ITR filing deadline: ఐటీఆర్ ఫైలింగ్ గడువును పొడిగించిన సీబీడీటీ
ITR filing deadline: కార్పొ రేట్లు తమ ఆదాయ పన్ను రిటర్న్స్ ను దాఖలు చేసే గడువును సీబీడీటీ మరో 15 రోజులు పొడిగించింది. దాంతో, ఇప్పుడు కార్పొరేట్లు నవంబర్ 15వ తేదీ వరకు, ఎలాంటి రుసుము లేకుండా, తమ ఐటీఆర్ లను దాఖలు చేయవచ్చు.
ITR filing deadline: 2024-25 మదింపు సంవత్సరానికి కార్పొరేట్లు తమ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయాల్సిన గడువును నవంబర్ 15వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (CBDT) శనివారం తెలిపింది. నిజానికి ఈ గడువు అక్టోబర్ 31వ తేదీతో ముగుస్తుంది. కానీ, కార్పొరేట్ల ఐటీఆర్ ఫైలింగ్ గడువును మరో 15 రోజులు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. దాంతో, కార్పొరేట్ల ఐటీఆర్ ఫైలింగ్ గడువు నవంబర్ 15 కు మారింది.
2024-25 మదింపు సంవత్సరానికి.
ఆదాయపు పన్ను సెక్షన్ 119 ప్రకారం కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (cbdt) తన అధికారాలను వినియోగించుకుంటుంది. ‘‘2024-25 మదింపు సంవత్సరానికి సంబంధించి సెక్షన్ 139లోని సబ్ సెక్షన్ (1) కింద రిటర్న్ ఆఫ్ ఇన్ కమ్ దాఖలు గడువు తేదీని సెక్షన్ 2లోని క్లాజ్ (ఎ)లో పేర్కొన్న మదింపుదారుల విషయంలో సెక్షన్ 13 9లోని సబ్ సెక్షన్ (1)కు, అంటే 2024 అక్టోబర్ 31 నుంచి 2024 నవంబర్ 15 వరకు పొడిగించింది. 2024’’ అని సీబీడీటీ తాజా సర్క్యులర్లో పేర్కొంది. అలాగే, ఈ గడువు పొడిగింపు గురించి ఆదాయపు పన్ను శాఖ తన సోషల్ మీడియా ఖాతాలో ఎక్స్ లో పోస్ట్ చేసింది.
వీటికి వర్తించదు..
అయితే, ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్, ఫారం 3సీఈబీలో ట్రాన్స్ఫర్ ప్రైసింగ్ సర్టిఫికేషన్, ఫారం 10డీఏ వంటి ఇతర ఆదాయపు పన్ను ఫారాలకు ఈ పొడిగింపు వర్తించదని, దీనికి అక్టోబర్ 31 వరకు మాత్రమే గడువు ఉందని చార్టర్డ్ అకౌంటెంట్ సంస్థలు తెలిపాయి.
దీపావళి వల్ల ఐటీఆర్ గడువు పొడిగింపు
దీపావళి (Deepavali) పండుగ కారణంగానే ఐటీఆర్ (itr) ఫైలింగ్ గడువును పెంచి ఉంటారని కార్పొరేట్ నిపుణులు భావిస్తున్నారు. అక్టోబర్ 31లోగా అంటే దీపావళి నాటికి రిటర్నులు దాఖలు చేయాల్సి ఉన్నందున, ఆ గడువు లోగా ఐటీఆర్ లను ఫైల్ చేయడం కంపెనీలకు భారంగా మారిందని ఒక నిపుణుడు తెలిపారు. నిర్ణీత తేదీలోగా ఐటీఆర్ దాఖలు చేయకపోతే ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం రూ.10 వేల జరిమానా, ఇతర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఫైలింగ్ (ITR Filing) లో జాప్యం జరిగితే ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 234ఏ కింద చెల్లించాల్సిన పన్నుపై వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుంది.