Hyundai Motors IPO : హ్యుందాయ్ మోటార్ ఐపీఓ.. త్వరలోనే స్టాక్ మార్కెట్లోకి!
Hyundai Motors IPO news : హ్యుందాయ్ మోటార్ ఇండియా నుంచి అతిపెద్ద ఐపీఓ రాబోతోందని సమాచారం. స్టాక్ మార్కెట్లో ఈ హ్యుందాయ మోటార్ ఐపీఓ త్వరలోనే లిస్ట్ అవుతుందని తెలుస్తోంది.
Hyundai Motors IPO latest news : భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లోని అతిపెద్ద సంస్థల్లో ఒకటి హ్యుందాయ్ మోటార్స్. సౌత్ కొరియాకు చెందిన ఈ హ్యుందాయ్ మోటార్ ఇండియాకు సంబంధించిన ఓ కీలక వార్త ఇప్పుడు బయటకు వచ్చింది. స్టాక్ మార్కెట్లోకి త్వరలోనే అతిపెద్ద ఐపీఓని తీసుకురావాలని హ్యుందాయ్ మోటార్ ఇండియా ప్లాన్ చేస్తోందట. దీపావళి (నవంబర్) నాటికి, ఈ ఐపీఓని లాంచ్ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటోందని సమాచారం. ఈ మేరకు.. ప్రముఖ వార్తా సంస్థ ఎకనామిక్ టైమ్స్.. ఓ నివేదికలో పేర్కొంది.
హ్యుందాయ్ మోటార్ ఇండియా ఐపీఓ..
1996 మే 6న.. హ్యుందాయ్ మోటార్ ఇండియా, దేశంలోకి వచ్చింది. 2023 సేల్స్ ప్రకారం.. మారుతీ సుజుకీ తర్వాత, ఇండియాలో రెండో స్థానంలో నిలిచింది హ్యుందాయ్ మోటార్. ఎకనామిక్ టైమ్స్ నివేదిక నిజమే అయితే.. 28ఏళ్లకు సంస్థ నుంచి ఐపీఓ.. స్టాక్ మార్కెట్లోకి అడుగుపెడుతున్నట్టు అవుతుంది!
ఈ వ్యవహారంపై హిందుస్థాన్ టైమ్స్ అనుసంధాన మింట్.. హ్యుందాయ్ మోటార్ ఇండియాను సంప్రదించేందుకు ప్రయత్నించింది. కానీ సంస్థ నుంచి స్పందన లభించలేదు.
Hyundai Motors India sales : కాగా.. ఈ హ్యుందాయ్ మోటార్ ఐపీఓ భారీగానే ఉంటుందని తెలుస్తోంది. కంపెనీ వాల్యూ 22- 28 బిలియన్ డాలర్లు అని ప్రపంచంలోనే ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థలు అంచనా వేశాయి. గత వారం సౌత్ కొరియాకు వెళ్లిన గోల్డ్‌మాన్ సాక్స్, సిటీ, మోర్గన్ స్టాన్లీ, జేపీ మోర్గాన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్ఎస్బీసీ, డ్యూచ్ బ్యాంక్, యూబీఎస్లు.. లెక్కలు వేసి, ఈ అంచనాలను హ్యుందాయ్ సంస్థకు చెప్పాయి. అంటే.. హ్యుందాయ్ మోటార్ ఇండియా మార్కెట్ క్యాపిటల్ రూ. 1.82లక్షల కోట్లు- రూ. 2.32లక్షల కోట్ల మధ్యలో ఉండొచ్చు!
ఐపీఓ ద్వారా.. 15-20శాతం వాటాని విక్రయించాలని హ్యుందాయ్ ప్లాన్ చేస్తోందట. ఈ ఐపీఓ ద్వారా.. రూ. 27,390 కోట్ల నుంచి రూ. 46,480 కోట్లను సమకూర్చాలని సంస్థ భావిస్తోందని సమాచారం.
Stock market IPO news : ఇండియాలో.. ఇతర ఆటోమొబైల్ సంస్థలకు హ్యుందాయ్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. సంస్థ సైతం వేగంగా వృద్ధి చెందుతూ, కొత్త కొత్త వాహనాలను లాంచ్ చేస్తూ వస్తోంది. గతేడాది లాంచ్ అయిన హ్యుందాయ్ ఎక్స్టర్ ఎస్యూవీ.. సూపర్ హిట్ కొట్టింది. ఇక ఈ ఏడాదిలో 4 ఎస్‌యూవీలను తీసుకురావాలని సంస్థ ప్లాన్ చేస్తోందట. గతేడాది వచ్చిన సేల్స్‌ని, ఈ ఏడాది మరింత పెంచుకోవాలని సంస్థ పట్టుదలతో ఉంది.
మరి ఈ ఐపీఓ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందనేది.. హ్యుందాయ్ మోటార్ ఇండియా సంస్థ చెప్పాల్సి ఉంది.
సంబంధిత కథనం