Polavaram : కాంట్రాక్ట‌ర్ల‌ను మార్చ‌డంతోనే పోలవరం పనుల్లో జాప్యం - లోక్‌సభలో కేంద్ర జల్ శక్తి మంత్రి ప్రకటన-union minister of jal shakti cr patil key announcement on polavaram prohect in loksabha ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Polavaram : కాంట్రాక్ట‌ర్ల‌ను మార్చ‌డంతోనే పోలవరం పనుల్లో జాప్యం - లోక్‌సభలో కేంద్ర జల్ శక్తి మంత్రి ప్రకటన

Polavaram : కాంట్రాక్ట‌ర్ల‌ను మార్చ‌డంతోనే పోలవరం పనుల్లో జాప్యం - లోక్‌సభలో కేంద్ర జల్ శక్తి మంత్రి ప్రకటన

HT Telugu Desk HT Telugu
Jul 25, 2024 09:13 PM IST

Union Jal Shakti Minister CR Patil On Polavaram : పోల‌వ‌రంపై లోక్ సభలో కేంద్రమంత్రి కీలక ప్రకటన చేశారు. కాంట్రాక్ట‌ర్ల‌ను మార్చ‌డంతోనే పోల‌వ‌రం పనుల్లో జాప్యం జరిగిందన్నారు. ఆర్అండ్ఆర్ కేవ‌లం 8 శాత‌మే జరిగిందని...2026 మార్చికి తొలిద‌శ పూర్తి అవుతుందని సభలో పేర్కొన్నారు.

పోల‌వ‌రంపై కేంద్రమంత్రి కీలక ప్రకటన
పోల‌వ‌రంపై కేంద్రమంత్రి కీలక ప్రకటన

పోల‌వ‌రం తొలిద‌శ పూర్తిపై కేంద్ర ప్ర‌భుత్వం స్ప‌ష్ట‌త ఇచ్చింది. కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి సీఆర్ పాటిల్ పోల‌వ‌రం గురించి పూర్తి వివ‌రాలు పార్ల‌మెంట్‌లో వెల్ల‌డించారు. కాంట్రాక్టర్ల‌ను మార్చ‌డం వ‌ల్ల‌నే పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణ జాప్యానికి కార‌ణ‌మ‌ని పేర్కొన్నారు. 2026 మార్చి నాటికి పోలవరం తొలి దశ (41.5 మీట‌ర్ల ఎత్తు) పనులు పూర్తి అవుతాయని తెలిపారు. లోక్‌స‌భ‌లో టీడీపీ ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవ‌రాయులు, జిఎం హ‌రీష్ బాల‌యోగి అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ స‌మాధానం ఇచ్చారు.

yearly horoscope entry point

ప్రాజెక్టు పనుల పరిశీలన, ఆలస్యానికి కారణలు తెలుసుకోవడానికి 2021 ఆగస్టులో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఐఐటీ హైదరాబాద్ నుంచి సహకారం తీసుకున్నామ‌న్నారు. 2021 న‌వంబ‌ర్‌లో ఐఐటీ హైద‌రాబాద్ రిపోర్టు స‌మ‌ర్పించింద‌ని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యానికి ప్ర‌ధాన కార‌ణాలుగా కాంట్రాక్ట‌ర్ల మార్పు, భూసేకరణ, పునరావాసం, ప‌రిహారం ఆల‌స్యం కావ‌డం, కోవిడ్ 19 మహమ్మారి, దాని సంబంధిత పరిస్థితులు గుర్తించామ‌ని కేంద్ర మంత్రి తెలిపారు. ప్ర‌స్తుతం ఈఎల్ 41.15 మీట‌ర్ల ఎత్తుతో మొద‌టి ద‌శ పోల‌వ‌రం ప్రాజెక్టు 2026 మార్చి నాటికి పూర్తి చేస్తామ‌ని వివరించారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలో పోల‌వ‌రం నీటిపారుద‌ల ప్రాజెక్టు (పీఐపీ) జాతీయ ప్రాజెక్టుగా ప్ర‌క‌టించిన‌ట్లు గుర్తు చేశారు. 2014 ఏప్రిల్ 1 నుంచి ప్రాజెక్టుకు అయ్యే ఖ‌ర్చు కేవ‌లం ఇరిగేష‌న్ కాంపొనెంట్ కింద వంద శాతం కేంద్ర‌మే భ‌రించేందుకు 2016లో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆమోదించింద‌ని తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణం నిర్వ‌హ‌ణ మాత్రం ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వమే చూసుకుంటుంద‌ని తెలిపిందని వివ‌రించారు.

మూడేళ్ళలో రూ. 8,044.31 కోట్లు ఇచ్చాం

గత మూడేళ్ళలో రూ. 8,044.31 కోట్లు కేంద్రం నుంచి ఇచ్చినట్లు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు. మూడేళ్ల పనుల పురోగతి వివరాలను కూడా సమాధానంలో పొందుపరిచారు. 2021-22 నుంచి మూడేళ్ళలో ప్రాజెక్టు ప్రధాన పనుల్లో 21 శాతం మట్టి పనులు, కాంక్రీటు పనులు కేవలం 5.3 శాతం జరిగాయని స్పష్టం చేశారు. కుడి కాలువకు లైనింగ్ పనులు 1.72 శాతం, స్ట్రక్చర్స్ 0.39 శాతం జరిగాయన్నారు. ఎడమ కాలువకు మట్టి పనులు 0.30 శాతం, లైనింగ్ 1.18 శాతం, స్ట్రక్చర్స్ 3.33 శాతం జరిగాయన్నారు. భూసేకరణ 0.22 శాతం, సహాయ పునరావాస కార్యక్రమం కేవ‌లం 8 శాతం జరిగిందని వివరాలను కేంద్ర మంత్రి వెల్లడించారు.

