Teachers CPS Protest : సీపీఎస్, జీపీఎస్ రద్దు చేయాల్సిందే-విజయవాడలో ఉపాధ్యాయుల ధర్నా-vijayawada aptf teachers protest on cps gps cancellation demands salaries on first day of every month ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Teachers Cps Protest : సీపీఎస్, జీపీఎస్ రద్దు చేయాల్సిందే-విజయవాడలో ఉపాధ్యాయుల ధర్నా

Teachers CPS Protest : సీపీఎస్, జీపీఎస్ రద్దు చేయాల్సిందే-విజయవాడలో ఉపాధ్యాయుల ధర్నా

Bandaru Satyaprasad HT Telugu
Oct 29, 2023 03:17 PM IST

Teachers CPS Protest : జీపీఎస్ మోసపూరిత విధానమని ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో టీచర్లు ధర్నాకు దిగారు. జీపీఎస్ పై ఏపీ ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు.

ఉపాధ్యాయుల ఆందోళన
ఉపాధ్యాయుల ఆందోళన

Teachers CPS Protest : సీపీఎస్ రద్దు చేస్తామని మోసం చేసి జీపీఎస్ అనే మరో మోసపూరిత విధానాన్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చిందని ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో టీచర్లు ధర్నా చేపట్టారు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. పాదయాత్ర సమయంలో సీపీఎస్ రద్దు చేస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చి, ఇప్పుడు మాట తప్పడం తగదని ఉపాధ్యాయులు అంటున్నారు. సీపీఎస్‌ను రద్దు చేయకుండా జీపీఎస్‌ తీసుకురావడం సరికాదని ఏపీటీఎఫ్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు, పెన్షన్లు ఇవ్వాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు. సీపీఎస్ రద్దు చేసే వరకూ తమ పోరాటం కొనసాగిస్తామన్నారు. ఉద్యమం ద్వారానే ఓపీఎస్ విధానాన్ని సాధించుకుంటామన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని కోరారు. అన్ని జిల్లాల నుంచి పెద్ద ఎత్తున టీచర్లు విజయవాడకు చేరుకుని ధర్నాలో పాల్గొన్నారు.

yearly horoscope entry point

జీపీఎస్ పై గెజిట్ నోటిఫికేషన్

సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు చేయాలని ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే సీపీఎస్ రద్దు అసాధ్యమని తేల్చిచెప్పిన ప్రభుత్వం... ఓపీఎస్ స్థానంలో జీపీఎస్(గ్యారంటీడ్ పింఛన్ స్కీమ్) రూపొందించింది. జీపీఎస్ బిల్లును అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం ఆమోదించింది. అనంతరం ఈ బిల్లుకు గవర్నర్ ఆమోదం తెలపడంతో.. జీపీఎస్ అమల్లోకి వచ్చినట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జీపీఎస్ పై ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. జీపీఎస్ ద్వారా మూలవేతనంలో 50 శాతం మేర పింఛన్ చెల్లించేలా టాప్‌ అప్‌ మొత్తాన్ని కలుపుతామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. దీంతో పాటు యాన్యూటీ మొత్తం తగ్గితే కనీస పింఛన్ రూ.10 వేలు చెల్లించేలా టాప్‌ అప్‌ కలిపి మొత్తం చెల్లిస్తామని బిల్లులో పేర్కొంది. దీంతో పాటు డీఆర్‌ కూడా ప్రకటించింది. 60 శాతం ఇచ్చే స్పౌజ్‌ పింఛన్ తగ్గిన మొత్తాన్ని భర్తీచేస్తామని ప్రభుత్వం జీపీఎస్ లో స్పష్టంచేసింది. అయితే జీపీఎస్‌ ద్వారా ఉద్యోగుల ప్రయోజనాలు పొందేందుకు పదవీ విరమణ చేస్తే కనీసం పదేళ్ల సర్వీస్ చేసి ఉండాలనే నిబంధన ఉంది. ఒకవేళ స్వచ్ఛందంగా పదవీ విరమణ చేస్తే కనీసం 20 ఏళ్ల సర్వీసు ఉండాలని పేర్కొంది.

యూనిఫాం వేసుకోలేదని సచివాలయ ఉద్యోగులకు మోమోలు

ఏపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమల్లోకి తెచ్చిన గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు యూనిఫాం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. అయితే సాధారణ దుస్తులతో వస్తున్న ఉద్యోగులకు పై అధికారులు షోకాజ్‌ నోటీసులిస్తున్నారు. యూనిఫాం వేసుకోలేదన్న కారణంతో ఐదుగురు కార్యదర్శులకు కృష్ణా జిల్లా కంకిపాడు ఎంపీడీవో రెండ్రోజుల క్రితం మోమోలు జారీ చేశారు. మూడు రోజుల్లో వివరణ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో హెచ్చరించారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగులకు 2021లో రాష్ట్ర ప్రభుత్వం ఏకరూప దుస్తులు అందించింది. ఒక్కో ఉద్యోగికి మూడు జతలకు సరిపడా మెటీరియల్‌ ఇచ్చింది. అనంతరం రెండేళ్లుగా దుస్తులు సరఫరా చేయలేదు. పాత దుస్తులు చాలా వరకు పాడైన కారణంగా కొందరు ఉద్యోగులు సాధారణ దుస్తులతో విధులకు వస్తున్నారు. ఇలా సాధారణ దుస్తులతో వచ్చిన వారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నూతన ఏకరూప దుస్తులు ఇవ్వకుండా మోమోలు జారీ చేయడంపై ఉద్యోగులు అసహనంతో ఉన్నారు.

Whats_app_banner