ITR refund scam: ఐటీఆర్ రిఫండ్ కోసం ఎదురుచూస్తున్నారా?.. ఈ స్కామ్ బారిన పడతారు జాగ్రత్త..
ఆదాయ పన్ను రిటర్న్స్ లను దాఖలు చేసే గడువు జూలై 31 తో ముగిసింది. పన్ను చెల్లింపుదారుల్లో చాలా మంది రీఫండ్ కోసం ఎదురు చూస్తున్నారు. అయితే, ఈ అవకాశాన్ని స్కామ్ కు వీలుగా మార్చుకుంటున్నారు కొందరు స్కామ్ స్టర్లు. ఈ ఐటీఆర్ రీఫండ్ స్కామ్ గురించి మీరు కూడా తెలుసుకోండి..
కొత్తగా వెలుగు చూసిన ఐటీఆర్ (ITR) రీఫండ్ కుంభకోణం పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులను అప్రమత్తం చేసింది. పన్ను రీఫండ్ కు అర్హులని పేర్కొంటూ మోసపూరిత కాల్స్, పాప్-అప్ నోటిఫికేషన్లు వస్తున్నాయని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని సోషల్ మీడియాలో పన్ను చెల్లింపుదారులకు సూచించింది. అనధికార మార్గాల ద్వారా వచ్చే ఎలాంటి కమ్యూనికేషన్ ను నమ్మవద్దని హెచ్చరించింది.
స్కామ్ మెసేజ్ లతో జాగ్రత్త
పన్ను రీఫండ్ కు అర్హులని పేర్కొంటూ ఏదైనా సందేశం వస్తే ఆదాయ పన్ను (INCOME TAX) శాఖ అధికారిక సమాచార మార్గాల ద్వారా ధృవీకరించుకోవాలని, స్కామర్లు పంపించే లింక్స్ ను ఓపెన్ చేయవద్దని ఆదాయపు పన్ను శాఖ హెచ్చరించింది. ఎక్స్ లో ఆదాయపు పన్ను శాఖ ఈ మేరకు ఒక పోస్ట్ షేర్ చేసింది. అనధికార, అనుమానాస్పద ఇమెయిల్స్ కు సమాధానం ఇవ్వవద్దు. అలాగే, క్రెడిట్ కార్డు నంబర్లు, బ్యాంక్ ఖాతా వివరాలు లేదా ఏదైనా ఇతర సున్నితమైన సమాచారాన్ని అభ్యర్థించే వెబ్సైట్లను సందర్శించవద్దు. ఆదాయ పన్ను శాఖ ఇచ్చిన ఇమెయిల్ చిరునామా ద్వారా మాత్రమే సంప్రదింపులు జరపాలి’’ అని ఐటీ విభాగం వివరించింది.
ఇలాంటి మెసేజెస్ వస్తాయి..
స్కామర్ల నుంచి వచ్చే సందేశాలు ఎలా ఉంటాయో ఐటీ విభాగం వెల్లడించింది. ‘‘మీకు రూ.15000/- ఆదాయపు పన్ను రీఫండ్ ఆమోదించబడింది. ఈ మొత్తం త్వరలో మీ ఖాతాకు క్రెడిట్ చేయబడుతుంది, దయచేసి మీ ఖాతా నంబర్ 5XXXXXX6777ను ధృవీకరించండి. ఇది సరైనది కాకపోతే, దయచేసి ఈ క్రింది లింక్ ను సందర్శించడం ద్వారా మీ బ్యాంక్ ఖాతా సమాచారాన్ని అప్ డేట్ చేయండి’’ అని ఆ సైబర్ నేరస్తుల నుంచి మెసేజ్ లేదా మెయిల్ రావచ్చని హెచ్చరించింది. అలాంటి మెసేజెస్ కు స్పందించవద్దని కోరింది.
స్కామ్ మెసేజ్ వస్తే ఇలా చేయండి..
మోసపూరితంగా భావించే ఇమెయిల్ వస్తే, మీరు దానిని webmanager@incometax.gov.in ఫార్వర్డ్ చేయాలి. ఒక కాపీని incident@cert-in.org.in కూడా పంపవచ్చు. మీకు ఫిషింగ్ మెయిల్ వస్తే, దానిని incident@cert-in.org.in ఫార్వర్డ్ చేయండి అని ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. ‘‘మీరు ఆదాయపు పన్ను శాఖ అని చెప్పుకునే ఎవరి నుంచైనా ఇ-మెయిల్ లేదా ఫోన్ కాల్ వస్తే వాటికి సమాధానం ఇవ్వవద్దు. అలాగే, ఈ మెయిల్ లో ఏదైనా అటాచ్ మెంట్ లను తెరవవద్దు. సందేశం నుండి లింక్ ను కట్ చేసి మీ బ్రౌజర్లలో పేస్ట్ చేయవద్దు’’ అని సూచించింది.