Visakhapatnam Crime : విశాఖలో మందుబాబు హల్ చల్, నచ్చిన బ్రాండ్ ఇవ్వలేదని మద్యం షాపునకు నిప్పు!
Visakhapatnam Crime : తాను కోరిన మద్యం బ్రాండ్ ఇవ్వలేదని ఓ మందుబాబు వీరంగం సృష్టించాడు. ఏకంగా మద్యం షాపునకు నిప్పుపెట్టాడు.
Visakhapatnam Crime : చుక్క లోపల పడితేనే మందుబాబులకు అసలు పండుగ. అయితే విశాఖ ఓ మందుబాబు మద్యం కోసం హల్ చల్ చేశాడు. తనకు నచ్చిన బ్రాండ్ ఇవ్వలేదని మద్యం దుకాణానికి నిప్పుపెట్టాడు. విశాఖపట్నం జిల్లా మధురవాడ కొమ్మాది మద్యం దుకాణం వద్ద మందుబాబు వీరంగం సృష్టించాడు. తనకు నచ్చిన బ్రాండ్ ఇవ్వలేదని మద్యం దుకాణంలో పెట్రోల్ పోసి నిప్పుపెట్టాడు. ఈ ఘటనలో సుమారు 15 మద్యం కేసులు, ప్రింటర్, కంప్యూటర్ కాలిపోయాయి.
కోరిన బ్రాండ్ ఇవ్వలేదని
మధురవాడ కొమ్మాది ప్రభుత్వ మద్యం షాపు వద్దకు మద్యం కోసం ఓ వ్యక్తి వచ్చాడు. ఓ బ్రాండ్ పేరు చెప్పి ఆ మద్యం కావాలన్నాడు. అయితే ఈ బ్రాండ్ మద్యం ఇక్కడ దొరకదని సిబ్బంది చెప్పారు. అయితే తనకు ఆ బ్రాండ్ కావాల్సిందేనని సిబ్బందితో గొడవపడ్డాడు. అక్కడి వారు ఎంత వారించిన వినలేదు. కోపంతో తన బండిలోని పెట్రోల్ తీసి మద్యం దుకాణంపై పోసి నిప్పుపెట్టాడు. దీంతో మద్యం షాపు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మద్యం లారీ బోల్తా, ఎగబడ్డ మందుబాబులు
రోడ్డుపై ఏదైనా వాహనం బోల్తా పడితే... ఎవరైనా గాయపడ్డారా? అని వారికి సాయం అందిస్తారు. సరుకు రవాణా వాహనాలు బోల్తా పడితే మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంటుంది. విశాఖలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. అసలే దీపావళి పండుగ... వరుసగా సెలవులు ఇంతకంటే మంచి తరుణం ఉండదు మద్యం ప్రియులకు. మందు చుక్క, చికెన్ ముక్కతో పండుగ కానిచ్చేందాం అని ప్లాన్ చేసుకుంటారు మందుబాబులు. అయితే విశాఖలో జరిగిన ఓ ఘటన మందుబాబులకు కలిసొచ్చింది. విశాఖలోని మధురవాడ కొమ్మది వద్ద శనివారం మద్యం లారీ బోల్తా పడింది. దీంతో ఉచిత మద్యం కోసం మందుబాబులు, స్థానికులు ఎగబడ్డారు. లారీ బోల్తా పడడంతో అందులోని మద్యం సీసాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయాయి. ఇది గమనించిన స్థానికులు మందు, బీరు బాటిల్స్ కోసం పోటీ పడ్డారు.
మధురవాడ కొమ్మది వద్ద మద్యం లోడుతో వెళ్తోన్న ఓ లారీ బోల్తా పడింది. దీంతో లారీలో ఉన్న మద్యం సీసాల బాక్సులు రోడ్డుపై చెల్లా చెదురుగా పడ్డాయి. మద్యం లారీ బోల్తా కొట్టడడం గమనించిన స్థానికులు, అటుగా వెళ్తున్న వాహనదారులు... రోడ్డుపై పడిన మద్యం బాటిల్స్ ను అందిన కాడికి ఎత్తుకెళ్లారు. కొందరు మద్యం బాక్సులను సైతం పట్టుకెళ్లారు. లారీ డ్రైవర్ గాయపడ్డడా, అతనికి సాయం చేయాలనే ఆలోచన చేయని మందుబాబులు... ఉచితంగా మందు దొరుకుతుందని ఎగబడ్డారు. అయితే లారీ బోల్తా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి వచ్చే లోపు లోడు ఖాళీ చేశారు. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కు స్వల్పగాయాలయ్యాయి.