AP News | పనిచేతకాకపోతే గేదెలు కాచుకో.. మహిళా ఎస్ఐపై తహశీల్దారు వీరంగం
విజయనగరం జిల్లాలో ఓ మహిళా ఎస్సైపై తహశీల్దారు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగం చేతకాకపోతే గేదేలు కాచుకో అంటూ అసభ్యంగా మాట్లాడారు. ఈ అంశంపై స్థానిక పోలీసులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
మహిళలపై చిన్నచూపు చూపడం, వారిపై పెత్తనం చెలాయించడం ఇప్పుడు కొత్తగా అవలంభిస్తున్న తీరు కాదు. ఎన్నో ఏళ్ల నుంచి ఈ దురాచారానికి అలవాటుపడి ఇప్పుడిప్పుడే అందులో నుంచి బయటకు వస్తున్నాం. అయినా ఇప్పటికీ ఆడవారిని చులకనగా చూడటం తగ్గలేదు. సాటి ఉద్యోగి, అందులోనూ మహిళ అని కూడా చూడకుండా మహిళా ఎస్సైపై వీరంగం చేశాడు ఓ తహశీల్దారు. పని చేతకాకపోతే యూనిఫాం తీసేసి గేదెలు కాచుకో.. ఎందుకీ ఉద్యోగం అంటూ అసభ్యకర పదాజాలంతో దూషించారు.
వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా పూసపాటి రేగల మండల తహశీల్దారు కృష్ణమూర్తి అదే ప్రాంతానికి చెందిన మహిళా ఎస్సై జయంతిని దుర్భాషలాడారు. మండలానికి చెందిన గోవిందపురం గ్రామస్థులు ప్రతిరోజూ లంకలపల్లి గుండా పక్కనే ఉన్న కందివలసగెడ్డలోని ఇసుకను ఎడ్లబండ్లలో తరలిస్తున్నారు. అయితే పెద్ద మొత్తంలో ఇసుకును తీసుకెళ్తున్నారని ఫలితంగా బోరుబావులు ఎండిపోతున్నాయని లంకలపల్లి గ్రామస్థులు వాపోతున్నారు. సోమవారం నాడు ఎండ్లబండ్లను అడ్డుకోవడంతో ఇరు గ్రామస్థుల మధ్య వివాదం చెలరేగింది.
సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ జయంతి సిబ్బంది విషయంపై ఆరా తీశారు. ఇరు గ్రామస్థులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే వారు ఎంతసేపటికీ ఆమె వినకపోవడంతో అక్కడున్న తహశీల్దారు కృష్ణమూర్తి జోక్యం కల్పించుకున్నారు. గ్రామస్థులకు సర్ది చెప్పి వివాదాన్ని సద్దుమణిగేలా చేయడంలో ఎస్ఐ విఫలమయ్యారని దూషిస్తూ అసభ్యంగా మాట్లాడారు. నీకు పనిచేతకాకపోతే.. గేదెలు కాచుకో.. నీకు ఉద్యోగం ఎందుకు అంటూ దుర్భాషలాడారు.
ఈ విషయంపై భోగాపురం ఎస్ఐ మహేశ్‌తో పాటు సిబ్బంది ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దూషణ గురించి ఎస్పీ దృష్టికి తీసుకెళ్తామని, సదరు తహశీల్దారుపై చర్యలు తీసుకుంటామని సీఐ విజయ్ కుమార్ చెప్పారు.
సంబంధిత కథనం