TTD Board Meeting : కార్పొరేషన్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికుల జీతాల పెంపు, టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలివే!-tirumala ttd board meeting key decisions corporation employees sanitation worker salaries hiked ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ttd Board Meeting : కార్పొరేషన్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికుల జీతాల పెంపు, టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలివే!

TTD Board Meeting : కార్పొరేషన్ ఉద్యోగులు, పారిశుద్ధ్య కార్మికుల జీతాల పెంపు, టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలివే!

Bandaru Satyaprasad HT Telugu
Oct 09, 2023 04:05 PM IST

TTD Board Meeting : టీటీడీ పరిధిలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, కార్పొరేషన్ ఉద్యోగులకు పాలక మండలి గుడ్ న్యూస్ చెప్పింది. పారిశుద్ధ్య కార్మికుల జీతాలను రూ.12 వేల నుంచి 17 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కార్పొరేషన్ ఉద్యోగులకు ఏటా 3 శాతం జీతాలు పెంచాలని నిర్ణయించింది.

తిరుమల
తిరుమల

TTD Board Meeting : టీటీడీ ధ‌ర్మక‌ర్తల మండ‌లి అధ్యక్షులు భూమ‌న క‌రుణాక‌ర‌రెడ్డి అధ్యక్షత‌న సోమ‌వారం తిరుమ‌ల అన్నమ‌య్య భ‌వ‌నంలో పాలక మండ‌లి స‌మావేశం జ‌రిగింది. ఈ సమావేశంలో పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. అలిపిరి వద్ద ప్రతి నిత్యం శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిర్వహించాలని నిర్ణయించింది. భక్తులు తమకు ముఖ్యమైన రోజులలో హోమంలో స్వయంగా పాల్గోనే అవకాశం కల్పిస్తామని తెలిపింది. టీటీడీ పారిశుద్ధ్య కార్మికుల జీతాలను రూ.12 వేల నుంచి రూ.17 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 5 వేల మంది పారిశుద్ధ్య కార్మికులకు జీతాల పెంపు వర్తిస్తుందని ప్రకటించింది. టీటీడీ పరిధిలోని కార్పొరేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగుల జీతాలను ప్రతి సంవత్సరం 3 శాతం పెంచేలా టీటీడీ నిర్ణయం తీసుకుంది. కార్పొరేషన్ లో పనిచేసే ఉద్యోగులు అకాల మరణం పొందితే వారికి రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించేందుకు నిర్ణయం తీసుకుంది.

yearly horoscope entry point

రూ.40 కోట్ల నాలుగు వరుస రోడ్డు

కార్పొరేషన్ లో పని చేస్తూ ఈఏస్ఐ వర్తించని ఉద్యోగులుకు హెల్త్ స్కీం అమలు చేయాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. నారాయణగిరి ఉద్యానవనంలో కంపార్టుమెంట్లు ఏర్పాటుకు రూ.18 కోట్లు కేటాయించారు. నారాయణగిరిలో హోటల్, అన్నమయ్య భవన్ లో హోటల్స్ ను టూరిజం శాఖకు అప్పగించాలని బోర్డు నిర్ణయించింది. ఆకాశగంగ నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు రూ.40 కోట్ల వ్యయంతో నాలుగు వరుసల రోడ్డు నిర్మించేందుకు పాలకమండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వరహస్వామి అతిథి గృహం నుంచి అవుటర్ రింగ్ రోడ్డు వరకు రూ.10.8 కోట్లతో నాలుగు వరుసల రోడ్డు నిర్మించేందుకు అంగీకరించారు. తిరుపతిలో టీటీడీ అనుభంధ ఆలయాలు, భక్తులు సంచరించే ప్రాంతాలలో మేరుగైన పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఆ బాధ్యతలను టీటీడీ పరిధిలోకి తీసుకువస్తామని బోర్డు తెలిపింది. పురాతన ఆలయ గోపురాల నిర్వహణ పర్యవేక్షణకు నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయనున్నారు.

గరిమేళ్ల బాలకృష్ణ ప్రసాద్ కు పద్మశ్రీ సిఫార్సు

తిరుపతిలోని చేర్లోపల్లి నుంచి శ్రీనివాస మంగాపురం వరకు రూ.25 కోట్ల వ్యయంతో నాలుగు వరుసల రోడ్డు నిర్మించనున్నారు. టీటీడీ పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన భోజన సౌకర్యం కల్పించేందుకు నిధులు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. టీటీడీ కల్యాణ మండపాలలో వివాహాల సందర్భంగా డీజేలకు బదులుగా లలితా గీతాలు పాడుకోవడానికి మాత్రమే అనుమతిస్తామని పాలక మండలి తెలిపింది. టీటీడీ ఆస్థాన విద్వాంసుడు గరిమేళ్ల బాలకృష్ణ ప్రసాద్ కు పద్మశ్రీ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతూ పాలకమండలి తీర్మానం చేసింది. గరుడా సర్కిల్ వద్ద రోడ్డు వెడల్పు చేసేందుకు టీటీడీ నిధులు కేటాయించనుంది.

అలిపిరిలో పార్కింగ్ షెడ్లు నిర్మాణం

దూరప్రాంతాల నుంచి వచ్చే యాత్రికులు తమ బస్సులు, ఇతర వాహనాలను అలిపిరిలో పార్క్‌ చేసి తిరుమలకు వెళ్లడం ఆనవాయితీగా వస్తోంది. అలిపిరిలో ప్రస్తుతం 130 వాహనాలను పార్క్‌ చేసేందుకు 2.47 ఎకరాలు మాత్రమే అందుబాటులో ఉంది. రోజురోజుకూ పెరుగుతున్న యాత్రికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని అదనంగా మరో 156 బస్సులు, 683 కార్లు/జీపులు, 1325 ద్విచక్రవాహనాలు పార్కింగ్‌ చేసుకునే విధంగా, 7 అదనపు టాయ్‌లెట్లు, యాత్రికులు వంట చేసుకునేందుకు అనువుగా మూడు షెడ్లు నిర్మాణానికి మరో 11.34 ఎకరాలు అభివృద్ధి చేసి, ఇక్కడ బీటీ రోడ్లు, భూదేవి కాంప్లెక్సు వద్ద దర్శన టోకెన్లు పొందే భక్తులకు క్యూలైన్లు, లైటింగ్‌ తదితర వసతులు కల్పించేందుకు రూ.21.60 కోట్లతో పరిపాలన అనుమతికి పాలక మండలి ఆమోదం తెలిపింది.

Whats_app_banner