SBI Q1 Results: క్యూ1 లో స్వల్పంగా పెరిగిన ఎస్బీఐ నికర లాభం; ఎన్ఐఐ వృద్ధి 16.2 శాతం
2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నికర లాభాలు స్వల్పంగా పెరిగాయి. ఈ క్యూ 1 లో ఎస్పీఐ నికర లాభం 0.89 శాతం పెరిగి రూ.17,035.16 కోట్లకు చేరుకుంది. 2024-25 లో భారతీయ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి రూ.25,000 కోట్ల వరకు సమీకరించాలని బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది.
SBI Q1 Results: 2024-25 ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ - జూన్ త్రైమాసికం (Q1FY25) ఆర్థిక ఫలితాలను శనివారం ప్రకటించింది. ఈ క్యూ 1 లో భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన ఎస్బీఐ రూ. 17,035.16 కోట్ల నికర లాభాలను ప్రకటించింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో ఎస్బీఐ నికర లాభాలు రూ. 16,884.29 కోట్లు గా ఉన్నాయి. అంటే, ఏడాది కాలంలో ఎస్బీఐ నికర లాభాలు 0.89 శాతం పెరిగాయి.
పెరిగిన ఎన్ఐఐ ఆదాయం
ఈ క్యూ 1 (Q1FY25) లో ఎస్బీఐ నికర వడ్డీ ఆదాయం (NII) 16.2 శాతం పెరిగి రూ .1,11,535.98 కోట్లకు చేరుకుంది. నికర వడ్డీ మార్జిన్ (NIM) గత ఆర్థిక సంవత్సరం జూన్ త్రైమాసికం ముగిసే సమయానికి ఉన్న 3.47 శాతంతో పోలిస్తే ఈ క్యూ 1 లో 12 బేసిస్ పాయింట్లు (BPS) తగ్గి 3.35 శాతానికి పడిపోయింది.
తగ్గిన షేర్ ధర
స్టాక్ మార్కెట్ (stock market) లో శుక్రవారం ట్రేడింగ్ సెషన్ తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (State bank of India) షేరు 1.72 శాతం క్షీణించి రూ.847.90 వద్ద ముగిసింది. బాండ్ల ద్వారా దేశీయ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి నిధుల సమీకరణకు ఆమోదం తెలిపినట్లు ఎస్బీఐ ప్రకటించింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో భారతీయ, విదేశీ ఇన్వెస్టర్ల నుంచి రూ.25,000 కోట్ల వరకు సమీకరించాలని బ్యాంక్ లక్ష్యంగా పెట్టుకుంది.
బాండ్ల జారీ తో రూ. 25 వేల కోట్లు..
2025 ఆర్థిక సంవత్సరంలో విదేశీ ఇన్వెస్టర్లకు రూ.25,000 కోట్ల వరకు బాసెల్ నిబంధనలకు అనుగుణంగా అదనపు టైర్ 1 బాండ్లు, టైర్ 2 బాండ్లను జారీ చేయడం ద్వారా రూ.25,000 కోట్ల వరకు నిధుల సమీకరణకు సెంట్రల్ బోర్డు ఆమోదం తెలిపిందని బ్యాంక్ తెలిపింది.
తగ్గిన ఎన్పీఏలు..
2025 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ఎస్బీఐ స్థూల నిరర్థక ఆస్తులు (NPA) 55 బేసిస్ పాయింట్లు (BPS) తగ్గి 2.21 శాతానికి చేరుకున్నాయి. 2025 ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వీటి విలువ రూ.84,226.04 కోట్లుగా ఉంది. నికర ఎన్పీఏలు కూడా ఏప్రిల్-జూన్ త్రైమాసికం ముగిసే సమయానికి 0.71 శాతం నుంచి 0.57 శాతానికి తగ్గాయి. మొదటి త్రైమాసికంలో క్యాపిటల్ అడెక్వసీ రేషియో (CAR) 13.86 శాతంగా ఉంది.