YS Sharmila : వైఎస్ షర్మిల కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు, ప్రభుత్వానికి భయంపట్టుకుందన్న కాంగ్రెస్ నేతలు-vijayawada news in telugu police diverted ys sharmila convoy congress leaders stage protest ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ys Sharmila : వైఎస్ షర్మిల కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు, ప్రభుత్వానికి భయంపట్టుకుందన్న కాంగ్రెస్ నేతలు

YS Sharmila : వైఎస్ షర్మిల కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు, ప్రభుత్వానికి భయంపట్టుకుందన్న కాంగ్రెస్ నేతలు

Bandaru Satyaprasad HT Telugu
Jan 21, 2024 02:19 PM IST

YS Sharmila : ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల ఇవాళ బాధ్యతలు స్వీకరిస్తున్నారు. అయితే కడప నుంచి గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న షర్మిల భారీ కాన్వాయ్ తో ఏపీ కాంగ్రెస్ కార్యాలయానికి బయలుదేరగా, ఎనికేపాటు వద్ద కాన్వాయ్ పోలీసులు అడ్డుకున్నారు.

వైఎస్ షర్మిల
వైఎస్ షర్మిల

YS Sharmila : ఏపీలో అన్న చెల్లి మధ్య పొలిటికల్ వార్ మొదలైనట్లు కనిపిస్తుంది. వైఎస్ షర్మిల ఇవాళ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె కడప నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్ పోర్టులో షర్మిలకు కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. అక్కడి నుంచి షర్మిల భారీ కాన్వాయ్ తో ఏపీ కాంగ్రెస్ కార్యాలయం అయిన ఆంధ్రరత్న భవన్ కు బయలుదేరారు. మార్గమధ్యలో ఎనికేపాటు వద్ద షర్మిల కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. అక్కడి నుంచి వేరే మార్గంలో వెళ్లాలని వాహనాలను మళ్లించారు. అన్ని అనుమతులు తీసుకుని వెళ్తుంటే అడ్డుకోవడం ఏంటిని కాంగ్రెస్ శ్రేణులు పోలీసులను ప్రశ్నించారు. వాహనాలను దారిమళ్లించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ నేతలు రోడ్డుపై బైఠాయించారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్ని వాహనాలను అనుమతిస్తేనే అక్కడి నుంచి వెళ్తానని చెప్పడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ శ్రేణుల ఆందోళనతో దిగివచ్చిన పోలీసులు... షర్మిల కాన్వాయ్ కు అనుమతి ఇచ్చారు. రాజన్న బిడ్డ ఎవరికీ భయపడదని షర్మిల అన్నారు. అనుమతి తీసుకుని వెళ్తుంటే అడ్డుకోవాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. భయపడతున్నారా సార్ అంటూ పోలీసులను అడిగారు.

yearly horoscope entry point

పోలీసులపై ఆగ్రహం

మాజీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పోలీసుల తీరును తప్పుబట్టారు. పోలీసులు కావాలనే షర్మిలను అడ్డుకున్నారన్నారు. తాము ముందే రూట్ మ్యాప్ పోలీసులకు అందించామని, అనుమతి కూడా ఇచ్చారన్నారు. అయినా ఉద్దేశపూర్వకంగా పోలీసులు వాహనాలను అడ్డుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు వైసీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందన్నారు. షర్మిల కాన్వాయ్ కు అనుమతి ఇవ్వకపోతే విజయవాడ బంద్ చేస్తామని గిడుగు రుద్రరాజు హెచ్చరించారు.

ఛాంబర్ సిద్ధం

వైఎస్ షర్మిల ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా ఇవాళ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే ఏపీ కాంగ్రెస్ ఆఫీసులో ఛాంబర్ సిద్ధం చేశారు. ఛాంబర్ వద్ద నేమ్ బోర్డు ఏర్పాటు చేశారు. అంతకు ముందు ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. "నాన్నకు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ప్రాణంతో సమానం. అందుకే ఆయన ఆశయాల కోసమే కాంగ్రెస్ లో చేరాను. నాన్న చివరి కోరిక రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం. అందుకు నా శాయశక్తులా కృషి చేస్తాను . చివరి వరకు వైఎస్ఆర్ సిద్ధాంతాల కోసం నిలబడతా. ప్రస్తుత పరిస్థితుల్లో సెక్యూలరిజం, ఫ్లూరలిజం అనే పదాలకు అర్ధం, రాజ్యాంగానికి గౌరవం లేకుండా పోయింది. ఇవన్నీ మళ్ళీ నెలకొల్పి దేశానికీ మంచి జరగాలి అంటే అది కాంగ్రెస్ తోనే సాధ్యం” అని షర్మిల ట్వీట్ చేశారు.

ఏదో కారణాలతో కాంగ్రెస్ వీడిన వాళ్లంతా వెనక్కి రావాలని, రాహుల్ గాంధీని ప్రధాని చెద్దామని ఏపీ కాంగ్రెస్ నేత రఘువీరా రెడ్డి అన్నారు. ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ ...ఎవరికి ఓటు వేసినా బీజేపీకి ఓటు వేయడమే అన్నారు. బీజేపీ వాళ్లను తరిమి కొట్టాలన్నారు. షర్మిల కాన్వాయ్ ను ప్రభుత్వం అడ్డుకుందని మండిపడ్డారు. కాంగ్రెస్ ను చూసి వైసీపీ ప్రభుత్వం భయపడుతోందన్నారు. ఎందుకు వాహనాలు అడ్డుకున్నారని ప్రశ్నించారు.

పోలీసులు ఏమన్నారంటే?

వైఎస్ షర్మిల కాన్వాయ్ ను అడ్డుకోవడంపై విజయవాడ సీపీ క్రాంతి రాణా స్పందించారు. కాన్వాయ్ ను అడ్డుకోలేదని, వెనుక వచ్చే వాహనాలను మాత్రమే దారిమళ్లించామన్నారు. ర్యాలీగా ముందు వచ్చిన బైక్స్ , షర్మిల వాహనాలను పంపించామన్నారు. కానీ వెనుకు వస్తున్న మరికొన్ని కార్లను వేరే మార్గంలో వెళ్లాలని సూచించామన్నారు.

Whats_app_banner