Chandrababu Bail : చంద్రబాబుకు బిగ్ రిలీఫ్, స్కిల్ కేసులో రెగ్యులర్ బెయిల్-vijayawada news in telugu ap high court grants bail to tdp chief chandrababu ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu Bail : చంద్రబాబుకు బిగ్ రిలీఫ్, స్కిల్ కేసులో రెగ్యులర్ బెయిల్

Chandrababu Bail : చంద్రబాబుకు బిగ్ రిలీఫ్, స్కిల్ కేసులో రెగ్యులర్ బెయిల్

Bandaru Satyaprasad HT Telugu
Nov 20, 2023 02:23 PM IST

Chandrababau Bail : స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

చంద్రబాబు
చంద్రబాబు (HT_PRINT)

Chandrababu Bail : టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏపీ హైకోర్టు చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు… తాజాగా తీర్పు ఇచ్చింది. స్కిల్ కేసులో ఇప్పటికే చంద్రబాబు మధ్యంతర బెయిల్ పై ఉన్నారు. ఈ నెల 28న చంద్రబాబు రాజమండ్రి జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని హైకోర్టు తెలిపింది. అయితే ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించింది.

స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబును ఏపీ సీఐడీ సెప్టెంబర్ 9న నంద్యాలలో అరెస్టు చేసింది. అనంతరం విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు ప్రవేశపెట్టగా కోర్టు రిమాండ్ విధించింది. దీంతో చంద్రబాబు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆరోగ్య కారణాలతో ఇటీవల హైకోర్టు ఆయనకు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

వాదనలు ఇలా

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో చంద్రబాబు బెయిల్‌ పిటిషన్‌పై వాదనలు ఈ నెల 17న ముగిశాయి. దీంతో తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. చంద్రబాబు తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, దమ్మాలపాటి శ్రీనివాస్‌, ఏపీ సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఈ కేసులో హైకోర్టు సోమవారం బెయిల్‌ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

చంద్రబాబు తరపున సిద్ధార్థ్ లూద్రా వాదనలు వినిపిస్తూ…. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కావాలనే చంద్రబాబును అరెస్టు చేశారని అన్నారు. ఈ కేసులో 2018 నుంచి విచారణ జరుగుతుంటే.. ఇప్పుడు ఇంత హడావుడిగా విచారణ చేయాల్సిన అవసరం ఏముందని ప్రస్తావించారు. చంద్రబాబును ఇరికించడం కోసమే ఇదంతా చేశారని అన్నారు. చంద్రబాబుకు వెంటనే బెయిల్ ఇవ్వాలని కోరారు.

సీఐడీ వాదనలు

సీఐడీ తరపున హైకోర్టులో ఏఏజీ పొన్నవోలు వాదనలు వినిపించారు. చంద్రబాబు పలు అవినీతి కేసుల్లో ముద్దాయిగా ఉన్నారని… చంద్రబాబుకు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదన్నారు. చట్టం ముందు అందరూ సమానులే అన్న పొన్నవోలు…. ఈ కేసు తీర్పు ద్వారా సమాజానికి ఒక మెసేజ్ వెళ్లాలని వాదించారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని… చంద్రబాబు సాక్షులను ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు. చిన్నప్ప అనే వ్యక్తి ద్వారా మూడు 10 రూపాయల నోట్లు ఉపయోగించి హవాలా ద్వారా కోట్ల రూపాయలు హైదరాబాద్‌కు తరలించారని…. బోస్‌ అనే వ్యక్తి ఫోన్‌ మెస్సేజ్‌ల ద్వారా ఈ విషయం బయటపడిందని వివరించారు. సీమెన్స్‌ వారే నిధులు మళ్లింపు జరిగిందని నిర్థారించారని… చంద్రబాబు ఆదేశాల మేరకే ఆ విధంగా వ్యవహరించారని చెప్పారు. చీఫ్‌ సెక్రటరీ తన లెటర్‌లో అప్పటి సీఎం రూ.270 కోట్లు విడుదల చేయమని చెప్పారని ఫైనాన్స్‌ సెక్రటరీకి లేఖ రాశారని వాదించారు. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబుకు బెయిల్ ఇవ్వొద్దని కోరారు. అయితే ఈ కేసులో హైకోర్టు చంద్రబాబు బెయిల్ మంజూరు చేసింది.

IPL_Entry_Point