Budget 2024: గత బడ్జెట్ లలో కేంద్రం ఇచ్చిన 6 ముఖ్యమైన హామీలు ఇవే..
Budget 2024 Highlights: దివాలా కేసుల సత్వర పరిష్కారం, ఐఈపీఎఫ్ ద్వారా షేర్లు, డివిడెండ్ల పునరుద్ధరణ, ఇన్వెస్ట్ మెంట్ అండ్ ఇన్ ఫ్రా ఫండ్ ఏర్పాటు, సోషల్ స్టాక్ ఎక్సేంజ్ ఏర్పాటు.. వంటి పలు ముఖ్యమైన హామీలు కేంద్ర ప్రభుత్వం గత బడ్జెట్ ప్రసంగాల సమయంలో దేశ ప్రజలకు ఇచ్చింది.
మరో రెండు రోజుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనుంది. త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనున్న కారణంగా, ఈ సంవత్సరం కేంద్రం మధ్యంతర బడ్జెట్ ను మాత్రమే ప్రవేశపెడ్తుంది. ఎన్నికలు ముగిసి, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత, మరోసారి పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెడ్తారు. కాగా, నెరవేర్చిన హామీలను వివరిస్తూ కేంద్రం #PromisesDelivered అనే హ్యాష్ ట్యాగ్ తో సోషల్ మీడియా లో ప్రచారం నిర్వహిస్తోంది. ఈ బడ్జెట్ 2024 (Budget 2024) కు ముందు, గతంలో ఇచ్చిన బడ్జెట్ హామీలు ఏమిటో చూద్దాం.
దివాళా కేసుల సత్వర పరిష్కారం
దివాలా కేసుల వేగంగా పరిష్కరించడానికి వీలుగా ప్రభుత్వం నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ కు 20 మంది కొత్త సభ్యుల నియామకాన్ని ఖరారు చేసింది. కేసుల సత్వర పరిష్కారం కోసం ఎన్ సీ ఎల్ టీ ఫ్రేమ్ వర్క్ ను బలోపేతం చేస్తామని ప్రకటించింది. ఈ-కోర్టుల వ్యవస్థను అమలు చేసి, రుణ పరిష్కారానికి ప్రత్యామ్నాయ పద్ధతులు, ఎంఎస్ఎంఈలకు ప్రత్యేక ఫ్రేమ్ వర్క్ ను ప్రవేశపెడ్తామని తెలిపింది.
ఎల్ఎల్పీ చట్టం కొత్త నిబంధనలు
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం ఎల్ఎల్పీ (సవరణ) చట్టం, 2021 ను ప్రభుత్వం తీసుకువచ్చింది. ప్రయోజనకరమైన స్టార్ట్ అప్ లను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ చట్టం తీసుకువచ్చారు. ఈ చట్టాన్ని పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించాయి. అలాగే, 2021 ఆగస్టు 13 న భారత రాష్ట్రపతి ఆమోదం కూడా పొందింది. ఈ సవరణ చట్టంలో 20 సెక్షన్లను సవరించారు. 3 సెక్షన్లను తొలగించారు. అలాగే, 7 కొత్త సెక్షన్లను చేర్చారు.
క్లెయిమ్ చేయని షేర్ల పునరుద్ధరణ
క్లెయిమ్ చేయని షేర్లు మరియు డివిడెండ్లను ఇబ్బంది లేని మార్గంలో తిరిగి పొందడంలో పెట్టుబడిదారులకు సహాయపడటానికి ఇన్వెస్టర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్ ఫండ్ అథారిటీ (IEPF)ని స్థాపించారు. దీనిని పెట్టుబడిదారుల కు అవగాహన కల్పించడంతో పాటు వారి నిధుల రక్షణ కోసం సెప్టెంబర్ 7, 2016 న ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఇన్వెస్టర్లు తమ క్లెయిమ్ చేయని డివిడెండ్లు, మెచ్యూర్డ్ డిపాజిట్లు, మెచ్యూర్డ్ డిబెంచర్లు, రీఫండ్స్ న పొందవచ్చు.
ఎన్ఐఐఎఫ్ ఏర్పాటు
అంతర్జాతీయ, దేశీయ పెట్టుబడిదారులకు సహకార వేదికగా నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ (NIIF) ను ఏర్పాటు చేశారు. ఇది ఆస్ట్రేలియా, కెనడా, యూఏఈ, సింగపూర్, యూఎస్ఏ, జపాన్, భారత్ లలోని 17 మంది పెట్టుబడిదారుల నుండి నిధులను సేకరించింది. మాస్టర్ ఫండ్, ఫండ్ ఆఫ్ ఫండ్స్, స్ట్రాటజిక్ ఫండ్ అనే మూడు ఫండ్లను ఈ ఎన్ఐఐఎఫ్ నిర్వహిస్తుంది.
సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ఏర్పాటు
సెబీ ఆమోదంతో ప్రస్తుత స్టాక్ ఎక్స్ఛేంజ్ పరిధిలోనే ఒక ప్రత్యేక విభాగంగా సోషల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ ను ఏర్పాటు చేశారు. ఇందులో నాబార్డు ఆధ్వర్యంలో రూ.100 కోట్లతో కెపాసిటీ బిల్డింగ్ ఫండ్ ను ఏర్పాటు చేశారు. ఇందులో సిడ్బీ, బీఎస్ఈ, ఎన్ఎస్ఈ పెట్టుబడులు పెట్టాయి.
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్
సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) లో వృద్ధులు పెట్టే ఇన్వెస్ట్మెంట్ మొత్తాన్ని రూ. 15 లక్షల నుంచి రూ. 30 లక్షలకు పెంచారు. సీనియర్ సిటిజన్లకు మరింత ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ఈ ఏర్పాటు చేశారు. సెప్టెంబర్ 2023 వరకు ఎస్సీఎస్ఎస్ కింద నికర వసూళ్లు రూ .74,801.73 కోట్లుగా ఉన్నాయి.
టాపిక్