TTD Board Meeting : టీటీడీ ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి చివరి సమావేశం, పాలక మండలి కీలక నిర్ణయాలివే!-ttd board meeting as chairman yv subba reddy held last meeting key decisions ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Board Meeting : టీటీడీ ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి చివరి సమావేశం, పాలక మండలి కీలక నిర్ణయాలివే!

TTD Board Meeting : టీటీడీ ఛైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి చివరి సమావేశం, పాలక మండలి కీలక నిర్ణయాలివే!

Bandaru Satyaprasad HT Telugu
Aug 07, 2023 04:20 PM IST

TTD Board Meeting : టీటీడీ పాలక మండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమల ఓఆర్ఆర్ లో ఛార్జింగ్ స్టేషన్లు, నెయ్యి ప్లాంట్ , ఆలయాల అభివృద్ధి పనులకు కేటాయింపులు చేశారు.

వైవీ సుబ్బారెడ్డి
వైవీ సుబ్బారెడ్డి

TTD Board Meeting : టీటీడీ పాలక మండలి సమావేశం సోమవారం జరిగింది. టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన తిరుమల అన్నమయ్య భవన్ లో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాలక మండలి నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మీడియాకు వివరించారు. తిరుపతి శ్రీనివాస సేతు ప్రాజెక్టుకు రూ.118 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అలిపిరి నడకమార్గంలో నరసింహస్వామి ఆలయం నుంచి మోకాలిమిట్ట వరకు భక్తుల కోసం రూ.4 కోట్ల వ్యయంతో షెడ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. పీఏసీ మరమ్మతు పనులకు రూ.2.5 కోట్లతో కేటాయించినట్లు తెలిపారు. రూ.24 కోట్లతో రెండు ఘాట్ రోడ్లలో క్రాష్ బ్యారియర్లు, రూ.4.5 కోట్లతో నాణ్యత పరిశీలనకు ల్యాబ్ ఆధునికీకరణ చేపట్టనున్నారు. శ్రీనివాసం వద్ద సబ్ వే నిర్మాణానికి రూ. 3 కోట్లు పాలక మండలి కేటాయించింది.

తిరుమలలో ఓఆర్ఆర్ లో ఛార్జింగ్ స్టేషన్లు

తిరుచానురు పద్మావతి అమ్మవారి ఆలయం వద్ద క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి రూ.23.50 కోట్లు కేటాయించారు. మంగాపురం ఆలయం వద్ద అభివృద్ధి పనులకు రూ.3.10 కోట్లు ఖర్చు చేయనున్నారు. రూ. 9.85 కోట్లతో వకుళమాత ఆలయం అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. తిరుమలలో ఔటర్ రింగ్ రోడ్డులో ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు రూ.2.60 కోట్లు కేటాయించారు. ఎస్‌వీ ఆయుర్వేద కళాశాల అభివృద్ధి పనులకు రూ. 11.5 కోట్లు, రుయాలో టీబీ వార్డు ఏర్పాటుకు రూ.2.20 కోట్లు, ఎస్‌వీ సంగీత కళాశాల అభివృద్ధి పనులకు రూ.11 కోట్లు టీటీడీ పాలక మండలి కేటాయించింది. తిరుపతిలోని వేశాలమ్మ ఆలయం, పెద్ద గంగమ్మ ఆలయ అభివృద్ధికి రూ.1.25 కోట్లు కేటాయించారు. గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్‌ను టీటీడీ ఆస్థాన విద్వాంసుడిగా మరో మూడు సంవత్సరాలు పొడిగిస్తూ పాలక మండలి ఆమోదం తెలిపింది. టీటీడీ ఆస్తుల పరిరక్షణలో భాగంగా 69 స్థలాలకు కంచె ఏర్పాటు చేసేందుకు రూ. 1.25 కోట్లు కేటాయించారు. ప్రసాదాల తయారీ కోసం వినియోగించే నెయ్యి ప్లాంట్ ఏర్పాటుకు రూ. 5 కోట్లు కేటాయించినట్లు ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు.

టీటీడీ నూతన ఛైర్మన్ గా భూమన

టీటీడీ పాలక మండలి నూతన ఛైర్మన్‌గా నియమితులపై భూమన కరుణాకర్ రెడ్డి సోమవారం శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డిని నియమిస్తూ సీఎం జగన్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు. సోమవారం శ్రీవారి దర్శనంతరం పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి, శ్రీవారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల భూమన కరుణాకర్ రెడ్డికి భక్తులు పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు. రెండోసారి టీటీడీ ఛైర్మన్‌గా నియమితులు ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని భూమన అన్నారు. ఈ నెల 8వ తేదీతో వైవీ సుబ్బారెడ్డి పాలకమండలి గడువు ముగిస్తుంది. 10న టీటీడీ నూతన పాలక మండలి ఛైర్మన్‌గా భూమన కరుణాకర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Whats_app_banner