Alluri District : ఇసుక ర్యాంప్ వద్ద విషాదం - వాగులో కొట్టుకుపోయి ఇద్దరు మృతి, మరో ఇద్దరు గల్లంతు..!
అల్లూరి జిల్లాలోని ఏలేరు వాగు వద్ద విషాదం చోటు చేసుకుంది. ఇసుక ర్యాంప్ వద్ద నలుగురు వ్యక్తులు కొట్టుకుపోయారు. ఇందులో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. వీరంతా కూడా కూలీ పనులు చేసేవారిగా గుర్తించారు. ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఏలేరు వాగులో ఇసుక ర్యాంప్ వద్ద నలుగురు కొట్టుకుపోయారు. ఇందులో ఇద్దరు మృతి చెందగా… మరో ఇద్దరు గల్లంతు అయ్యారు. వీరి ఆచూకీ కోసం ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి. నలుగురిలో ముగ్గురు ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో ఆ కుటుంబం తల్లడిల్లిపోతుంది. నలుగురు కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
ఈ విషాద ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం తిమ్మాపురం పంచాయతీ సమీపంలోని బొంగరాలపాడు ఇసుక ర్యాంప్ వద్ద శుక్రవారం చోటు చేసింది. కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలం తూర్పు లక్ష్మీపురం గ్రామానికి చెందిన వీరమల్లు జయబాబు (26), అతడి తండ్రి వీరమల్లు భూషణం (52), అల్లుడు బేదంపూడి చినగొంతయ్య (32) సొంత ఇల్లు నిర్మాణానికి ఇసుక కోసం అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ చింతా శ్రీనువాసు (16), శామ్యూల్‌తో కలిసి ఏలేరు వాగులో ఇసుక ర్యాంప్ వద్ద వెళ్లారు.
ఇద్దరు మృతి.. మరో ఇద్దరి కోసం గాలింపు..
ఇసుక తవ్వి తీసే క్రమంలో తొలుత భూషణం మునిగిపోయారు. ఆయనను రక్షించే క్రమంలో పక్కనే ఉన్న జయబాబు, వారిని రక్షించేందుకు గొంతయ్య, చింతా శ్రీను ప్రయత్నించారు. ఇలా ఒకరి తరువాత ఒకరు వాగులో గల్లంతయ్యారు. ఈ ప్రమాదాన్ని కళ్లారా చూసి ఆందోళనకు గురైన శామ్యూల్ అస్వస్థతకు గురయ్యాడు. నెమ్మదిగా ఒడ్డుకు చేరుకున్నారు. అతనిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. నలుగురు మునిగిపోవడాన్ని సమీపంలో చేపల వేట సాగిస్తున్న మత్య్సకారులు గుర్తించారు. వెంటనే వలలు వాగులోకి విసిరి గాలింపు చేపట్టినా వారి ఆచూకీ లభ్యం కాలేదు.
రంపచోడవరం డీఎస్పీ జి.సాయి ప్రసాంత్, అడ్డతీగల సీఐ నరసింహమూర్తి, ఎస్ఐ బి.వినోద్ కుమార్, ఎమ్మార్వో శ్రీనివాసరావు, విఆర్‌వో వెంకయ్యమ్మ పర్యవేక్షణలో ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు. దీంతో సాయంత్రానికి జయబాబు, చినగొంతయ్య మృతదేహాలను వెలికి తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు అడ్డతీగల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భూషణం, మరో యువకుడు చింత శ్రీనివాసు ఆచూకీ లభ్యం కాలేదు. వీరి కోసం పోలీసులు, కుటుంబ సభ్యులు, ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపడుతున్నాయి.
ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృతి చెందడం, మరో ఇద్దరు ఆచూకీ లభ్యం కాకపోవడతో ఆ గ్రామంలో విషాధ చాయలు అలుముకున్నాయి. అలాగే ప్రమాద సమచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు ఘటన స్థలానికి చేరుకుని నుంచి రోధించారు. భర్త భూషణం, కుమారుడు జయబాబు ప్రమాదానికి గురి కావడంతో వీలమల్లు లక్ష్మీ తల్లడిల్లిపోయింది. కుమారుడు మృతితో ఆమె రోదన కలిచివేసింది.
ప్రమాదంలో గల్లంతైన చినగొంతియ్య.. భూషణానికి బంధువు. కూలీ పనుల నిమిత్తం వచ్చి తూర్పు లక్ష్మీపురంలో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. పని కోసం వచ్చి గల్లంతవడంతో చినగొంతియ్య కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు.
చింతా గోపి, సత్యవతిలకు ముగ్గురు సంతానం కాగా శ్రీనివాస్ పెద్దవాడు. కుటుంబానికి పెద్దదిక్కుగా ఉన్నాడు. కూలీ పనులు చేస్తూ ఆసరాగా నిలుస్తున్నాడు. అతడు గల్లంతవ్వడంతో ఆయన కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఘటనా స్థలాన్ని రంపచోడవరం, ప్రతిపాడు ఎమ్మెల్యేలు మిరియాల శిరీషా దేవి, వరుపుల సత్యప్రభ పరిశీలించారు. మృతులు, గల్లంతైన వారి కుటుంబీకులను పరామర్శించి ఓదార్చారు. గాలింపు చర్యలపై డీఎస్పీ సాయి ప్రశాంత్, సబ్ కలెక్టర్ కల్పశ్రీతో మాట్లాడారు.