HDFC Bank service alert : దేశీయ దిగ్గజ ప్రైవేట్ బ్యాంకింగ్ సంస్థ హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. ఓ కీలక ప్రకటన చేసింది. ఏప్రిల్ 1న.. నెఫ్ట్ (నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్) సేవలు పనిచేయవని వెల్లడించింది. ఆర్థిక ఏడాది ముగింపు కారణంగా పలు ప్రక్రియలను పూర్తి చేసే క్రమంలో.. నెఫ్ట్ సేవల్లో జాప్యం చోటుచేసుకోవచ్చని స్పష్టం చేసింది. అందుకే.. యూజర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నెఫ్ట్ సేవలను సోమవారం ఒక్కరోజు వాడకూడదని పేర్కొంది. ఫలితంగా.. నెఫ్ట్ ద్వారా నెల మొదటి రోజు జీతాలు పొందే వారికి.. ఈసారి శాలరీలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయితే ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్ లేదా యూపీఐ వంటి ఇతర చెల్లింపు సేవలు యథావిధిగా పనిచేస్తాయని బ్యాంక్ స్పష్టం చేసింది.
"వినియోగదారులు దయచేసి గమనించండి. ఆర్థిక సంవత్సరం ముగింపు ప్రక్రియల కారణంగా నెఫ్ట్ లావాదేవీలు ఆలస్యం కావచ్చు. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ నెఫ్ట్ సేవలు 2024 ఏప్రిల్ 1న అందుబాటులో ఉండకపోవచ్చు. ఈ కాలంలో దయచేసి ఐఎంపీఎస్, ఆర్టీజీఎస్ లేదా యూపీఐ ఉపయోగించి మీ లావాదేవీని పూర్తి చేయాలని కోరుతున్నాం. దీనివల్ల కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నాం,' అని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తన ఖాతాదారులకు పంపిన ఈమెయిల్లో పేర్కొంది.
HDFC Bank NEFT services : 2024-25 కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుండటంతో అన్ని బ్యాంకులు తమ ఆర్థిక సంవత్సరాంత ఫార్మాలిటీలను పూర్తి చేసే పనిలో పడ్డాయి. ఈ సమయంలో బ్యాంకుల్లో సాధారణ సేవలకు అంతరాయం ఏర్పడుతోంది. అవసరమైన అన్ని ప్రక్రియలను పూర్తి చేయడానికి చాలా మంది బ్యాంక్ సిబ్బంది ఓవర్ టైమ్ పని చేస్తున్నారు.
2024-25 నూతన ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఇక ఇప్పుడు.. నూతన ఆర్థిక ఏడాది మొదటి రోజు నుంచి ఆర్థిక వ్యవహారాల్లో పలు కీలక మార్పులు చోటుచేసుకుంటాయి.
1. డెబిట్ కార్డు మెయింటెనెన్స్ ఛార్జీలను పెంచిన ఎస్బీఐ : దేశంలోని అతిపెద్ద వాణిజ్య బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే కొత్త ఆర్థిక సంవత్సరంలో వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీలను పెంచాలని నిర్ణయించింది. ఇకపై డెబిట్ కార్డుల నిర్వహణకు ఎస్బీఐ తన ఖాతాదారుల నుంచి రూ.75 వరకు వసూలు చేయనుంది.
Financial changes from April 1 2024 : 2. మ్యూచువల్ ఫండ్స్: విదేశీ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్)ల్లో ఇన్వెస్ట్ చేసే పథకాల్లో పెట్టుబడులను మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నిలిపివేయనుంది. ఈ మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని, పలు మ్యూచువల్ ఫండ్ పథకాలపై తీవ్ర ప్రభావం చూపనుందని అంచనాలు ఉన్నాయి.
3. బీమా డిజిటలైజేషన్: ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఐఆర్డీఏఐ) ఏప్రిల్ 1 నుంచి భారతదేశంలో బీమా పాలసీల డిజిటలైజేషన్ ప్రక్రియను తప్పనిసరి చేసింది. అంటే కొత్త ఆర్థిక సంవత్సరం నుంతి లైఫ్, హెల్త్- జనరల్ సహా బీమా పాలసీలను ఎలక్ట్రానిక్ విధానంలో జారీ చేస్తారు.
పైన చెప్పిన ఆర్థిక మార్పులను ప్రజలు కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి.
సంబంధిత కథనం