Visakha MRO Murder : విశాఖ ఎమ్మార్వో హత్య కేసు, నిందితుడు ఫ్లైట్ లో పరారీ- సంచనాలు వెలుగులోకి!
Visakha MRO Murder : విశాఖలో తహసీల్దార్ రమణయ్య హత్య కేసులో నిందితుడిని గుర్తించినట్లు సీపీ రవి శంకర్ తెలిపారు. హత్య అనంతరం నిందితుడు ఫ్లైట్ లో పరారైనట్లు తెలిసిందన్నారు. రియల్ ఎస్టేట్, భూవివాదాలే హత్యకు కారణమన్నారు.
Visakha MRO Murder : విశాఖలో తహసీల్దార్ రమణయ్య దారుణ హత్య రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు... ఆరు గంటల్లోనే నిందితుడ్ని గుర్తించామన్నారు. ఈ కేసు వివరాలను విశాఖ సీపీ రవి శంకర్ మీడియాకు వివరించారు. శుక్రవారం రాత్రి పది గంటల సమయంలో నిందితుడు ఇనుప రాడ్డుతో ఎమ్మార్వో రమణయ్యపై దాడి చేశాడని సీపీ రవి శంకర్ అన్నారు. ఎమ్మార్వోను హత్య చేసిన దుండగుడు ఫ్లైట్ ఎక్కి పరారైనట్లు గుర్తించామన్నారు. టికెట్ బుక్ చేసిన ఆధారాలు కూడా లభించాయన్నారు. ఈ కేసును ఛేదించడానికి పది బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
చాలా సార్లు ఆఫీస్ కు
ఎమ్మార్వో రమణయ్య హత్య కేసు నిందితుడిపై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా? అనేది పరిశీలిస్తున్నామని సీపీ రవి శంకర్ అన్నారు. నిందితుడు చాలాసార్లు ఎమ్మార్వో రమణయ్య ఆఫీస్‌కు వచ్చిన వెళ్లినట్లు తేలిందన్నారు. నిందితుడు మరింత దూరం పారిపోతాడనే కారణంతోనే అతడిని వివరాలను చెప్పట్లేదన్నారు.
త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామన్నారు. కొమ్మాదిలోని చరణ్ క్యాస్టల్ అపార్ట్‌మెంట్‌లో ఎమ్మార్వోపై హత్య జరిగిందన్నారు. ఘటన సమాచారం అందగానే పోలీసులు స్పాట్ కు వెళ్లారన్నారు. రమణయ్యతో దుండగుడు ముందు ఘర్షణ పడ్డాడని ఆ తర్వాతే ఐరన్ రాడ్‌తో దాడి చేసి చంపాడన్నారు. రియల్ ఎస్టేట్, భూవివాదాలే ఎమ్మార్వో హత్యకు కారణం కావొచ్చన్నారు.
అధికారుల ప్రాణాలకు రక్షణ లేదు- లోకేశ్
విశాఖలో ఎమ్మార్వో రమణయ్య హత్య ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శలు చేశారు. విశాఖ జిల్లాలో వైసీపీ భూ అక్రమాలకు సహకరించలేదని ఆ పార్టీ నేతలే తహసీల్దార్ సనపల రమణయ్యని అత్యంత దారుణంగా హత్య చేశారని లోకేశ్ ఆరోపించారు. సీఎం జగన్ పాలనలో ప్రభుత్వ అధికారుల ప్రాణాలకు రక్షణలేదని తేలిపోయిందన్నారు. బాపట్ల జిల్లా చావలి గ్రామ ఆర్బీకేలో వ్యవసాయ సహాయకురాలిగా పనిచేస్తున్న పూజిత ఆత్మహత్యకు కారణం వైసీపీ నేతలు ఎరువులు ఎత్తికెళ్లిపోవడమే అన్నారు. బంగారు భవిష్యత్తు ఉన్న ఒక యువతిని బలిగొన్నది వైసీపీ నాయకులే అని ఆరోపించారు. విజయనగరం జిల్లా రాజాంలో పంచాయతీరాజ్ శాఖలో కాంట్రాక్ట్ బేసిక్ పనిచేస్తున్న జేఈ వల్లూరు రామకృష్ణని మాయచేసి వైసీపీ నేతలు సిమెంటు ఎత్తుకెళ్లారన్నారు. ఉన్నతాధికారులు సిమెంటు లెక్క చెప్పమంటూ ఒత్తిళ్లు, వైసీపీ నేతలు దిక్కున్నచోట చెప్పుకోమని బెదిరించడంతో రామకృష్ణ పంచాయతీరాజ్ కార్యాలయంలోనే ఉరివేసుకుని తనువు చాలించారన్నారు. ఇది వైకాపా నేతలు చేసిన హత్య కాదా? తప్పులు చేసిన వైసీపీ నేతలు కాలరెగరేసుకుని తిరుగుతుంటే..ఏ తప్పూ చేయని ఉద్యోగులెందుకు ఆత్మహత్యలకు పాల్పడాలి? త్వరలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రభుత్వ ఉద్యోగులను వేధించిన వైసీపీ నాయకుల్ని కఠినంగా శిక్షిస్తామన్నారు.
అధికార పార్టీ నేతల హస్తం- టీడీపీ
రాష్ట్రంలో సామాన్య ప్రజలకే కాదు, ఉన్నతాధికారులకి కూడా రక్షణ లేకుండా పోతుందని టీడీపీ ఆరోపించింది. విశాఖ రూరల్ తహసీల్దార్ సనపల రమణయ్య దారుణ హత్యకి గురయ్యారు. ఆయన ఇటీవలే విజయనగరం జిల్లాలోని బంటుపల్లికి బదిలీ అయ్యారు. కొన్ని ఫైల్స్ పై సంతకం చేయలేదనే కక్షతోనే కొంత మంది అధికార పార్టీ నేతలు కక్ష కట్టి, ఆయనపై ఇంటి దగ్గరే ఇనుప రాడ్డుతో దాడి చేసి కొట్టి చంపారని టీడీపీ ఆరోపిస్తుంది. తమకు అనుకూలంగా పని చేయకపోతే, బదిలీలు మాత్రమే కాదు, లేపేస్తాం అంటూ వైసీపీ నేతలు బరి తెగిస్తున్నారని టీడీపీ విమర్శలు చేస్తుంది.
సంబంధిత కథనం