ITR filing : ఐటీఆర్ ఫైల్ చేస్తున్నప్పుడు- అస్సలు చేయకూడని తప్పులు..
ITR filing mistakes : ఇండియాలో ప్రస్తుతం ఐటీఆర్ ఫైలింగ్ సీజన్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో.. ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో చేయకూడని తప్పుల గురించి ఇక్కడ తెలుసుకోండి..
ITR filing mistakes to avoid : భారతదేశంలో పన్ను చెల్లింపుదారులకు ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటిఆర్) దాఖలు చేయడం చాలా ముఖ్యమైన బాధ్యత. ఖచ్చితమైన, సకాలంలో ఐటీఆర్ ఫైల్ చేయడం వల్ల అనవసరమైన అవాంతరాలు, జరిమానాలు, చట్టపరమైన సమస్యలను నివారించవచ్చు. అయితే.. ఐటీఆర్ ఫైలింగ్ సమయలో చాలా మంది కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. ఫైలింగ్ సమయంలో నివారించవలసిన ప్రధాన తప్పులను ఇక్కడ తెలుసుకోండి..
1. డెడ్లైన్ మిస్ అవ్వడం..
ఐటిఆర్ ఫైలింగ్ గడువును మిస్ అవ్వడం.. చాలా సాధారణ తప్పులలో ఒకటి. జూలై 31 తర్వాత ఐటీఆర్ ఫైలింగ్ గడువు ముగుస్తుంది. ఆలస్యమైన ఫైలింగ్ వ్యవధిని బట్టి రూ.1,000 నుంచి రూ.10,000 వరకు జరిమానా పడుతుంది. అదనంగా, ఆలస్యంగా దాఖలు చేసినవారు కొన్ని మినహాయింపులను కోల్పోవచ్చు. ఆదాయపు పన్ను శాఖ నుంచి అధిక పరిశీలనను ఎదుర్కోవచ్చు.
2. వ్యక్తిగత వివరాల్లో తప్పులు..
పేరు, పాన్ నంబర్, బ్యాంక్ వివరాలు వంటి వ్యక్తిగత సమాచారంలో తప్పులు దొర్లడం వల్ల సమస్యలు తలెత్తుతాయి. ఫలితంగా రిటర్నులు తిరస్కరణకు గురవ్వొచ్చు. లేదా రీఫండ్ ప్రాసెసింగ్లో జాప్యానికి దారితీయవచ్చు. ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే వ్యక్తిగత వివరాలన్నీ సరిగ్గా నమోదు అయ్యేలా చూసుకోవాలి.
3. తప్పుడు ఐటిఆర్ ఫారం ఎంచుకోవడం..
సరైన ఐటిఆర్ ఫారాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. వివిధ రకాల పన్ను చెల్లింపుదారులకు వారి ఆదాయ వనరుల ఆధారంగా వివిధ ఫారాలు సేవలు అందిస్తాయి. తప్పుడు ఫారాన్ని ఉపయోగించడం తిరస్కరణకు లేదా తిరిగి సమర్పించాల్సిన అవసరానికి దారితీస్తుంది. ఉదాహరణకు ఐటీఆర్-1 వేతన జీవులకు, ఐటీఆర్-4 ప్రొఫెషనల్స్, చిన్న వ్యాపారులకు కేటాయించారు. ఇది గమనించాలి.
4. అన్నీ చెప్పకపోవడం..
పొదుపు ఖాతాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, అద్దెతో సహా అన్ని ఆదాయ వనరులను నివేదించడంలో విఫలం కావడం ఒక సాధారణ తప్పు. ఈ ఆదాయాలను బహిర్గతం చేయకపోతే జరిమానాలు పడతాయి. పారదర్శకత పాటించడం కొరకు అన్ని ఆదాయాల సమగ్ర రిపోర్టింగ్ ఉండేలా చూడాలి.
5. ఫారం 26ఏఎస్..
ఫారం 26ఏఎస్లో మీ పాన్పై మినహాయించి జమ చేసిన అన్ని పన్నుల వివరాలు ఉంటాయి. చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఈ ఫారాన్ని విస్మరిస్తారు. ఇది ఆదాయం, వాస్తవ టీడీఎస్ మధ్య వ్యత్యాసాలకు దారితీస్తుంది. ఫైలింగ్ చేయడానికి ముందు ఫారం 26ఏఎస్ని సమీక్షించాలి.
6. సరికాని మినహాయింపులు..
డిడెక్షన్స్, ఎక్సెమ్షన్స్పై తప్పుడు క్లెయిమ్లు రిఫండ్ లు తగ్గడానికి లేదా పన్ను చెల్లింపులు పెరగడానికి దారితీయవచ్చు. సెక్షన్ 80సీ, 80డీ తదితర సెక్షన్ల కింద లభించే మినహాయింపుల గురించి తెలుసుకోండి. క్లెయిమ్ చేసిన అన్ని మినహాయింపులు చెల్లుబాటు అవుతాయని, అవసరమైన డాక్యుమెంట్ల ద్వారా సపోర్ట్ చేసుకోండి.
7. ఐటిఆర్ వెరిఫై చేయకపోవడం..
ఫైలింగ్ తర్వాత, ప్రక్రియను పూర్తి చేయడానికి ఐటిఆర్ వెరిఫై చేయడం చాలా ముఖ్యం. చాలా మంది పన్ను చెల్లింపుదారులు ఈ చర్యను విస్మరిస్తారు. వారి రిటర్నులు చెల్లవు. ఆధార్ ఓటీపీ, నెట్ బ్యాంకింగ్ ద్వారా లేదా సంతకం చేసిన ఫిజికల్ కాపీని సీపీసీ కార్యాలయానికి పంపడం ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలో వెరిఫికేషన్ చేసుకోవచ్చు.
సంబంధిత కథనం