హెడ్‌వ‌ర్క్ ప‌నులు: 2021-22లో ఎర్త్ వ‌ర్క్ 10.20 శాతం, కాంక్రీటు 4.70 శాతం, 2022-23లో ఎర్త్ వ‌ర్క్ 2.42 శాతం, కాంక్రీటు 0.14 శాతం, 2023-24లో ఎర్త్ వ‌ర్క్ 7.82 శాతం, కాంక్రీటు 0.56 శాతం జ‌రిగాయ‌ని కేంద్రమంత్రి తెలిపారు.

కుడి ప్ర‌ధాన కాలువ ప‌నులు: 2021-22లో లైనింగ్‌ 4.70 శాతం, నిర్మాణాలు 0.39 శాతం, 2022-23లో లైనింగ్ 0.88 శాతం, 2023-24లో లైనింగ్ ప‌నులు ఏం జ‌రగ‌లేదు. అలాగే 2022-23, 2023-24ల్లో నిర్మాణాలు ప‌నులు జ‌ర‌గ‌లేదు. ఈ మూడేళ్లు ఎర్త్ వ‌ర్క్ ప‌నులు జ‌ర‌గ‌లేద‌ని పేర్కొన్నారు.

ఎడ‌మ‌ ప్ర‌ధాన కాలువ ప‌నులుః 2021-22లో ఎర్త్ వ‌ర్క్ 0.11 శాతం, లైనింగ్ 1.12 శాతం, నిర్మాణాలు 0.22 శాతం, 2022-23లో ఎర్త్ వ‌ర్క్ 0.13 శాతం, లైనింగ్ ప‌నులు ఏం జ‌ర‌గ‌లేదు, నిర్మాణాలు 2 శాతం, 2023-24లో ఎర్త్ వ‌ర్క్ 0.06 శాతం, లైనింగ్ 0.06 శాతం, నిర్మాణాలు 1.11 శాతం జ‌రిగాయ‌ని వివరించారు.

భూసేక‌ర‌ణః 2021-22లో 0.22 శాతం, 2022-23లో ఏం జ‌ర‌గ‌లేదు. 2023-24లో 0.004 శాతం జ‌రిగాయ‌ని తెలిపారు.

ప‌రిహారం, పున‌రావాసంః 2021-22లో 3.47 శాతం, 2022-23లో 3.50 శాతం, 2023-24లో 1.06 శాతం జ‌రిగాయ‌ని కేంద్రమంత్రి పేర్కొన్నారు. 

అయితే కేంద్ర మంత్రి పోల‌వ‌రం రెండో ద‌శ 45.72 ఎత్తు గురించి ఎక్కడా మాట్లాడ‌లేదు. 2023 ఆగ‌స్టు 3న అప్ప‌టి రాష్ట్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ మంత్రి అంబ‌టి రాంబాబు ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రిని క‌లిశారు. ఆ త‌రువాత ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ "పోల‌వ‌రం ప్రాజెక్టు రెండు ద‌శ‌ల్లో ఉంటుంద‌ని చెప్పారు."మొద‌టి ద‌శ 41.5 మీట‌ర్ల ఎత్తు, రెండో ద‌శ 45.72 ఎత్తు. అయితే మొద‌టి ద‌శ (41.5 మీట‌ర్లు)కు సంబంధించిన మొత్తం ప‌రిహారం, పున‌రావాసం (ఆర్ అండ్ ఆర్‌) పూర్తి చేసే దిశ‌గా ఉన్నాం. కేంద్ర ప్ర‌భుత్వం నిధులు ఇవ్వాల్సి ఉంది. కేంద్రం నుంచి రూ.12,911 కోట్లు విడుద‌ల అయితే అన్నీ పూర్తి అవుతాయి. రెండో ద‌శ‌కు సంబంధించిన పునరావాస‌, ప‌రిహార ప్యాకేజీ చాలా ఎక్కువ అవ‌స‌రం అవుతుంది. అది వ్య‌య స్థాయిలో ఉంది" అని అంబటి అన్నారు.

ఇటీవ‌లి రాష్ట్ర జ‌ల‌న‌రుల శాఖ మంత్రి నిమ్మ‌ల రామానాయుడు రెండు రోజుల ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రితో పాటు సెంట్ర‌ల్ వాట‌ర్ క‌మిష‌న్ (సీడబ్ల్యూసీ) చైర్మ‌న్‌ను క‌లిసి పోల‌వ‌రానికి రావాల్సిన రూ.12,157 వేల కోట్లు ఇవ్వాల‌ని కోరారు. అలాగే ఆర్అండ్ఆర్ ప్యాకేజీ నిధులు ఇవ్వాల‌ని కోరారు. 2019-24 మధ్య 2 శాతం మాత్రమే పోలవరం పనులు జరిగాయని, 20-30 శాతం పనులు వెనక్కి వెళ్లాయ‌ని విమ‌ర్శించారు. కొత్త డ‌యాఫ్రమ్ వాల్ నిర్మాణం, కొత్త టెండ‌ర్లు, ఎలా ముందుకు వెళ్లాలనేదానిపై చ‌ర్చించిన‌ట్లు తెలిపారు. న‌వంబ‌ర్ నుంచి ప‌నులు ప్రారంభిస్తామ‌ని, డిజైన్లు పూర్తి, ప్రాజెక్టు ప‌నులు పూర్తిపై దృష్టి సారించాల‌ని కోరిన‌ట్లు చెప్పారు.

రిపోర్టింగ్ - జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

Whats_app_banner