Gold Loan Vs Personal Loan : పర్సనల్ లోన్ కంటే గోల్డ్ లోన్ ఎందుకు బెటర్.. 5 కారణాలు
Gold Loan Vs Personal Loan : ఆర్థిక అవసరాలతో కొన్నిసార్లు లోన్ తీసుకుంటాం. ఇందుకోసం కొంతమంది బంగారాన్ని తాకట్టు పెడితే.. మరికొందరు పర్సనల్ లోన్ తీసుకుంటారు. ఈ రెండింటిలో ఏది బెటర్ అని చూద్దాం..
జీవితంలో ఏదో ఒక సమయంలో ఆర్థిక సహాయం కావాలి. అందు కోసం లోన్ ఆప్షన్‌లను చూస్తుంటాం. ఇందుకోసం వివిధ రకాల దారులు ఉన్నాయి. పర్సనల్ లోన్, గోల్డ్ లోన్ లాంటివి తీసుకోవచ్చు. రుణగ్రహీతలు తరచుగా వ్యక్తిగత రుణాల కంటే బంగారు రుణాల లాభాలు, నష్టాలను అంచనా వేస్తారు. అందుకే పర్సనల్ లోన్, గోల్డ్ లోన్.. రెండింటిలో ఏది మంచిదో తెలుసుకుందాం.. చాలా మంది ఆర్థికవేత్తలు బంగారంపై రుణాలను ఎంచుకోవడం మంచిది అంటారు. ఎందుకంటే ఎలాంటి అర్హత లేకుండా బంగారు రుణాలు తీసుకోవచ్చు.
పర్సనల్ లోన్‌కి చాలా డాక్యుమెంట్స్
బంగారంపై ఎలాంటి పూచీకత్తును అందించాల్సిన అవసరం లేదు. బంగారాన్ని ఉంచుకోవడం ద్వారా మీకు బ్యాంకులు లోన్ ఇస్తాయి. అందుకే ఇబ్బందుల్లో ఉన్నప్పుడు బంగారం మీద లోన్ కోసం చాలా మంది ప్రయత్నం చేస్తారు. అదే పర్సనల్ లోన్ విషయానికి వస్తే చాలా డాక్యుమెంట్స్ ఇవ్వాలి. పర్సనల్ లోన్ పొందుతున్నప్పుడు లోన్ అప్లికేషన్‌తో పాటు సంబంధిత డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. ఆదాయ రుజువు, నివాసం తదితర పత్రాలు అందించాల్సి ఉంటుంది. పర్సనల్ లోన్ అనేది సమయం తీసుకునే ప్రక్రియ. గోల్డ్ లోన్ వేగంగా ఉంటుంది. ఇది వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉంటుంది.
ప్రాసెసింగ్ ఫీజు
వ్యక్తిగత రుణాలు పొందే సమయంలో బ్యాంకులు ఎలాంటి భద్రతను అందించవు. లోన్ ఇచ్చే సమయంలో ఆదాయానికి సంబంధించిన డాక్యుమెంట్లను సరిచూసుకుని, కొద్ది మొత్తంలో ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తాయి. బంగారంపై రుణాలకు ఇది అవసరం లేదు. ఎందుకంటే బంగారం డిపాజిట్ చేస్తాం. ప్రాసెసింగ్ ఖర్చు ఇందులో కనిపించదు.
తిరిగే చెల్లించే సామర్థ్యం
బ్యాంకులు, రుణ సంస్థలు లేదా NBFCలు వ్యక్తిగత రుణ దరఖాస్తులను ఇచ్చేటప్పుడు ఆదాయ సంబంధిత పత్రాలను చూస్తారు. దరఖాస్తుదారుకు తిరిగి చెల్లించే సామర్థ్యం ఉందో లేదో తెలుసుకోవడానికి ఎంక్వైరీ చేస్తారు. చాలా సమయం తీసుకుంటుండడంతో రుణం పొందడంలో జాప్యం జరుగుతోంది. బంగారు రుణం పొందే ప్రక్రియ సులభంగా ఉంటుంది. రుణగ్రహీతలు, వివిధ దరఖాస్తు ఫారమ్‌లపై సంతకం చేసిన తర్వాత వారి బంగారం తాకట్టుగా పెట్టాలి. అప్పుడు మాత్రమే సంస్థ దాని విలువ ఆధారంగా రుణ మొత్తాన్ని నిర్ణయిస్తుంది.
ఈఎంఐ ఆప్షన్స్
వ్యక్తిగత రుణం, బంగారు రుణం రుణగ్రహీతలు ఈఎంఐ ద్వారా తిరిగి చెల్లించడానికి అనుమతిస్తుంది. వ్యక్తిగత రుణాలతో పోలిస్తే.. బంగారంపై రుణ చెల్లింపులో ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి. గోల్డ్ లోన్ రీపేమెంట్ కోసం సాధారణంగా ఈఎంఐ మోడ్‌ని ఎంచుకోవచ్చు. లోన్ వ్యవధిలోనే వడ్డీని తిరిగి చెల్లించడానికి పెట్టుకోవచ్చు. రుణ వ్యవధి ముగింపులో వడ్డీ, రుణాన్ని తిరిగి చెల్లించే పద్ధతిని ఎంచుకోవచ్చు. ఇందులో చాలా ఆప్షన్‌లు ఉన్నందున, రుణాన్ని తిరిగి చెల్లించే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి.
వడ్డీ రేట్లు
వ్యక్తిగత రుణాలతో పోలిస్తే బంగారు రుణాలపై వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. వ్యక్తిగత రుణాలపై వడ్డీ రేటు గోల్డ్ లోన్‌తో పోల్చితే ఎక్కువగా ఉంటుంది. వ్యక్తిగత రుణాల కోసం గరిష్ట రుణ మొత్తం సాధారణంగా రూ. 50,000 నుంచి రూ. 15 లక్షల మధ్య ఉంటుంది. ఈ మొత్తం లోన్ తీసుకునే వ్యక్తి తిరిగి చెల్లించే సామర్థ్యం, ఎంచుకున్న రుణ కాల వ్యవధి ద్వారా నిర్ణయిస్తారు.
గోల్డ్ లోన్ కోసం రుణ మొత్తం తాకట్టుగా అందించిన బంగారం విలువ, రుణదాత సెట్ చేసిన లోన్-టు-వాల్యూ (LTV) నిష్పత్తిపై ఆధారపడి ఉంటుంది. భారతీయ రిజర్వ్ బ్యాంక్ గోల్డ్ లోన్ LTV నిష్పత్తిని 75శాతానికి పరిమితం చేసింది. అంటే రుణగ్రహీతలు తమ బంగారం విలువలో 75 శాతం వరకు రుణంగా పొందవచ్చు.