Kurnool Project: కర్నూలులో దారుణం, గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ ఫేజ్ 1 పంప్ హౌస్‌లో విధ్వంసం
Kurnool Project: ఆంధ్రప్రదేశ్‌లో విధ్వంస రాజకీయాలు సాగునీటి ప్రాజెక్టులకు కూడా పాకాయి. కర్నూలు జిల్లా మంత్రాలయంలో ఇరిగేషన్ పంప్ హౌస్‌ను ధ్వంసం చేయడం కలకలం రేపింది.
Kurnool Project: ఏపీలో విధ్వంసకర రాజకీయాలు కొనసాగుతున్నాయి. కర్నూలు జిల్లా మంత్రాలయంలో సాగునీటి పంప్‌హౌస్‌ను దుండగులు ధ్వంసం చేశారు. రాజకీయ కక్షల్లో భాగంగానే ఇరిగేషన్ ప్రాజెక్టును ధ్వంసం చేసినట్టు తెలుస్తోంది.
కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం మాధవవరంలో గురు రాఘవేంద్ర ప్రాజెక్టు స్టేజ్ 1 పంప్ హౌస్‌ను గుర్తు తెలియని వ్యక్తలు ధ్వంసం చేశారు. ఈ ప్రాజెక్టు కింద దాదాపు 5వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తున్నారు.
గురురాఘవేంద్ర ప్రాజెక్టు పంప్ హౌస్ నుంచి నీటిని విడుదల చేసేందుకు సిద్ధమైన తరుణంలో కంట్రోల్ రూమ్‌లో జరిగిన విధ్వంసం వెలుగు చూసింది. ఫేజ్1 పంప్ హౌస్‌లో కంట్రోల్ ప్యానల్స్‌ను విరగ్గొట్టేశారు. పంప్ హౌస్‌లో ఉండే మోటర్లు, కాపర్ వైర్ల కోసం చోరీ జరిగి ఉంటుందని తొలుత భావించారు.
అయితే సామాగ్రి మొత్తాన్ని పనికి రాకుండా చేయడంతో రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగానే గురు రాఘవేంద్ర ప్రాజెక్టు ఫేజ్1 పంప్ హౌస్ ను ధ్వంసం చేసి ఉంటారని అధికారులు అంచనాకు వచ్చారు.
ఇరిగేషన్ ప్రాజెక్టు కార్యాలయంలో విధ్వంసంపై ఇరిగేషన్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు గురు రాఘవేంద్ర ప్రాజెక్టు స్టేజ్ 1 పంప్ హౌస్ ధ్వంసంతో ఆ ప్రాంతంలో సాగునీటి సరఫరా నిలిచిపోయింది. రాజకీయ కక్షలతో పంప్ హౌస్ ధ్వంసం చేశారనే అనుమానాలను ఇరిగేషన్ అధికారులు వ్యక్తం చేశారు. పంప్ హౌస్‌లో విలువైన సామాగ్రి కోసం చేసిన ప్రయత్నమైతే ట్రాన్స్‌ఫార్మర్లు, మోటర్లు అలాగే ఉన్నాయని చెబుతున్నారు. పంప్ హౌస్ సిబ్బంది ఏమయ్యారనే ప్రశ్నలకు ఇరిగేషన్ అధికారులు పెదవి విప్పడం లేదు.