TTD Temple in Amaravati : అమరావతిలో వైభవంగా శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ
గుంటూరు జిల్లా వెంకటపాలెంలో టీటీడీ నూతనంగా నిర్మించిన శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయానికి మిథున లగ్నంలో శాస్త్రోక్తంగా మహాసంప్రోక్షణ జరిగింది. ఆలయ శిలాఫలకాన్ని విశాఖ శారద పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి, గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్, టీటీడీ చైర్మన్ వైవి.సుబ్బారెడ్డి ఆవిష్కరించారు.
అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా వెంకటపాలెంలో టీటీడీ నిర్మించిన ఆలయానికి మహాసంప్రోక్షణతో భక్తుల దర్శనానికి అనుమతిస్తున్ారు. పుణ్యాహవచనం, కుంభారాధన, నివేదన, హోమం, మహాపూర్ణాహుతితో ఆలయాన్ని భక్తుల దర్శనానికి సిద్ధం చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రారంభోత్సవంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
శ్రీవారి ఆలయ మహాసంప్రోక్షణ అనంతరం ఆలయ ముఖమండపంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరించందన్‌కు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి శాలువతో సన్మానించి, స్వామివారి చిత్రపటం అందించారు. గవర్నర్ కు టీటీడీ వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనాలు అందించారు. వేంకటేశ్వర స్వామి వారి ఆలయ మహాసంప్రోక్షణ సందర్బంగా వైదిక క్రతువుల్లో పాల్గొన్న అర్చకులు, వేద పారాయణం దారులను టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి దంపతులు సన్మానించారు. శాలువతో సత్కరించి పంచలు బహూకరించారు.
అమరావతి ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ఎంపిక చేసిన తర్వాత సీడ్‌యాక్సిస్ రోడ్డు ప్రారంభంలో టీటీడీ ఆధ్వర్యంలో భారీ ఆలయ నిర్మాణాన్ని ప్రారంభించారు. దాదాపు 40కోట్ల రుపాయల వ్యయంతో టీటీడీ ఈ ఆలయాన్ని నిర్మించింది. నాలుగేళ్లుగా శిల్పకారులు, సిబ్బంది శ్రమతో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు.
టాపిక్