Undavalli Petition: స్కిల్ డెవలప్‌మెంట్ కేసు సిబిఐకు అప్పగించాలని ఉండవల్లి పిటిషన్
Undavalli Petition: ఏపీలో రాజకీయ దుమారం రేపుతోన్న స్కిల్ డెవలప్‌మెంట్ కేసును సిబిఐకు అప్పగించాలంటూ మాజీ ఉంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. చంద్రబాబుపై నమోదైన కేసు వ్యవహారంలో ఉండవల్లి హైకోర్టును ఆశ్రయించడంతో ఏమి జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది.
Undavalli Petition: టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై సీఐడీ నమోదు చేసిన స్కిల్ డెవల్‌పమెంట్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ హైకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఆర్థిక విషయాలతో ముడిపడిన ఈ కేసు పలు రాష్ట్రాలతో ముడిపడి ఉందని, ప్రముఖ వ్యక్తులు నిందితులుగా ఉండటం వల్ల దర్యాప్తును కేంద్ర సంస్థతో జరిపించాలని పిటిషన్‌లో ఉండవల్లి కోరారు.
కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ డైరెక్టర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సీఐడీ, ఏపీ స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్, గంటా సుబ్బారావు, కె.లక్ష్మీనారాయణ, నిమ్మగడ్డ వెంకటకృష్ణ ప్రసాద్, డిజైన్‌టెక్ సంస్థ, ఆ సంస్థ ఎండీ వికాస్ ఖన్వేల్కర్, స్కిల్లర్ ఎంటర్ ప్రైజెస్, సీమెన్స్ మాజీ ఎండీ సుమన్ బోస్, మాజీ సీఎం చంద్రబాబు, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు సహా 44మందిని తన పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటున్నారు. ఈ కేసులో ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం చంద్రబాబుకు 14 రోజుల రిమాండ్ విధించిందించిన సంగతి తెలిసిందే. చంద్రబాబు రిమాండ్ నేటితో ముగియనుంది.
ఈ సమయంలోనే స్కిల్ డెపలప్‌మెంట్ స్కాంపై మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు విచారణను సీబీఐకి ఇవ్వాలని పిల్ వేశారు. ఈ స్కాంపై సీబీఐ, ఈడీలతో విచారణ జరిపించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు.
ఉండవల్లి అరుణ్ కుమార్.. మార్గదర్శి చిట్ ఫండ్స్ వ్యవహారంపై కూడా న్యాయ పోరాటం చేస్తున్నారు. చిట్ ఫండ్స్ చట్టాన్ని ఆ సంస్థ ఛైర్మన్ రామోజీ రావు, మేనేజింగ్ డైరెక్టర్ శైలజా కిరణ్ సంవత్సరాల తరబడి అతిక్రమిస్తూ వస్తున్నారనేది ఆయన ప్రధాన ఆరోపణగా ఉంది. ప్రజల నుంచి చిట్స్ రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని రామోజీరావు తన గ్రూప్‌లోని ఇతర సంస్థలకు మళ్లించారని ఆరోపిస్తున్నారు. వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఉండవల్లి మార్గదర్శి వ్యవహారంలో న్యాయపోరాటం చేస్తున్నారు. తాజాగా చంద్రబాబు వ్యవహారంలో లీగల్ ఫైట్‌కు రెడీ అవ్వడంపై ఏమి జరుగుతుందోనని ఆసక్తి నెలకొంది.