PM Svanidhi Scheme : వీధి వ్యాపారులకు గుడ్ న్యూస్, పీఎం స్వనిధి స్కీమ్ లో రూ.50 వేల వరకు రుణాలు-వడ్డీలో 7 శాతం సబ్సిడీ
PM Svanidhi Scheme : పీఎం స్వనిధి పథకం ద్వారా వీధి వ్యాపారులకు కేంద్రం ప్రభుత్వం రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు రుణాలు ఇస్తుంది. రుణాలను సకాలంలో చెల్లిస్తే వడ్డీపై 7 శాతం సబ్సిడీ ఇస్తారు. అలాగే డిజిటల్ లావాదేవీలపై రూ.1200 వరకు క్యాష్ బ్యాక్ ఇస్తారు.
PM Svanidhi Scheme : వీధి వ్యాపారుల(స్ట్రీట్ వెండర్స్)కు రుణాలు అందించడమే లక్ష్యంగా కేంద్రం ప్రభుత్వం పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి(PM SVANIDHI) పథకాన్ని ప్రారంభించింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సుమారు 50 లక్షల మంది వీధి వ్యాపారులకు ఒక ఏడాదిలో రూ.10,000 వరకు పెట్టుబడి రుణాలు అందించేందుకు పీఎం స్వనిధి కార్యక్రమాన్ని అమలు చేస్తుంది. ఈ పథకాన్ని జూన్ 1, 2020న కోవిడ్-19 మహమ్మారి సమయంలో ప్రారంభించారు. కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మైక్రో క్రెడిట్ స్కీమ్ ను కేంద్రం ప్రవేశపెట్టింది.
ఈ పథకం కోసం ఆన్ లైన్ లో అప్లై దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు వారి అప్లికేషన్ స్థితిని ఆధార్ ఆధారిత e-KYC ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే దరఖాస్తుదారులకు ఎస్ఎంఎస్ ద్వారా దరఖాస్తు స్టేటస్ తెలియజేస్తారు. ఈ పథకంలో మూడు విడతలుగా రుణాలను అందిస్తారు. మొదటి విడత రూ. 10,000, మొదటి విడత రుణం పూర్తిగా చెల్లించిన వారికి రెండో విడతలో రూ. 20,000, రెండో విడత రుణం చెల్లించిన వారికి మూడో విడతలో రూ. 50,000 రుణాలు అందిస్తారు.
పీఎం స్వనిధి వెబ్‌సైట్ ప్రకారం మే 3, 2024 నాటికి మొదటి విడతగా 69.06 లక్షలు, రెండో విడతగా 22.91 లక్షలు, మూడో విడతలో 4.79 లక్షల మందికి రుణాలు మంజూరు అయ్యాయి. వీధి వ్యాపారులు ఈ పథకం కింద రుణాలకు నేరుగా PM SVANidhi పోర్టల్‌లో లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు .
పీఎం స్వనిధి పథకం- సక్రమంగా చెల్లిస్తే 7 శాతం వడ్డీ రాయితీ
ఈ పథకం ద్వారా వీధి వ్యాపారులకు వర్కింగ్ క్యాపిటల్ లోన్‌లను అందించడం వల్ల వారి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని కేంద్రం భావిస్తుంది. ఈ రుణాన్ని సక్రమంగా తిరిగి చెల్లిస్తే, సంవత్సరానికి 7% వడ్డీ రాయితీ అందిస్తారు. నిర్థిష్ట డిజిటల్ లావాదేవీలు చేపట్టే వారికి ఏడాదికి రూ.1200 వరకు క్యాష్‌బ్యాక్‌కు అర్హులు. ఈ స్కీమ్ దరఖాస్తుకు ముందుగా దరఖాస్తుకు అవసరమైన వివరాలు, ఆధార్‌తో మొబైల్ నంబర్ లింక్, పథకం నిబంధనల ప్రకారం అర్హత స్థితిని తనిఖీ చేయండి.
