డబ్బులు కుమ్మరించిన ఎఫ్‌పీఐలు.. ఈ నెలలో ఇప్పటి వరకు 33 వేల కోట్లకు పైగా ఇన్వెస్ట్-fpi invested nearly 33700 crore rupees in indian stock market check out details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  డబ్బులు కుమ్మరించిన ఎఫ్‌పీఐలు.. ఈ నెలలో ఇప్పటి వరకు 33 వేల కోట్లకు పైగా ఇన్వెస్ట్

డబ్బులు కుమ్మరించిన ఎఫ్‌పీఐలు.. ఈ నెలలో ఇప్పటి వరకు 33 వేల కోట్లకు పైగా ఇన్వెస్ట్

Anand Sai HT Telugu
Sep 22, 2024 09:00 PM IST

Stock Market : గత వారం స్టాక్ మార్కెట్ ఊపందుకుంది. ఫెడ్ రిజర్వ్ నిర్ణయంతో భారత స్టాక్ మార్కెట్ రోజురోజుకూ పాత రికార్డులను బద్దలు కొడుతోంది. ఎఫ్‌పీఐల ద్వారా వేల కోట్లు ఇన్వెస్ట్ చేశారు.

ఎఫ్‌పీఐ
ఎఫ్‌పీఐ

పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటివరకు భారత స్టాక్ మార్కెట్లలో సుమారు రూ.33,700 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. అమెరికాలో వడ్డీరేట్ల తగ్గింపు, భారత మార్కెట్ బలపడటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక నెలలో భారత ఈక్విటీల్లో ఎఫ్‌పీఐ పెట్టుబడులు పెట్టడం ఇది రెండో అత్యధికమని డిపాజిటరీల గణాంకాలు చెబుతున్నాయి. అంతకుముందు మార్చిలో ఎఫ్‌పీఐ స్టాక్ మార్కెట్లో రూ.35,100 కోట్లు ఇన్వెస్ట్ చేసింది.

రాబోయే రోజుల్లో ఎఫ్‌పీఐ కొనుగోళ్లు కొనసాగే అవకాశం ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వికె.విజయకుమార్ అన్నారు. డిపాజిటరీల డేటా ప్రకారం ఫారిన్ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు ఈ నెలలో (సెప్టెంబర్ 20 వరకు) ఈక్విటీల్లో నికరంగా రూ.33,691 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు ఈక్విటీల్లో వారి పెట్టుబడులు రూ.76,572 కోట్లకు చేరాయి. జూన్ నుంచి ఎఫ్‌పీఐలు వరుసగా కొనుగోళ్లు చేస్తున్నారు.

అంతకుముందు ఏప్రిల్-మేలో షేర్ల నుంచి రూ.34,252 కోట్లు ఉపసంహరించుకున్నారు. సెప్టెంబర్‌లో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీరేట్లను తగ్గిస్తుందన్న అంచనాల మధ్య ఎఫ్‌పీఐలు కొనుగోళ్లు చేస్తున్నారు. సెప్టెంబర్ 18న ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేటును 0.50 శాతం తగ్గించడంతో ఎఫ్‌పీఐలు మరింత దూకుడుగా కొనుగోళ్లు జరిపారు. అమెరికా డాలర్ బలహీనత, ఫెడరల్ రిజర్వ్ ట్రెండ్ ఎఫ్‌పీఐకు భారత స్టాక్ మార్కెట్‌ను ఆకర్షణీయంగా మార్చాయని గోలిఫై స్మాల్ కేస్ మేనేజర్ ఫౌండర్, సీఈఓ రాబిన్ ఆర్య తెలిపారు.

దీనికి తోడు ద్రవ్యలోటు, భారత కరెన్సీపై రేట్ల కోత ప్రభావం, బలమైన వాల్యుయేషన్లు, ద్రవ్యోల్బణంపై ఆర్బీఐ వైఖరి భారత్ వంటి వర్ధమాన మార్కెట్లకు ఆకర్షణీయంగా ఉన్నాయని బీడీవో ఇండియా పార్టనర్, ఎఫ్ఎస్ ట్యాక్స్, ట్యాక్స్ అండ్ రెగ్యులేటరీ సర్వీసెస్‌కు చెందిన మనోజ్ పురోహిత్ అన్నారు. వీటితో పాటు విదేశీ ఫండ్స్ కూడా ఈ ఏడాది ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్స్(ఐపీఓ)ల వైపు సానుకూలంగా ఉన్నాయని తెలిపారు.

స్టాక్స్‌తోపాటు, ఎఫ్‌పీఐలు వాలంటరీ రిటెన్షన్ రూట్ (విఆర్ఆర్) ద్వారా డెట్ లేదా బాండ్ మార్కెట్లోకి రూ.7,361 కోట్లు, పూర్తిగా అందుబాటులో ఉన్న మార్గం(ఎఫ్ఆర్ఆర్) ద్వారా రూ .19,601 కోట్లు పెట్టుబడి పెట్టారు. విఆర్ఆర్ దీర్ఘకాలిక పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది. ఎఫ్ఆర్ఆర్ విదేశీ పెట్టుబడిదారులకు లిక్విడిటీ, ప్రాప్యతను పెంచుతుంది.

టాపిక్