Budget 2024: పన్ను చెల్లింపుదారులైన ఉద్యోగస్తులు బడ్జెట్ 2024లో కోరుకునే 5 మార్పులు ఇవే..
Budget 2024 expectations: బడ్జెట్ డేట్ దగ్గర పడుతోంది. ఈ బడ్జెట్ లో మోదీ ప్రభుత్వం కొన్ని కీలక ప్రకటనలు చేయవచ్చన్న అంచనాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా మూడోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు వేతన జీవులకు ఊరట కలిగించే నిర్ణయాలు వెలువరించే అవకాశం ఉందని భావిస్తున్నారు.
Budget 2024 expectations: 2024 మధ్యంతర బడ్జెట్లో పన్ను చెల్లింపుదారులకు పెద్దగా ఉపశమనం లభించకపోవడంతో వేతన జీవులు రాబోయే బడ్జెట్ పై భారీ ఆశలు పెట్టుకున్నారు. బడ్జెట్ 2024 లో పన్ను చెల్లింపుదారులకు, ముఖ్యంగా మధ్యతరగతికి ఉపశమనం కలిగించే పన్ను సంస్కరణలు ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. కొత్త పన్ను విధానంలో అత్యధిక పన్ను రేటును తగ్గించడం, స్టాండర్డ్ డిడక్షన్ ను పెంచడం, పాత పన్ను విధానంలో అత్యధిక పన్ను రేటు పరిమితిని పెంచడం వంటి మార్పులను ఆదాయ పన్ను చెల్లించే వేతన జీవులు కోరుకుంటున్నారు. అలాగే, 2023 బడ్జెట్లో ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానంలోని లోపాలను ఈ బడ్జెట్లో ప్రభుత్వం పరిష్కరిస్తుందని వారు భావిస్తున్నారు. కొత్త పన్ను విధానం ఆశించిన స్థాయిలో పన్ను చెల్లింపుదారులను ఆకర్షించలేదు.
బడ్జెట్ 2024పై వేతన వర్గాల ఆశలు
- పన్ను రేటు తగ్గింపు
"2023 లో ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం కొంత మేరకు మాత్రమే ఆశించిన ఫలితాలను ఇచ్చింది. దాంతో, ప్రభుత్వం ఆశించిన స్థాయిలో పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానంలోకి మారలేదు. ఈ నేపథ్యంలో, కొత్త పన్ను విధానంలో గరిష్ట పన్ను రేటును 30% నుండి 25% కు తగ్గించాలని, స్టాండర్డ్ డిడక్షన్ ను ప్రస్తుత పరిమితి రూ. 50,000 నుండి పెంచాలని వేతన జీవులు కోరుతున్నారు. ఈ అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని భావిస్తున్నారు.
2) మినహాయింపు పరిమితులు
అంతేకాకుండా, పాత పన్ను విధానంలో గరిష్ట పన్ను రేటు పరిమితిని రూ .10 లక్షల నుండి రూ .20 లక్షలకు పెంచాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరుతున్నారు. అలాగే, మధ్యంతర చర్యగా 80 సీ పరిమితిని పెంచే విషయం కూడా ఆలోచించాలని ఆశిస్తున్నారు.
3) స్టాండర్డ్ డిడక్షన్ మెరుగుదల
బడ్జెట్ 2024 పై మధ్యతరగతి చాలా ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా పాత పన్ను విధానంలో తమకు ప్రయోజనం కలిగించే మార్పులు వస్తాయని ఆశిస్తోంది. వాటిలో సెక్షన్ 80సీ మినహాయింపు పరిమితిని ప్రస్తుతమున్న రూ.1.5 లక్షల నుంచి రూ.2.0 లక్షలకు పెంచడం ఒకటి. అలాగే, స్టాండర్డ్ డిడక్షన్ ను రూ.50,000 నుంచి పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తగ్గిస్తుంది, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ఖర్చుల నేపథ్యంలో మధ్యతరగతికి గణనీయమైన ఉపశమనం ఇస్తుంది.
4) క్యాపిటల్ గెయిన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్సెంటివ్స్
కొరోనా అనంతరం ప్రజల్లో, ముఖ్యంగా యువతలో చోటు చేసుకున్న ప్రధాన మార్పుల్లో ఒకటి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులపై ఆసక్తి పెరగడం. ప్రతీనెలా భారీగా పెరుగుతున్న డీమ్యాట్ ఖాతాల సంఖ్యే అందుకు నిదర్శనం. అందువల్ల ట్రేడింగ్లో పెరుగుతున్న ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక మూలధన లాభాలు లేదా లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (LTCG) మినహాయింపు పరిమితిని రూ .1 లక్ష నుండి రూ .1.5 లేదా 2 లక్షలకు పెంచాలని చాలా మంది ఆశిస్తున్నారు.
5) ఇంటి అద్దె భత్యం (HRA)
నగరాల్లో, ముఖ్యంగా మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో ఇంటి అద్దెలు భరించలేనంతగా పెరిగిపోయాయి. అద్దె ఖర్చులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) మినహాయింపును పెంచాలని వేతన జీవులు కోరుకుంటున్నారు. దీనివల్ల పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం తగ్గడంతో పాటు అద్దె ఇళ్లల్లో నివసించే వారికి కొంత వెసులుబాటు లభిస్తుంది.
సూచన: పై అభిప్రాయాలు, సిఫార్సులు వ్యక్తిగత విశ్లేషకులవి మాత్రమే. హెచ్ టీ తెలుగు వి కావు. ఏదైనా పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము పెట్టుబడిదారులకు సలహా ఇస్తున్నాము.
టాపిక్