Online trading scam: ఆన్ లైన్ ట్రేడింగ్ స్కామ్ లో రూ. 6.54 కోట్లు పోగొట్టుకున్న బెంగళూరు వ్యక్తి-bengaluru man loses rs 6 54 crore in fraudulent online share trading scheme details ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Online Trading Scam: ఆన్ లైన్ ట్రేడింగ్ స్కామ్ లో రూ. 6.54 కోట్లు పోగొట్టుకున్న బెంగళూరు వ్యక్తి

Online trading scam: ఆన్ లైన్ ట్రేడింగ్ స్కామ్ లో రూ. 6.54 కోట్లు పోగొట్టుకున్న బెంగళూరు వ్యక్తి

Sudarshan V HT Telugu
Oct 24, 2024 07:37 PM IST

Online trading scam: అత్యాశతో, అసాధారణ రాబడులకు ఆశపడి, ఒక బెంగళూరు వాసి ఏకంగా రూ. 6.54 కోట్లు పోగొట్టుకున్నాడు. ఆన్ లైన్ షేర్ ట్రేడింగ్ స్కామ్ లో చిక్కుకుని, అధిక రాబడులు ఆశించి పెద్ద మొత్తంలో నష్టపోయాడు. ఆధునిక సాంకేతికతతో స్కామర్లు ఆ వ్యక్తిని మోసం చేశారు.

ఆన్ లైన్ ట్రేడింగ్ స్కామ్ లో  రూ.6.54 కోట్లు పోగొట్టుకున్న బెంగళూరు వాసి
ఆన్ లైన్ ట్రేడింగ్ స్కామ్ లో రూ.6.54 కోట్లు పోగొట్టుకున్న బెంగళూరు వాసి (Pexels)

Online trading scam: బెంగళూరుకు చెందిన 56 ఏళ్ల విద్యాధికుడైన వ్యక్తి ఒక ఆన్ లైన్ ట్రేడింగ్ మోసంలో ఏకంగా రూ. 6.54 కోట్లు నష్టపోయాడు. ఒక కంపెనీకి డైరెక్టర్ గా ఉన్న ఆ వ్యక్తి మోసపూరిత షేర్ల ట్రేడింగ్ స్కీమ్ కారణంగా రూ.6.54 కోట్లు పోగొట్టుకున్నాడు. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులతో అధిక రాబడులను అందిస్తామన్న మోసగాళ్ల మాటలను నమ్మి భారీగా నష్టపోయాడు.

స్వల్ప కాలంలో 1500 శాతం రాబడి

ప్రజలను మోసం చేయడానికి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ఎలా ఉపయోగపడుతున్నాయో ఈ స్కామ్ బయటపెడుతుంది. ఆ స్కామర్లు అతని పెట్టుబడులపై 1500 శాతం అసాధారణ రాబడి ఇస్తామని వాగ్దానం చేశారు. ఈ ఆకర్షణీయమైన ఆఫర్ ను అతను కాదనలేకపోయాడు. ఆ ఆఫర్ సాధ్యాసాధ్యాలను ఆలోచించకుండా, మోసగాళ్లు సిఫారసు చేసిన మోసపూరిత ట్రేడింగ్ అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకున్నాడు.

వివిధ ఖాతాలకు ఆరున్నర కోట్లు బదిలీ

ఈ సంవత్సరం ఆగస్టు ప్రారంభం నుండి అక్టోబర్ మధ్య వరకు, ఆ బెంగళూరు (bengaluru) వాసి ఆ ట్రేడింగ్ (trading) మోసగాళ్లకు చెందిన వివిధ బ్యాంక్ ఖాతాలకు పెద్ద ఎత్తున డబ్బును బదిలీ చేశాడు. ఈ మొత్తం తనకు గణనీయమైన రాబడిని ఇస్తుందని ఆయన నమ్మారు. ఆ నకిలీ ట్రేడింగ్ ప్లాట్ ఫామ్ కూడా అతడికి తన పెట్టుబడులపై కళ్లు చెదిరే లాభాలను చూపించింది. అయితే తన లాభాలను వెనక్కి తీసుకునేందుకు ప్రయత్నించడంతో ఈ కుంభకోణం (scam) బయటపడింది. ఆ డబ్బును పొందడానికి అదనంగా రూ.2.5 కోట్లు ఫీజు చెల్లించాలని ఆ మోసగాళ్లు డిమాండ్ చేయడంతో అతడికి అనుమానం వచ్చింది.

సైబర్ క్రైమ్ కు ఫిర్యాదు

వారు తన కాల్స్, మెసేజెస్ కు స్పందించకపోవడంతో తాను మోసపోయానని ఆ బాధితుడు గ్రహించాడు. వెంటనే బెంగళూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై వెంటనే సైబర్ క్రైమ్ (cybercrime) పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిందితులను గుర్తించడానికి మొదటగా వారు ఉపయోగించిన బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. ఈ సంఘటన నేపథ్యంలో, స్టాక్ మార్కెట్ (stock market) లో పెట్టుబడి అవకాశాల గురించి వస్తున్న అవాస్తవిక కథనాలను నమ్మవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు తీసుకోండి..

  • ముఖ్యంగా ఆన్ లైన్ లో అందిన అవాంఛిత పెట్టుబడి సలహాలను విశ్వసించకండి.
  • అపరిచిత వ్యక్తులతో మీ ఆర్థిక, బ్యాంకింగ్ (banking) సమాచారాన్ని పంచుకోకండి.
  • అనుమానాస్పద సోర్స్ ల నుంచి యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవడం మానుకోండి.
  • ఇన్వెస్ట్ మెంట్ ప్లాట్ ఫామ్ ప్రామాణికతను ధృవీకరించుకున్న తరువాతే పెట్టుబడులు పెట్టండి.
  • ఇన్వెస్ట్మెంట్ ఆఫర్ చాలా బాగుందని అనిపిస్తే, అది మోసపూరిత ఆఫర్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని గుర్తుంచుకోండి.

Whats_app_banner