నెల్లూరులో ఘోర అగ్ని ప్రమాదం..పేలిన గ్యాస్ సిలిండర్లు.. సజీవదహనమైన దివ్యాంగురాలు
నెల్లూరు జిల్లాలో జరిగిన ఓ అగ్ని ప్రమాదంలో ఒక దివ్యాంగురాలైన బాలిక మృతి చెందిన సంఘటన కన్నీరు పెట్టించింది.
నెల్లూరులోని భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నెల్లూరు టౌన్‌లో 5వ డివిజన్ బర్మాషల్ గుంట ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. గ్యాస్ సిలిండర్లు పేలడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాద ఘటనలో దివ్యాంగురాలైన బాలిక నాగలక్ష్మి (12) సజీవ దహనమైంది. నాలుగు గుడిసెలు అగ్నికి ఆహుతయ్యాయి. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని, మంటలు అదుపు చేశారు. ఆ ప్రాంతమంత ఒక్కసారిగా నల్లటి పొగ కమ్నేయడంతో స్థానిక ప్రజల్లో ఏం జరుగుతుందో తీవ్రమైన భయం నెలకొంది. దీంతో ప్రజలు, చుట్టుపక్కల వారు ప్రాణభయంతో ఉరుకులు, పరుగులు తీశారు.
అసలేం జరిగింది?
బర్మాషల్ గుంట ప్రాంతంలో కొందరు బీడీలు, చుట్టలు చుట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారంత రోజువారీ కూలీలే. గురువారం మధ్యాహ్నం నాగలక్ష్మి ఇంట్లో గ్యాస్ లీకైంది. అలాగే దీనికితోడు షార్ట్ సర్క్యూట్ కావడం, ఒక్కసారిగా మంటలు వేగంగా వ్యాపించాయి. ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి వ్యాపించాయి. స్థానిక ప్రజలు మంటలు ఆర్పేందుకు కొందరు ప్రయత్నించగా, మరికొందరు పరుగులు తీశారు. ప్రాణాలు అర చేతిలో పెట్టుకుని అక్కడ నుంచి నిష్క్రమించారు.
ఇంతలో కొందరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో ఆ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు. అతికష్టం మీద మంటలను అదుపు చేశారు. మంటల్లో చిక్కుకున్న నాగలక్ష్మి బయటకు రాలేక సజీవదహనమయ్యారు.
ఈ ప్రమాదంలో నాలుగు పూరిగుడిసెలు పూర్తిగా కాలిపోగా, 14 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రోజువారీ కూలీలందరూ పనులకు వెళ్లగా వారి ఇంట్లో సామాగ్రి కాలిబూడిదైంది.
నెల్లూరు కలెక్టర్ హరినారాయణన్ సంఘట స్థలాన్ని పరిశీలించి, ప్రభుత్వం తరపున సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు అబ్దుల్ అజీజ్, సీపీఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ కూడా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంలో ఇళ్లు కోల్పోయిన వారికి ప్రభుత్వమే పక్కా ఇళ్లు నిర్మించాలని రమేష్ డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే నారాయణ స్పందిస్తూ బాలిక కుటుంబానికి రూ. 50 వేలు ఇస్తామని ప్రకటించారు. ఘటనలో దెబ్బతిన్న ఒక్కొ ఇంటికి రూ. 15 వేలు ఆర్థిక సహాయం ప్రభుత్వం అందజేస్తుందని అన్నారు.
- జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు