TDP : పొత్తులు ఉన్నట్టా! లేనట్టా.....టీడీపీ నేతల్లో గుబులు
ఎన్నికల పొత్తుల సంగతి ఎటూ తేలక పోవడంతో టీడీపీ నేతలుు టెన్షన్ పడిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా బరిలో దిగుతుందా, జనసేనతో కలిసి పోటీ చేస్తుందా అనే విషయంలో ఎలాంటి స్పష్టత రాకపోవడంతో చాలామంది నేతలు స్తబ్దుగా ఉండి పోతున్నారు. నియోజకవర్గ సమస్యల విషయంలో సైతం అధిష్టానం ఆదేశిస్తే తప్ప రంగంలోకి దిగడం లేదు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీల మధ్య పొత్తుల లెక్కలు కొలిక్కి రాకపోవడంతో తెలుగుదేశం పార్టీ నేతల్లో గుబులు రేగుతోంది. జనసేనతో కలిసి పోటీ చేస్తారని టీడీపీ నేతల అంతర్గత సంభాషణల్లో ప్రచారం జరుగుతున్నా, దాని మీద ఎలాంటి క్లారిటీ లేకపోవడంతో నేతల్లో భయం పట్టుకుంది. గత నెలలో జరిగిన పార్టీ ప్లీనరీలో సైతం చంద్రబాబు నాయుడు పొత్తుల మీద ఎలాంటి ప్రకటన చేయలేదు. అదే సమయంలో ఏ పార్టీతో పొత్తు ఉండదని కూడా ప్రకటించలేదు. వైసీపీని గద్దె దించడానికి ఏ త్యాగానికైనా సిద్ధమని మాత్రమే బాబు చెబుతున్నారు. చంద్రబాబు చెప్పే త్యాగం, పవన్ కళ్యాణ్ కోరుకునే త్యాగం రెండు ఒకటి కావనే క్లారిటీ మాత్రం ఇరు పార్టీల్లో ఉంది.
గతంలో టీడీపీ అధికారంలోకి రావడానికి తమ సహకారం ఉన్నందున ఈదఫా తమకు అధికారంలోకి వచ్చేందుకు టీడీపీ సహకరించాలని పవన్ కళ్యాణ్ కోరుతున్నారు. దీనిపై టీడీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. పవన్‌కళ్యాణ్‌తో పొత్తు లేకుండా టీడీపీ ఎన్నికల్లో నెగ్గ గలుగుతుందనే ఆ పార్టీ నేతల్లో ఉంది. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పీఠాన్ని ఆశిస్తుండటం కూడా టీడీపీకి రుచించడం లేదు. అయితే ఆ విషయంలో టీడీపీ బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయడం లేదు.
మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు సైతం తన బలాలతో పాటు బలహీనతలపై అవగాహన ఉంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తామని చెబుతున్నా, క్షేత్ర స్థాయిలో తమ పార్టీకి ఉన్న బలాబలాలపై ఆయనకు పూర్తి అవగాహన ఉంది. ఎన్నికల్లో పోటీకి ఇతర పార్టీలతో పొత్తు ఉన్నా, లేకున్నా తమకు ఖచ్చితంగా దక్కే స్థానాల విషయంలో ఆయనకు పూర్తి క్లారిటీ ఉంది. ఈ నేపథ్యంలో ముందే బయటపడటం అనవసరమనే అభిప్రాయం పవన్ వర్గంలో ఉంది. బీజేపీతో అవగాహన ఉన్నా దాని వల్ల జనసేన కంటే బీజేపీకి ఎక్కువ లబ్ది కలుుగతుందనే సందేహాలు కూడా లేకపోలేదు.
ఈ పరిణామాల నేపథ్యంలో జనసేన, బీజేపీలలో నేతలు టెన్షన్ పడకున్నా టీడీపీ నేతలు మాత్రం కంగారు పడుతున్నారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఇప్పటి నుంచి పన్జేస్తూ చివరకు ఎన్నికల నాటికి పొత్తులో భాగంగా తమ పరిస్థితి చిత్తవుతుందేేమోనని అనుమానాలు కూడా వారిని వేధిస్తున్నాయి. చివరి నిమిషంలో అవగాహన కుదిరి తమకు ఎమ్మెల్యే టిక్కెట్లు దక్కకపోతే పరిస్థితి ఏమిటని కంగారు పడుతున్నారు.