Income tax returns: ఇన్ కం టాక్స్ వెబ్ సైట్ లో సిద్ధంగా ఉన్న ఐటీఆర్-1, ఐటీఆర్-2, ఐటీఆర్-4 ఫామ్స్; ఇలా ఫైల్ చేయండి..
Income tax returns: ఆదాయ పన్ను రిటర్న్స్ కు సంబంధించిన ఆన్ లైన్ ఐటీఆర్ సబ్మిషన్ ఫామ్స్ ఐటీఆర్ 1, ఐటీఆర్ 2, ఐటీఆర్ 4 ఇప్పుడు ఆదాయ పన్ను శాఖ వెబ్ సైట్ లో అందుబాటులో ఉన్నాయి. 2024 -25 మదింపు సంవత్సరానికి గానూ ఈ ఫామ్స్ ను ఉపయోగించాల్సి ఉంటుంది.
Income tax returns: 2023-24 ఆర్థిక సంవత్సరానికి ( 2024-25) ఐటీఆర్ 1, ఐటీఆర్ 2, ఐటీఆర్ 4 వంటి ఆన్ లైన్ ఆదాయపు పన్ను రిటర్న్ ఫారాలను ఇ-ఫైలింగ్ పోర్టల్ లో ఆదాయ పన్ను శాఖ అందుబాటులో ఉంచింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఈ ఐటీఆర్ ఫారాలను ఉపయోగించి పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి అర్హులైన పన్ను చెల్లింపుదారులు పన్నులను చెల్లించవచ్చు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి (AY 2024-25) ఐటీఆర్ 1, ఐటీఆర్ 2, ఐటీఆర్ 4, ఐటీఆర్ 6 ఆఫ్ లైన్ ఎక్సెల్ యుటిలిటీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు ఐటీఆర్ 1, ఐటీఆర్ 2, ఐటీఆర్ 4, ఐటీఆర్ 6 లను ఐటీ శాఖ విడుదల చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి (AY 2024-25) ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి చివరి తేదీ జూలై 31, 2025.
ఆదాయ పన్ను రిటర్న్స్ ఎలా ఫైల్ చేయాలి?
ఆదాయ పన్ను రిటర్న్స్ ను దాఖలు చేయడం ఇప్పుడు చాలా సులభతరం చేశారు. వ్యక్తులు తమ ఐటీఆర్ లను సులభంగా ఆన్ లైన్ లో కానీ, ఆఫ్ లైన్ లో కానీ దాఖలు చేసుకోవచ్చు. అంతేకాదు, ఐటీఆర్ లను పాక్షికంగా ఆన్ లైన్ లో, పాక్షికంగా ఆఫ్ లైన్ లో కూడా సబ్మిట్ చేసే సదుపాయం ఉంది. పూర్తి వివరాలకు ఆదాయ పన్ను శాఖ ఈ - ఫైలింగ్ పోర్టల్ ను సందర్శించండి.
ఆన్ లైన్ లో ఐటీఆర్ ఫైల్ చేయడం ఎలా?
ఈ-ఫైలింగ్ ఇన్ కమ్ ట్యాక్స్ పోర్టల్లో మీ అకౌంట్లోకి లాగిన్ అవ్వడం ద్వారా ఆన్ లైన్ లో ఆదాయ పన్ను రిటర్న్స్ (ITR) ఫైల్ చేయవచ్చు. 'ఫైల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ (File income tax return)' ఆప్షన్ కింద, పన్ను చెల్లింపుదారుల డేటాలో ఎక్కువ భాగం వారి వార్షిక సమాచార ప్రకటన (AIS), ఫారం 26 ఎఎస్ నుండి ముందుగానే నింపి ఉంటుంది. ఆ వివరాలను క్షుణ్నంగా క్రాస్ చెక్ చేసుకుని ఫామ్ పూర్తి చేయాలి.
ఆఫ్ లైన్ లో ఐటీఆర్ ఫైల్ చేయడం ఎలా?
ఈ-ఫైలింగ్ ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ (e-filing income tax portal) నుంచి జేఎస్ఓఎన్, ఎక్సెల్ యుటిలిటీలను డౌన్ లోడ్ చేసుకుని, వాటిని ఉపయోగించి ఆఫ్ లైన్లో ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు. మీ ఇ-ఫైలింగ్ ఆదాయ పన్ను ఖాతా నుండి ఆఫ్ లైన్ యుటిలిటీస్ లో ముందుగా నింపి ఉన్న డేటాను కూడా మీరు పొందవచ్చు.
ఎవరు ఏ ఐటీఆర్ ఫామ్ నింపాలి?
ఆర్థిక సంవత్సరంలో ఆదాయ వనరులను బట్టి ఐటీఆర్-1 లేదా ఐటీఆర్-2 లేదా ఐటీఆర్-4 లను ఉపయోగించి ట్యాక్స్ రిటర్న్స్ (ITR) దాఖలు చేయవచ్చు. ఇండియాలో నివసించే వ్యక్తులు వారి ఆదాయం జీతభత్యాలు ద్వారా, ఒక ఇంటి ఆస్తి ద్వారా, ఇతర ఆదాయ మార్గాల ద్వారా వస్తున్నట్లయితే.. వారు ఐటీఆర్ 1 (ITR 1) ను దాఖలు చేయవచ్చు. వారికి ఒక ఆర్థిక సంవత్సరంలో అన్ని వనరుల నుంచి స్థూల ఆదాయం రూ.50 లక్షలకు మించకూడదు. ఒకటి కంటే ఎక్కువ ఇంటి ఆస్తులు, మూలధన లాభాలు ఉన్న పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ 2 (ITR 2) ను దాఖలు చేయవచ్చు. 44ఏడీ, 44ఏడీఏ, 44ఏఈ సెక్షన్ల కింద పన్ను పరిధిలోకి వచ్చే వ్యాపారాలు, వివిధ వృత్తుల నుంచి ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ 4 (ITR 4) ను ఉపయోగించాలి.