఇదే తొలిసారి! నాడు నిక్కీ 3,836 పాయింట్లు లేదా 14.9శాతం పతనమైంది. ప్రపంచ ఆర్థిక సంక్షోభం సమయంలో అక్టోబర్ 2008లో ఇది 11.4 శాతం క్షీణతను చూసింది. మార్చ్​ 2011 లో ఈశాన్య జపాన్​లో భారీ భూకంపాలు, అణు మాంద్యం తరువాత 10.6 శాతం పడిపోయింది.

బ్యాంక్ ఆఫ్ జపాన్ బుధవారం బెంచ్​మార్క్​ వడ్డీ రేటును పెంచినప్పటి నుంచి టోక్యోలో షేర్ల ధరలు పడిపోతున్నాయి. ఏడాది క్రితం ఉన్న స్థాయి కంటే బెంచ్​మార్క్​ ఇప్పుడు 4 శాతం తక్కువగా ఉంది.

టయోటా మోటార్ కార్పొరేషన్ షేర్లు 11 శాతం, హోండా మోటార్ కంపెనీ షేర్లు 13.4 శాతం నష్టపోయాయి. కంప్యూటర్ చిప్ తయారీ సంస్థ టోక్యో ఎలక్ట్రాన్ 15.8 శాతం, మిత్సుబిషి యూఎఫ్​జే ఫైనాన్షియల్ గ్రూప్ 18.4 శాతం నష్టపోయాయి

ఇండియన్​ స్టాక్​ మార్కెట్లు కూడా..

అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితుల మధ్య భారత స్టాక్​ మార్కెట్​లు కూడా సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో పతనమయ్యాయి. ఉదయం 11:50 గంటలకు బీఎస్​ఈ సెన్సెక్స్​ 2.8శాతం పడి 78,714 వద్ద ట్రేడ్​ అవుతోంది. నిఫ్టీ 2.74శాతం పతనమై 24,040 వద్ద కొనసాగుతోంది.

స్టాక్​ మార్కెట్​ల పతనానికి కారణాలను నిపుణులు వెల్లడించారు.

  1. అమెరికా మాంద్యం భయాలు..

గత శుక్రవారం విడుదలైన జులై పేరోల్ డేటా ప్రకారం జూన్​లో 4.1 శాతంగా ఉన్న అమెరికా నిరుద్యోగ రేటు మూడేళ్ల గరిష్ట స్థాయి 4.3 శాతానికి చేరుకుంది. ఫలితంగా అమెరికాలో మాంద్యం భయాలు ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్ల రిస్క్​ని తీవ్రంగా దెబ్బతీశాయి. జులై నెలలో నిరుద్యోగిత రేటు వరుసగా నాలుగోసారి పెరిగింది.

"అమెరికా ఆర్థిక వ్యవస్థకు సాఫ్ట్ ల్యాండింగ్ అవుతుందన్న ఏకాభిప్రాయ అంచనాలే ప్రపంచ స్టాక్ మార్కెట్ల ర్యాలీకి ప్రధాన కారణం. జులైలో యూఎస్ ఉద్యోగాలు తగ్గడం, యూఎస్ నిరుద్యోగ రేటు 4.3 శాతానికి గణనీయంగా పెరగడంతో ఈ అంచనా ఇప్పుడు ప్రమాదంలో ఉంది" అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వికె విజయకుమార్ అన్నారు.

బ్లూమ్​బర్గ్​ నివేదిక ప్రకారం.. రానున్న 12 నెలల్లో అమెరికాలో మాంద్యం వచ్చే అవకాశాలను గతంలోని 15 శాతం నుంచి 25శాతానికి పెంచారు గోల్డ్​మెన్​ సాక్స్​ ఆర్థికవేత్తలు.

2. వాల్యుయేషన్​- క్యూ1 ఫలితాలు..

ఇన్ని రోజులు భారత స్టాక్​ మార్కెట్​లలో బుల్​ రన్​ కొనసాగింది. చాలా స్టాక్స్​ వాల్యుయేషన్​కి మించి ట్రేడ్​ అవుతున్నాయి. ఫలితంగా ఆర్థిక మాంద్యం భయాలతో ఇప్పుడు ప్రాఫిట్​ బుకింగ్​ హడావుడి కనిపిస్తోంది. మరోవైపు ఇండియా కంపెనీల జూన్ త్రైమాసికం (క్యూ1ఎఫ్వై 25) ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. మార్కెట్ సెంటిమెంట్​ని ఉత్తేజపరచడంలో విఫలమయ్యాయి. ప్రస్తుత మార్కెట్ వాల్యుయేషన్ ఎక్కువగా ఉండటంతో రాబడులు నిలదొక్కుకోలేకపోవచ్చని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిఫ్టీ50 టెక్నిల్​ ఫ్యాక్టర్​, ఇరాన్​-ఇజ్రాయెల్​ మధ్య ఉద్రిక్తతలు వంటివి కూడా స్టాక్​ మార్కెట్​ల పతనానికి కొన్ని కారణాలుగా తెలుస్తోంది.

Whats_app_banner

సంబంధిత కథనం