Nara Lokesh : ఆరోపణలు రుజువు చేయాలని నారా లోకేష్ డిమాండ్…
Nara Lokesh ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వ్యవహారంలో తనపై చేసిన ఆరోపణల్ని రుజువు చేయాలని నారా లోకేష్ డిమాండ్ చేశారు. అవినీతి ఆరోపణలు చేసి పారిపోవడం వైసీపీకి అలవాటైపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల్ని మభ్య పెట్టడానికే వైసీపీ బురద చల్లుడు కార్యక్రమం అమలు చేస్తోందని ఆరోపించారు.
Nara Lokesh స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణం వ్యవహారంలో తనపై ఆరోపణలు చేస్తున్న వైసిపి నాయకులకు టిడిపి ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సవాలు విసిరారు. స్కిల్ డెవలప్మెంట్ కి సంబంధించి తనపై చేస్తున్న ఆరోపణల పై దమ్ముంటే 24 గంటల్లో ఆధారాలు బయటపెట్టాలని ఛాలెంజ్ చేశారు. ఆరోపణలు చేసి పారిపోవడం వైసిపి నేతలకు అలవాటుగా మారిందని విమర్శించారు. వైసిపి నేతలు మాదిరిగా అందరూ అవినీతి పరులే అని ప్రజల్ని మభ్య పెట్టడానికే బురద జల్లే కార్యక్రమాన్ని పెట్టుకున్నారని ఆరోపించారు.
వైసీపీ అధికారం లోకి వచ్చి మూడు ఏళ్ల 8 నెలలు అయ్యిందని, ఆ పార్టీ చేయని విచారణ లేదని, తనతో పాటు చంద్రబాబుపై చేసిన ఆరోపణల్లోనూ వాస్తవం లేదని తేలిపోయిందని, వైసీపీ నాయకుల మాదిరి అవినీతి కి పాల్పడి చిప్పకూడు తింటాం అనుకోవడం అవివేకమని ఎద్దేవా చేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ , ఫైబర్ గ్రిడ్, ఐటి కంపెనీలు రాయితీలు, ఇలా అనేక విషయాల్లో తనపై అవినీతి బురద జల్లారని, ఒక్క ఆరోపణలో కూడా ఆధారాలు చూపలేక పారిపోయారని విమర్శించారు.
చంద్రబాబు మీద ఎంతో అల్లరి చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసును కూడా కోర్టు కొట్టేసిందని, జగన్ రెడ్డికి పాలన చేతగాక ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోతున్న వేళ మరోసారి ప్రజల దృష్టి ని మరల్చేందుకు స్కిల్ డెవలప్మెంట్ లో అవినీతి అంటూ తనపై కొత్త ఆరోపణలు మొదలు పెట్టారన్నారు. వైసిపి తనపై చేస్తున్న అన్ని ఆరోపణలు ఫుల్ స్టాప్ పెట్టేందుకు తాను రెడీగా ఉన్నానని లోకేష్ ప్రకటించారు. 24 గంటల సమయం ఇస్తున్నాని, స్కిల్ డెవలప్మెంట్తో తనపై చేసిన ఆరోపణల్లో ఆధారాలు వైసిపి బయటపెట్టాలని, ఆధారాలు బయటపెడతారో, ప్యాలెస్ పిల్లితో పాటు వైసిపి పిల్లులు పారిపోతాయో లేదో 24 గంటల పాటు వేచి చూస్తామన్నారు.
టాపిక్