Raghu Rama Krishna Raju Case : టీడీపీ ఎమ్మెల్యే ర‌ఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు - పోలీస్ అధికారికి ముంద‌స్తు బెయిల్‌-supreme granted anticipatory bail to ex ips in tdp mla raghurama krishna raju case ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Raghu Rama Krishna Raju Case : టీడీపీ ఎమ్మెల్యే ర‌ఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు - పోలీస్ అధికారికి ముంద‌స్తు బెయిల్‌

Raghu Rama Krishna Raju Case : టీడీపీ ఎమ్మెల్యే ర‌ఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు - పోలీస్ అధికారికి ముంద‌స్తు బెయిల్‌

HT Telugu Desk HT Telugu
Oct 04, 2024 09:33 PM IST

టీడీపీ ఎమ్మెల్యే ర‌ఘురామ కృష్ణరాజు కేసులో పోలీస్ అధికారి విజయ్ పాల్ కు సుప్రీంకోర్టు ముంద‌స్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఇదే కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది.

రఘురామ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ
రఘురామ కేసుపై సుప్రీంకోర్టులో విచారణ (HT_PRINT)

టీడీపీ ఎమ్మెల్యే ర‌ఘురామ కృష్ణ‌రాజు కేసులో మాజీ పోలీస్ అధికారి విజ‌య్ పాల్‌కు అత్యున్న‌త న్యాయ‌స్థానం ముంద‌స్తు బెయిల్‌ను మంజూరు చేసింది. అలాగే ఏపీ ప్ర‌భుత్వానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో స‌మాధానం దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది. మ‌రోవైపు బెయిల్ పిటిష‌న్ వాదించ‌డానికి ఇద్ద‌రు సీనియ‌ర్ న్యాయ‌వాదులా? అంటూ విజ‌య్ పాల్ త‌ర‌పు న్యాయ‌వాదుల‌నుద్దేశించి ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది.

గ‌త ప్ర‌భుత్వ హ‌యంలో అప్ప‌టి వైసీపీ ఎంపీగా ఉన్న ర‌ఘురామ కృష్ణ‌రాజు (ఆర్ఆర్ఆర్‌)ను పోలీసులు క‌స్టోడియ‌ల్ టార్చ‌ర్ (క‌స్ట‌డీలో చిత్ర‌హింసలు) చేశార‌ని ఆయ‌నే గుంటూరు న‌గ‌రం పాలెం పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో ఆయ‌న అరెస్టు, చిత్ర హింస‌ల‌కు గురి చేసిన పోలీసు అధికారుల‌పై గుంటూరు పోలీసులు కేసు న‌మోదు చేశారు. అనంత‌రం ద‌ర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో భాగంగా గ‌త ప్ర‌భుత్వంలో సీఐడీలో అధికారిగా ఉన్న, ప్ర‌స్తుతం ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన‌ మాజీ ఐపీఎస్ అధికారి విజ‌య్ పాల్ ముంద‌స్తు బెయిల్ కోసం రాష్ట్ర హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు.

అయితే రాష్ట్ర హైకోర్టు ప‌లుమార్లు విచార‌ణ జ‌రిపి సెప్టెంబ‌ర్ 24న ముంద‌స్తు బెయిల్ తిర‌స్క‌రించింది. ఆయ‌న దాఖ‌లు చేసిన పిటిష‌న్‌ను కొట్టివేసింది. దీంతో విజ‌య్ పాల్ సుప్రీం కోర్టును ఆశ్ర‌యించారు. త‌న‌కు ముంద‌స్తు బెయిల్ మంజూరు చేయాల‌ని సుప్రీంకోర్టును అభ్య‌ర్థించారు. దీంతో ఈ పిటిష‌న్ శుక్ర‌వారం సుప్రీం కోర్టులో న్యాయ‌మూర్తులు జ‌స్టిస్ విక్ర‌మ్ నాథ్‌, జ‌స్టిస్ ప్ర‌స‌న్న బీ వ‌రాలే ధ‌ర్మాసనం ముందుకు విచార‌ణ‌కు వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా పిటిష‌న‌ర్ త‌ర‌పు సీనియ‌ర్ న్యాయ‌వాదులు అభిషేక్ మ‌ను సింఘ్వీ, సిద్ధార్థ ద‌వే వాద‌న‌లు వినిపించారు.

విజ‌య్ పాల్‌కు బెయిల్ మంజూరు చేయాల‌ని కోరారు. సీనియ‌ర్ న్యాయ‌వాదులు లేవ‌నెత్తిన అంశాల ఆధారంగా మాజీ ఐపీఎస్ అధికారి విజ‌య్ పాల్‌కు ముందస్తు బెయిల్‌ను సుప్రీం కోర్టు ధ‌ర్మాసనం మంజూరు చేసింది. త‌దుప‌రి ఉత్త‌ర్వులు వెలువ‌డే వ‌ర‌కు ఎలాంటి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవ‌ద్ద‌ని ప్ర‌భుత్వానికి సూచించింది. అలాగే విజ‌య్ పాల్ కూడా విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న‌కు సూచించింది.

ఏపీ ప్రభుత్వానికి నోటీసులు…!

దీంతో పాటు సుప్రీం కోర్టు ధ‌ర్మాస‌నం ప్ర‌తివాదిగా ఉన్న ఏపీ ప్ర‌భుత్వానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో స‌మాధానం దాఖ‌లు చేయాలని ఆదేశించింది. మ‌రోవైపు ఒక వ్య‌క్తికి సంబంధించిన బెయిల్ పిటిష‌న్ వాదించ‌డానికి ఇద్ద‌రు సీనియ‌ర్ న్యాయ‌వాదులా? అంటూ విజ‌య్ పాల్ త‌ర‌పు సీనియ‌ర్ న్యాయ‌వాదులు అభిషేక్ మ‌ను సింఘ్వీ, సిద్ధార్థ ద‌వేల‌ను ఉద్దేశించి ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేసింది. ఇద్ద‌రు సీనియ‌ర్లు స‌రిపోతారా? అంటూ వ్యాఖ్యానించింది.

విజ‌య్ పాల్ గ‌త ప్ర‌భుత్వం హ‌యంలోనే రిటైర్ అయ్యారు. అయితే సీఐడీలో ఆఫీస‌ర్ ఆన్ స్పెష‌ల్ డ్యూటీ (ఓఎస్‌డీ)గా ప‌దవీ విర‌మ‌ణ అనంత‌రం ఆయ‌న‌ను నియ‌మించారు. ఆ త‌రువాత ర‌ఘురామ కృష్ణ‌రాజు మీడియాతో గ‌త ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా మాట్లాడుతున్నారని ఇది రాజ‌ద్రోహమ‌ని, సుమోటోగా విజ‌య్ పాల్ కేసు న‌మోదు చేశారు.

2021లో హైద‌రాబాద్‌లో పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న రాఘురామ‌కృష్ణ‌రాజును అరెస్టు చేసి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు తీసుకొచ్చారు. అప్పుడు ఆయ‌న‌పై క‌స్ట‌డీలో చిత్ర హింస‌ల‌కు గురి చేశార‌ని, హ‌త్య య‌త్నం జ‌రిగింద‌ని పేర్కొన్నారు. దీనిపై ఆయ‌న ప్ర‌భుత్వం మారి, టీడీపీ కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌రువాత గుంటూరు న‌గ‌రం పాలెం పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

టీడీపీ ఉండి ఎమ్మెల్యే ర‌ఘు రామ కృష్ణ‌రాజు ఫిర్యాదుతో కేసు న‌మోదు అయిన‌ప్ప‌టి నుంచి విజ‌య్ పాల్ అందుబాటులో లేరు. పోలీసులు ప‌లుమార్లు నోటీసులు ఇచ్చేందుకు ప్ర‌య‌త్నించినా ఆయ‌న స్పందించ‌లేదు. ఆయ‌న కుటుంబ స‌భ్యులు కూడా విజ‌య్ పాల్ గురించి స‌మాచారం ఇవ్వ‌లేదు. ప్ర‌స్తుతం ఆయ‌న ఎక్క‌డ ఉన్నారో పోలీసుల‌కు తెలియ‌టం లేదు. ఈ కేసులో మాజీ సీఐడీ చీఫ్‌లు, వైసీపీ నేత‌లు ఉన్నారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

Whats_app_banner

సంబంధిత కథనం