అర్హతలు, అవసరమయ్యే పత్రాలు
పట్టణ స్థానిక సంస్థలు(యూఎల్బీ) జారీ చేసే గుర్తింపు కార్డు లేదా విక్రయాల ధృవీకరణ పత్రాలు కలిగి ఉన్న వీధి వ్యాపారులు
వెండింగ్ సర్టిఫికేట్ లేదా గుర్తింపు కార్డు లేని వారు ఐటీ ఆధారిత ప్లాట్‌ఫారమ్ ద్వారా తాత్కాలిక విక్రయ ధృవీకరణ పత్రాన్ని పొందవచ్చు
టౌన్ వెండింగ్ కమిటీ(టీవీసీ) లేదా పట్టణ స్థానిక సంస్థల లెటర్ ఆఫ్ రికమండేషన్ ను కలిగి ఉన్న వీధి వ్యాపారులు
ఈ పథకం కోసం దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ, యుటిలిటీ బిల్లు, వెండర్ లైసెన్సింగ్ లేదా రిజిస్ట్రేషన్ పత్రాలు ఉండాలి.
పీఎం స్వనిధి పథకం దరఖాస్తు విధానం
-దరఖాస్తుదారుడి మొబైల్ నంబర్‌ను ఆధార్ కార్డ్‌కి లింక్ చేయాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియలో కేవైసీ ధ్రువీకరణకు ఇది అవసరం. ఇది స్థానిక సంస్థల నుంచి గుర్తింపు కార్డు పొందడానికి కూడా సహాయపడుతుంది.
-విక్రేతలను నాలుగు కేటగిరీలుగా వర్గీకరిస్తారు.
-విక్రేత అర్బన్ లోకల్ బాడీ సర్వేలో చేర్చినవారు, టీవీసీ/యూఎల్బీ గుర్తింపు కార్డు లేదా విక్రయ ధృవీకరణ పత్రాన్ని ఉన్నవారు.
-విక్రేత యూఎల్బీ సర్వే జాబితా ఉన్నారు, కానీ టీవీసీ లేదా యూఎల్బీ గుర్తింపు కార్డు లేదా వెండింగ్ సర్టిఫికేట్ లేదు.
-సర్వే పూర్తైన తర్వాత విక్రయించడం ప్రారంభించిన వీధి వ్యాపారులు లేదా యూఎల్బీ గుర్తింపు సర్వేలో లేనివారు. ఈ విక్రేతలను రెండుగా వర్గీకరిస్తారు.
1. యూఎల్బీ/టీవీసీ ద్వారా విక్రేతకు లెటర్ ఆఫ్ రికమండేషన్ జారీ చేశారు.
2. విక్రేతకు ఎటువంటి లెటర్ ఆఫ్ రికమండేషన్ జారీ చేయలేదు.
పీఎం స్వనిధి లోన్ ఎలా అప్లై చేయాలి?
- దరఖాస్తుదారులు PM SVANIdhi పోర్టల్ https://pmsvanidhi.mohua.gov.in/ పై క్లిక్ చేయండి.
- మీ మొబైల్ నంబర్‌ని ఉపయోగించి లాగిన్ అయితే ఓటీపీ వస్తుంది.
- లాగిన్ తర్వాత విక్రేత గుర్తింపు కార్డు లేదా వెండింగ్ సర్టిఫికేట్ లేదా లేదా టీవీసీ సిఫార్సు లేఖ ద్వారా మీ అర్హత ప్రమాణాలను ఎంచుకోండి.
- పీఎం స్వనిధి పథకం దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయండి. అవసరమైన అన్ని కేవైసీ పత్రాలను జత చేయండి.
- మీ దరఖాస్తును సబ్మిట్ చేయండి. అనంతరం రుణ సంస్థలు మిమ్మల్ని సంప్రదిస్తాయి.
- మీ పత్రాలను ధృవీకరించిన తర్వాత దరఖాస్తు చేసిన 30 రోజులలోపు వీధి వ్యాపారుల బ్యాంక్ ఖాతాలో లోన్ మొత్తం చేస్తారు.
సంబంధిత కథనం