Employees salary hike : ప్రభుత్వ ఉద్యోగుల జీతాన్ని 27శాతం పెంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయా?
7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు వ్యవహారంపై ముఖ్యమంత్రి యోచిస్తున్నట్టు తెలుస్తోంది. జీతాల పెంపుపై సిద్ధరామయ్య సానుకూలంగా ఉన్నట్టు సమాచారం. కానీ..

7th Pay Commission Karnataka : కర్ణాటకవ్యాప్తంగా ఇప్పుడు 7వ పే కమిషన్‌పై తెగ చర్చలు జరుగుతున్నాయి. ప్రభుత్వం 7వ పే కమిషన్ని అమలు చేస్తుందా? ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు 27శాతం పెరుగుతాయా? అన్న ప్రశ్నలపై సర్వత్రా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..
7వ పే కమిషన్ సిఫార్సులను కర్ణాటక ప్రభుత్వం అమలు చేస్తుందా?
7వ పే కమిషన్ సిఫార్సులపై గత వారం ప్రభుత్వం చర్చలు జరిపింది! సీఎం సిద్ధరామయ్య.. తన కేబినెట్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలను 27శాతం పెంచే విషయంపై ఆయన సుముఖంగానే ఉన్నట్టు తెలుస్తోంది. దీనిపై సుదీర్ఘ సమయం పాటు చర్చ జరిగిందట. చివరికి.. ఈ విషయంపై తుది నిర్ణయం సీఎం తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించిందని సమాచారం.
7వ పే కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని చాలా కాలంగా ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంపై ప్రభుత్వం సానుకూలంగానే ఉన్నప్పటికీ.. ప్రభుత్వంపై పడే భారాన్ని ఓసారి లెక్కించాలని సీఎం అభిప్రాయపడుతున్నట్టు సమాచారం.
అయితే.. 7వ పే కమిషన్ సిఫార్సుల అమలులో జాప్యంపై ఉద్యోగ సంఘాలు అసంతృప్తితో ఉన్నాయి. కేబినెట్ సమావేశంలోనే ఒక నిర్ణయం తీసుకుని ఉండాల్సిందని అభిప్రాయపడుతున్నాయి.
కాగా.. పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ని పెంచి, ఇప్పటికే ప్రజలు, విపక్షం నుంచి విమర్శలు ఎదుర్కొంటోంది కర్ణాటక ప్రభుత్వం. మరి ఈ సమయంలో.. ఉద్యోగుల జీతాల పెంచి, ఆర్థిక భారాన్ని తలమీద వేసుకుంటుందా? లేదా? అనేది చూడాలి.
Government Employees salary hike : ప్రభుత్వ ఉద్యోగుల జీతాల పెంపు వ్యవహారం 2022 నుంచి సాగుతోంది. 2022 మేలో రీటైర్డ్ చీఫ్ సెక్రటరీ కే. సుధాకర్ రావ్ నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది అప్పటి బీజేపీ ప్రభుత్వం. అసెంబ్లీ ఎన్నికల కారణంగా ఈ కమిటీ టెన్యూర్ని మరో 6 నెలలు పెంచడం జరిగింది.
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి ముందు.. ఉద్యోగుల జీతాల్ని 17శాతం మేర పెంచాలని ఆదేశాలిచ్చింది బీజేపీ ప్రభుత్వం. కానీ తమకు 40శాతం జీతాల పెంపు కావాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. చివరికి.. సుధాకర్ రావ్ కమిటీ.. ప్రభుత్వ ఉద్యోగులకు 27.5శాతం జీతాల పెంపు ఇవ్వాలని సూచించింది.
అయితే.. 7వ పే కమిషన్ సిఫార్సులను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు ఒత్తిడి చేస్తున్నాయి. పైగా.. 2023 ఏప్రిల్ నుంచి వీటిని అమల్లోకి తీసుకొస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఒక వేళ ఇలా జరగకపోతే.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేస్తామని తేల్చిచెబుతున్నాయి.
7వ పే కమిషన్ సిఫార్సులను సిద్ధరామయ్య ప్రభుత్వం అంగీకరించిందని సంబంధిత వర్గాలు చెప్పాయి. మరి దీనిపై తుది నిర్ణయం ఎప్పుడు వెలువడుతుందో తెలియాలి.
గత బీజేపీ ప్రభుత్వం 17శాతం పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో 10శాతం పెంచాల్సి ఉంటుంది. కానీ.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృశ్చ్యా.. 27శాతం ఉద్యోగాల పెంపు అంటే కాస్త కష్టమే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 10శాతం జీతాల పెంపునకు కనీసం రూ. 17,500 కోట్లు అవసరం పడుతుందని కానీ ఇందుకోసం ప్రభుత్వం కేవలం రూ. 15వేల కోట్లను ఖర్చు చేసేందుకు యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
Karnataka Employees salary hike : ప్రభుత్వ ఉద్యోగాల్లో 40శాతం ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీనిచ్చింది. ఇదే నిజమైతే.. ప్రభుత్వానికి మరో 20వేల కోట్ల రూపాయల అదనపు ఖర్చు అవుతుంది.
జీతాలు పెంచి, ఖాళీలను భర్తీ చేస్తే.. జీతాలు రూ. 1.1లక్షల కోట్లు దాటుతాయి. అయితే.. దీనికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు, అవసరమైతే ఇతర ఆదాయ వనరులను పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు ఓ మంత్రి చెప్పారు.
కర్ణాటక బడ్జెట్లో సగం ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు ఖర్చు అవుతున్నట్టు తెలుస్తోంది.
సంబంధిత కథనం