Gifting shares: షేర్స్ ను గిఫ్ట్ గా ఇస్తే వచ్చే టాక్స్ సమస్యలు ఏమిటి?.. ఆ ఆదాయంపై పన్ను ఎవరు చెల్లించాలి?
Gifting shares: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ ఎమెరిటస్ ఎన్ఆర్ నారాయణమూర్తి ఇటీవల తన నాలుగు నెలల మనవడు ఎకాగ్రాకు రూ .240 కోట్ల విలువైన ఇన్ఫోసిస్ షేర్లను బహుమతిగా ఇచ్చారు. ఈ నేపథ్యంలో షేర్లను గిఫ్ట్ గా ఇవ్వడం గురించిన వివరాలను తెలుసుకుందాం..
ప్రతీకాత్మక చిత్రం
Problems of Gifting shares: సాధారణంగా పెద్దలు తమ ఆస్తులను, లేదా తమ వద్ద ఉన్న బంగారం, నగదును తమ పిల్లలు, లేదా వారి పిల్లలకు పంచుతుంటారు. అలాగే, తమ పోర్ట్ ఫోలియో లోని షేర్లను కూడా బంధువులు, కుటుంబ సభ్యులు, లేదా స్నేహితులకు గిఫ్ట్ గా ఇవ్వవచ్చు. ఇందుకు ప్రత్యేక విధి విధానాలు ఉన్నాయి. అయితే, షేర్ల (shares) ను గిఫ్ట్ గా పొందిన వ్యక్తి ఏవైనా పన్నులను చెల్లించాలా? అన్న విషయంలో చాలా మందికి అనుమానాలున్నాయి. ఆ అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నాలు చేద్దాం.
గిఫ్ట్ గా స్టాక్స్ లభిస్తే పన్ను చెల్లించాలా?
- సాధారణంగా షేర్లను (stocks) తమ కుటుంబ సభ్యులు లేదా బంధువులకు బహుమతిగా ఇస్తే, ఆ షేర్లను బహుమతిగా పొందిన వ్యక్తి మైనర్ అయినా, లేదా మేజర్ అయినా ఎలాంటి పన్ను చెల్లించనక్కర లేదు.
- అయితే, గిఫ్ట్ పొందిన వ్యక్తి భవిష్యత్తులో ఈ షేర్ల ద్వారా పొందే ఆదాయంపై లేదా లాభాలపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మైనర్ల విషయంలో పన్ను బాధ్యత గిఫ్ట్ ఇచ్చిన దాతపై కాకుండా తల్లిదండ్రులపై ఉంటుంది.
- కుటుంబ సభ్యుడు కాని లేదా బంధువు కాని వ్యక్తి నుంచి షేర్లను బహుమతిగా తీసుకుంటే, ఆ షేర్ల విలువ రూ. 50 వేల కన్నా ఎక్కువ ఉంటే, ‘ఇతర మార్గాల నుంచి వచ్చే ఆదాయం’ కింద ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. గిఫ్ట్ ను పొందిన వ్యక్తి మైనర్ అయితే, ఈ ఆదాయాన్ని ఆ మైనర్ తల్లిదండ్రుల ఆదాయంతో పాటు పరిగణిస్తారు. వారికి ఐటీ చట్టంలోని సెక్షన్ 64 వర్తిస్తుంది.
- మైనర్లు తల్లిదండ్రుల సహాయంతో గిఫ్ట్ షేర్లను విక్రయించవచ్చు. ఈ విక్రయాల ద్వారా వార్షికంగా రూ .1 లక్ష కంటే ఎక్కువ లాభాలు వస్తే, 10% క్యాపిటల్ గెయిన్స్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ ఆదాయం కూడా తల్లిదండ్రుల ఆదాయంతో కలపాల్సి ఉంటుంది. అందువల్ల, అధిక ఆదాయం ఉన్న తల్లిదండ్రులు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
- షేర్ల కొనుగోలు తేదీపై కూడా పన్ను ప్రయోజనాలు ఆధారపడి ఉంటాయి. 2018 ఫిబ్రవరి 1న క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రివిజన్ కు ముందు కొనుగోలు చేసిన షేర్లకు 2018 జనవరి 31 నాటి వాల్యుయేషన్ వర్తిస్తుంది. అలాగే, స్టాక్స్ హోల్డింగ్ ఒక సంవత్సరం దాటితే, ఇది దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను పరిధిలోకి వస్తుంది.
- ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 64 నిబంధనలను అనుసరించి మైనర్లు కలిగి ఉన్న షేర్లపై వచ్చే డివిడెండ్లను అధిక సంపాదన కలిగిన తల్లిదండ్రుల ఆదాయానికి కలుపుతారు. ఈ ఆదాయానికి తల్లిదండ్రుల ఆదాయపు పన్ను శ్లాబ్ ప్రకారం ఇతర మార్గాల నుంచి వచ్చే మొత్తం ఆదాయంలో భాగంగా పన్ను విధిస్తారు.