7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్- ఆగస్ట్ 1 నుంచి జీతాలు పెంపు!
Government employees salary hike : 7వ వేతన సంఘం సిఫార్సులను ఆగస్టు 1 నుంచి అమలు చేయాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. అసెంబ్లీ సమావేశాల్లో జీతాల పెంపును ముఖ్యమంత్రి ప్రకటించనున్నారు.
కర్ణాటక ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్! జీతాల పెంపుపై ప్రకటన ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూసిన వారికి కీలక అప్డేట్. 7వ వేతన సంఘం సిఫార్సులను ఆగస్టు 1 నుంచి అమలు చేయాలని కర్ణాటక కేబినెట్ నిర్ణయించింది. ఏడు లక్షల మందికి పైగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాల పెంపును అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించనున్నారు.
ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు..
కర్ణాటకలో ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు విషయంపై గత కొంతకాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంపై కేబినెట్ ఇంతకు ముందే చర్చలు జరిపింది. తుది నిర్ణయం సీఎం సిద్ధరామయ్యకు వదిలేసింది. ఇక ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను పెంచేందుకు ఆయన అంగీకరించారు.
ఆగస్టులో నిరవధిక సమ్మె చేపడతామని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రకటించిన నేపథ్యంలో జీతాల పెంపునకు ఆమోదం తెలపాలని సిద్ధరామయ్య ప్రభుత్వంపై ఒత్తిడి వచ్చింది. ఈ నేపథ్యంలో కేబినెట్ నుంచి ఈ నిర్ణయం వెలువడటం విశేషం.
ప్రభుత్వ ఉద్యోగుల మూలవేతనంలో 27.5 శాతం పెంచాలని మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.సుధాకర్ రావు నేతృత్వంలోని 7వ వేతన సంఘం సూచించింది. దీనివల్ల ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.17,440.15 కోట్ల భారం పడుతుందని మీడియా కథనాలు చెబుతున్నాయి.
మార్చి 2023లో,అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఉద్యోగులకు మధ్యంతర 17 శాతం వేతన పెంపును ఇచ్చారు. దీనికి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 10.5 శాతం పాయింట్ల పెంపును జోడించే అవకాశం ఉంది. ఇది 7వ వేతన సంఘం సిఫార్సు ప్రకారం మూల వేతనంపై 27.5 శాతం పెరుగుతుంది. కాగా దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
బస్సు ఛార్జీలు పెంపు..!
మరోవైపు కర్ణాటకవ్యాప్తంగా బస్సు ఛార్జీలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు పథకంతో కేఎస్ఆర్టీసీ (కర్ణాటక స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్) ఉక్కిరిబిక్కిరి అవుతోంది. మహిళలకు ఇస్తున్న ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో కేఎస్ఆర్టీసీ నష్టాలు మరింత పెరిగి, గత మూడు నెలల్లో రూ. 295 కోట్లకు చేరింది. ఫలితంగా టికెట్ ధరలను భారీగా పెంచాలని డిమాండ్లు పెరుగుతున్నాయి.
శక్తి పథకంలో భాగంగా ఎన్నికల హామీని నెరవేర్చుతూ, కర్ణాటకవ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలను అందిస్తోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఇది కేఎస్ఆర్టీసీని దెబ్బతిస్తోంది. అందుకే టికెట్ ధరలను కనీసం 15శాతం నుంచి 20శాతం వరకు పెంచాలని కేఎస్ఆర్టీసీ వర్గాలు, ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.
చివరిసారిగా 2019లో బస్సు టికెట్ ధరలను పెంచినట్లు కేఎస్ఆర్టీసీ చైర్మన్ ఎస్ఆర్ శ్రీనివాస్ తెలిపారు. “అప్పటి నుంచి ఐదేళ్లు గడుస్తున్నా పెరుగుదల లేకుండా పోయింది. చమురు ధరల పెరుగుదల కారణంగా ఛార్జీల పెంపు అనివార్యమైంది. జీతాలు పెంచడానికి, ఉద్యోగులకు ప్రయోజనాలు అందించడానికి రేట్లను సర్దుబాటు చేయాల్సిన అవసరం ఉంది. కేఎస్ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణలు 2020లో జరిగాయి. తదుపరి సవరణ 2024లో జరగాలి,” అని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం