Punganur Attacks: పుంగనూరులో ఉద్రిక్తత, ఎంపీ మిథున్‌రెడ్డి వాహనాలు ధ్వంసం, మాజీ ఎంపీ రెడ్డప్ప నివాసం ముట్టడి
Punganur Attacks: పుంగనూరులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బస చేసిన మాజీ ఎంపీ రెడ్డప్ప ఇంటిపై రాళ్లదాడి జనిగింది. దీంతో పుంగనూరులో హై టెన్షన్ నెలకొంది.
Punganur Attacks: మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి రావడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మిథున్ రెడ్డిని అడ్డుకున్న టీడీపీ నేతలు, శ్రేణులు అతనికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మిథున్ రెడ్డి రైతు ద్రోహి అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో రాళ్లు ఇరువర్గాలు రువ్వుకున్నాయి. దాడిలో మిథున్ రెడ్డి కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. రాళ్లదాడిలో ముగ్గురు పోలీసులకు గాయాలు అయ్యాయి.
చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్పను పరామర్శించేందుకు గురువారం ఉదయం రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి పుంగనూరు వెళ్లారు. ఈ సమయంలో ఎంపీగా ఉన్న సమయంలో రెడ్డప్ప తమను వేధింపులకు గురి చేశారంటూ టీడీపీ,జనసేన కార్యకర్తలు రెడ్డప్ప ఇంటిని చుట్టు ముట్టారు. రెడ్డప్ప నివాసంపై రాళ్లు రువ్వారు. దీంతో రెడ్డప్ప నివాసం వద్దకు భారీగా వైసీపీ శ్రేణులు చేరుకున్నాయి. ఒకరిపై ఒకరు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు పోలీసులతో పాటు కార్యకర్తలకు గాయాలయ్యాయి.
ఎన్డీఏ కూటమి కార్యకర్తల్ని అదుపు చేసేందుకు పోలీసులు రబ్బర్ బులెట్లతో కాల్పులు జరిపారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ దాడుల్లో పెద్ద సంఖ్యలో వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో పుంగనూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది.
పథకం ప్రకారమే దాడి…
టీడీపీ నేతలు పథకం ప్రకారమే తన ఇంటిపై దాడి చేశారని రెడ్డప్ప ఆరోపించారు. ప్లాన్ ప్రకారమే రాళ్లు, కర్రలతో టీడీపీ నేతలు వచ్చారని, మిథున్ రెడ్డి టార్గెట్ గానే టీడీపీ దాడి చేసిందని రెడ్డప్ప ఆరోపించారు. వందలాది మంది టీడీపీ కార్యకర్తలు దాడులకు దిగారని, టీడీపీ కార్యకర్తలు తన ఇంటిని చుట్టుముట్ట బయట ఉన్న కార్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారని ఆరోపించారు. కూటమి కార్యకర్తలు దాడులు చేస్తుంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారని మాజీ ఎంపీ రెడ్డెప్ప ఆరోపించారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా మిథున్ రెడ్డిని గృహనిర్బంధం చేశారు.