EPFO bans Paytm: పేటీఎంకు మరో షాక్; పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఈపీఎఫ్ఓ నిషేధం
EPFO bans Paytm Payments Bank: ప్రముఖ స్టార్ట్ అప్, డిజిటల్ పేమెంట్ సంస్థ పేటీఎంకు మరో షాక్ తగిలింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలను తమ ప్లాట్ ఫామ్ పై ఈపీఎఫ్ఓ నిషేధించింది.
EPFO bans Paytm: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లావాదేవీలను తమ ప్లాట్ ఫామ్ పై ఈపీఎఫ్ఓ నిషేధిస్తున్నట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ - ఈపీఎఫ్ఓ ప్రకటించింది. పేటీఎం అనుబంధ సంస్థలోని బ్యాంకు ఖాతాలకు లింక్ చేసిన క్లెయిమ్ లను స్వీకరించకూడదని ఈపీఎఫ్ఓ (EPFO) నిర్ణయించింది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ పై ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) తీసుకున్న ఈ చర్య కస్టమర్లపై ప్రభావం చూపనుంది. ఈపీఎఫ్ఓ లో దాదాపు 30 కోట్ల మంది చందాదారులున్నారు. ఫిబ్రవరి 29 తర్వాత కొత్త డిపాజిట్ల స్వీకరణను నిలిపివేయాలని ఆర్బీఐ ఆదేశించడంతో పేటీఎం లో సంక్షోభం నెలకొన్నది.
ఈపీఎఫ్ఓ చందాదారులకు ఎలాంటి మార్పులు?
ఈపీఎఫ్ఓ నిర్ణయంతో పేమెంట్స్ బ్యాంక్ కు చెందిన బ్యాంకు ఖాతాల్లో ఉపసంహరణలపై, క్రెడిట్ లావాదేవీలపై ప్రభావం పడుతుంది. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా చెల్లింపులకు ఈపీఎఫ్ఓ గత సంవత్సరం అనుమతినిచ్చింది. ప్రస్తుతం పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ కు ఇచ్చిన అనుమతిని ఈపీఎఫ్ఓ రద్దు చేసింది. ఇప్పడు ఈపీఎఫ్ఓ చందాదారులు తమ ఈపీఎఫ్ఓ కార్పస్ ను యాక్సెస్ చేయడానికి తమ బ్యాంక్ ఖాతా వివరాలను అప్డేట్ చేయాల్సి ఉంటుంది.
ఆర్బీఐ స్పందన
నిబంధనలను పదేపదే ఉల్లంఘించిన కారణంగానే పేటీఏం పేమెంట్స్ బ్యాంక్ పై ఆంక్షలు విధించామని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ (Shaktikanta Das) స్పష్టం చేశారు. దిద్దుబాటు చర్యలు తీసుకోవడానికి తగినంత సమయాన్ని కూడా ఇచ్చామన్నారు. కాగా, అయితే ఈ నిర్ణయంతో పేటీఎం యాప్ పై ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ జే తెలిపారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ (Paytm Payments Bank) లావాదేవీలపై మాత్రమే ఆంక్షలు ఉంటాయన్నారు. పేటీఎం యాప్ తో అయోమయానికి గురికావొద్దని, ఈ చర్య వల్ల యాప్ పై ఎలాంటి ప్రభావం పడదని తెలిపారు.