DSC 1998 : టీచర్ కాబోయి ఎమ్మెల్యే అయ్యారు… డిఎస్సీ 98 అర్హుల్లో ఎమ్మెల్యే
పాతికేళ్ల క్రితం పరీక్షల్లో పాసైనా పోస్టింగులు దక్కక రకరకాల సమస్యలతో సతమతమైన ఉద్యోగార్ధుల జాబితాలో వైసీపీ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. కాకుంటే అది ఎమ్మెల్యేగా ఎన్నికవ్వడానికి ముందు సంగతి… డిఎస్సీ 98 అర్హులకు ఎట్టకేలకు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఆ జాబితాలో ఎమ్మెల్యే కూడా ఉన్నట్లు వెలుగు చూసింది.
డాక్టర్ కాబోయి యాక్టర్ అయిన వాళ్ల కథలు వినే ఉంటాం… కానీ ఉపాధ్యాయుడి అవ్వాలనుకుని, పరీక్షలో పాసైనా, పోస్టింగ్ దక్కక రాజకీయాల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యే అయిపోయారు కరణం ధర్మశ్రీ. ఉద్యోగ వేటలో డిఎస్సీలో ఎంపికైనా రకరకాల కారణాలతో అది నెరవేరకపోవడంతో రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకుని సక్సెస్ అయ్యారు. ఇన్నేళ్ల తర్వాత డిఎస్సీ 1998 అభ్యర్ధులకు మినిమం టైమ్ స్కేల్ వేతనాలతో ఉద్యోగాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడంపై టీచర్ కాబోయి ఎమ్మెల్యే అయిన ధర్మశ్రీ హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఎప్పుడో 24 క్రితం జరిగిన డిఎస్సీ పరీక్షల్లో అర్హత సాధించినా ఉద్యోగాలు దక్కక ఇబ్బందులు పడిన అభ్యర్థుల జాబితాలో విశాఖ ఎమ్మెల్యే కూడా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలనుకున్న ఆయన చివరికి ప్రజా ప్రతినిధి అయ్యారు. అనకాపల్లి జిల్లా చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా 1998 డిఎస్సీలో ఎంపికయ్యారు. దాదాపు పాతికేళ్ల క్రితం, రాజకీయాల్లోకి ప్రవేశించక ముందు ధర్మశ్రీ లక్ష్యం కూడా ప్రభుత్వోద్యోగంలో స్థిరపడటమే… డిఎస్సీలో ఎంపికవడంతో ఇక ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా చేరడమే ఆలశ్యం అనుకున్నారు. అయితే ఆ పరీక్షల్లో అర్హత సాధించినా ఉద్యోగ నియమకాలు మాత్రం జరగలేదు. 30ఏళ్ల వయసులో అన్నామలై యూనివర్శిటీ నుంచి బిఇడి పూర్తి చేసి ఉపాధ్యాయుడిగా స్థిరపడాలని భావించినా అది నెరవేరలేదని ఎమ్మెల్యే చెప్పారు.
1998 డిఎస్సీలో అర్హత సాధించినా నియామకాలు పెండింగ్‌లో పడటంతో బీఎల్ చదివానని ఆ సమయంలోనే కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో క్రియాశీలకంగా వ్యవహరించడంతో రాజకీయాల్లో ప్రవేశించినట్లు ధర్మశ్రీ చెప్పారు. 25ఏళ్లలో రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యానని, వైఎస్సార్ అనుచుడిగా కాంగ్రెస్ పార్టీలో మొదలైన ప్రస్థానం వైసీపీలో ఎమ్మెల్యేగా చేరిందన్నారు. డిఎస్సీ 98లో ఉద్యోగం వస్తే తన జీవితం మరోలా ఉండేదని రాజకీయాల్లోకి ఖచ్చితంగా ప్రవేశించే వాడిని కాదన్నారు. ఉపాధ్యాయ వృత్తికే ప్రాధాన్యం ఇచ్చే వాడినని ఎమ్మెల్యే చెప్పారు. ముఖ్యమంత్రి చొరవతో ఇన్నేళ్ల తర్వాత సమస్య పరిష్కారం కావడంపై హర్షం వ్యక్తం చేశారు. 1998డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల తరపున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు చెప్పారు.
టాపిక్